కొలంబో: మొట్టమొదటి మహిళల T20 ప్రపంచ కప్ క్రికెట్ ను గెలుచుకుని భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంక రాజధాని కొలంబోలో ఆదివారం జరిగిన ఫైనల్లో నేపాల్ జట్టుపై 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయం భారతదేశం అజేయంగా నిలిచిన పరిపూర్ణమైన మెగా టోర్నీకి సంకేతంగా నిలిచింది. టోర్నమెంట్ అంతటా భారత మహిళల జట్టు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
అంధుల క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ ప్రత్యర్థి నేపాల్ ను 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులకే పరిమితం చేసింది. భారత అమ్మాయిల ఛేజింగ్ కూడా అంతే అద్భుతంగా సాగింది. భారత్ కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. 47 బంతులు మిగిలి ఉండగా భారత్ ఫైనల్లో నెగ్గి తొలి టీ20 వరల్డ్ కప్ సొంతం చేసుకుని దేశం గర్వించేలా చేసింది. ఖులా శరీర్ 27 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచి, నాలుగు బౌండరీలు బాది భారత్ ను సునాయాసంగా గెలిపించింది.
భారత మహిళల జట్టు నవీ ముంబైలో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన 3 వారాలకే ఈ విజయం వచ్చింది. ఇది మహిళల క్రికెట్ భారతదేశంలో ప్రధాన గేమ్‌లోనూ, ఇప్పుడు ప్రత్యేక విభాగంలోనూ పెరుగుతున్న స్థానానికి ఒక మైలురాయిగా నిలిచింది. సెమీ-ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించగా, నేపాల్ మరో సెమీ-ఫైనల్ లో పాకిస్తాన్ ను ఓడించి ఫైనల్ చేరుకుంది. ఇటీవల భారత మహిళల జట్టు సైతం సరిగ్గా సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మహిళల జట్టును ఓడించి ఫైనల్ చేరింది.
ఈ T20 టోర్నమెంట్ నవంబర్ 11న న్యూఢిల్లీలో ప్రారంభం కాగా, ఇందులో భారత్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక, ఆస్ట్రేలియా, USAలతో సహా మొత్తం 6 జట్లు పాల్గొన్నాయి. బెంగళూరులో కొన్ని మ్యాచ్‌లు జరిగిన తర్వాత, నాకౌట్ దశ మ్యాచులు శ్రీలంకలోని కొలంబో వేదికగా నిర్వహించారు. ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా భారత్ సగర్వంగా టైటిల్ సాధించింది.
టైటిల్ దిశగా భారత్ ప్రయాణం సాగిందిలా..
- శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించింది
- ఆస్ట్రేలియాను 209 పరుగుల తేడాతో ఓడించింది
- నేపాల్ ను 85 పరుగుల తేడాతో ఓడించింది
- యునైటెడ్ స్టేట్స్ ను 10 వికెట్ల తేడాతో ఓడించింది
- పాకిస్తాన్ ను 8 వికెట్ల తేడాతో ఓడించింది
- భారత్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది
ఫైనల్లో నేపాల్ ను 7 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు ఓడించింది (కొలంబో)
భారత్ ఈ ఘన విజయం ఆటలో మహిళా జట్టు నిలకడ ఆటతీరును స్పష్టం చేసింది. అంధుల క్రికెట్ తొలి టీ20 వరల్డ్ కప్ మొదటి ప్రయత్నంలోనే భారత మహిళలు అద్భుతం చేశారు. అజేయంగా నిలవడంతో పాటు టైటిల్ గెలిచి దేశం గర్వించేలా చేశారు. భారత క్రికెట్ చరిత్రలో భారత మహిళల టీ20 వరల్డ్ కప్ విజయం ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిపోతుంది. రాబోయే రోజుల్లో దేశంలో ఈ క్రీడకు మరింత గుర్తింపు, అభివృద్ధికి బాటలు వేశారు.