సిరీస్‌ సమం చేయాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సఫారీ గడ్డపై టీమిండియా జూలు విదిల్చింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ బ్యాటుతో విధ్వంసం సృష్టించగా.. కుల్‌దీప్‌ యాదవ్‌ బంతితో మాయ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా గడ్డపై దక్షిణాఫ్రికాను చిత్తు చిత్తుగా ఓడించి భారత జట్టు సిరీస్‌ను సమం చేసింది. రెండో టీ 20లో భారీ స్కోరు చేసిన ఓడిపోయిన టీమిండియా... మూడో టీ 20లో అద్భుతంగా పుంజుకుని ఆతిథ్య జట్టుకు చుక్కలు చూపించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన సూర్యకుమార్‌ యాదవ్‌ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. 202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన 13.5 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. దీంతో 160 పరుగుల భారీ తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు. పుట్టినరోజు నాడున అయిదు వికెట్లు తీసిన తొలి బారత బౌలర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. ఈ క్రమంలో యువరాజ్‌ రికార్డును బద్దలు కొట్టాడు. 


దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ 20లో కుల్దీప్ యాదవ్ 2.5 ఓవర్లు బౌలింగ్ చేసి 17 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 29వ పుట్టినరోజున కుల్దీప్ ఐదు వికెట్లు తీశాడు. తన పుట్టినరోజున 3 వికెట్లు తీసిన టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ రికార్డును కుల్దీప్ బద్దలు కొట్టాడు. యువరాజ్‌  డిసెంబర్ 12, 2009, మొహాలీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 23 పరుగులు చేసి మూడు వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు ఇదే రికార్డుగా నిలిచింది. దీన్ని కుల్‌దీప్‌ బద్దలు కొట్టాడు. జన్మదినాన అయిదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అంతర్జాతీయ టీ 20లోరెండుసార్లు ఐదు వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గాను నిలిచాడు. ఇప్పటివరకూ టీ 20ల్లో  భువనేశ్వర్ కుమార్ రెండు సార్లు అయిదు వికెట్లు తీయగా ఇప్పుడు ఈ రికార్డును కుల్‌దీప్‌ సమం చేశాడు.యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్ కూడా  టీ20లో ఒకసారి అయిదు వికెట్లు తీశారు. ఇప్పటివరకు 34 టీ20 మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ 6.68 ఎకానమీతో 58 వికెట్లు పడగొట్టాడు. 


ఈ మ్యాచులో 55 బంతుల్లోనే సూర్యకుమార్ యాదవ్ సెంచరీ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డును సూర్యకుమార్‌ యాదవ్‌ సమం చేశాడు. సూర్య కుమార్ ఇప్పటివరకు 4 సెంచరీలు చేశాడు. 57 ఇన్నింగ్సుల్లోనే ఈ ఘనత సాధించాడు. మ్యాక్స్‌వెల్ 92 ఇన్నింగ్సుల్లో, రోహిత్ శర్మ 140 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించగా సూర్యకుమార్‌ యాదవ్‌ కేవలం 57 ఇన్నింగ్స్‌ల్లోనే నాలుగు శతకాలు సాధించి సత్తా చాటాడు. అంతేకాకుండా టీ 20ల్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రెండో బ్యాటర్‌గా సూర్య రికార్డు సృష్టించాడు. విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్న 117 సిక్సుల రికార్డును సూర్యకుమార్‌ బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో ఎనిమిది సిక్సులతో 122 సిక్సులు కొట్టి... టీ 20లో అత్యధిక సిక్సులు కొట్టిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. తొలి స్థానంలో హిట్‌ మ్యాన్‌ రోహిత్ శర్మ ఉన్నాడు.  టీమిండియా ఇంకా భారీ స్కోరు చేసేదే కానీ చివరి రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 15 పరుగులే చేసింది. 19వ ఓవర్లో కేవలం ఆరు పరుగులే ఇచ్చిన షంసి.. రింకు (14)ను ఔట్‌ చేశాడు. దీంతో టీమిండియా నిర్ణీత  20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం ప్రొటీస్‌ కేవలం 95 పరుగులకే కుప్పకూలింది.