సెంచూరియన్‌(Centurion) వేదికగా భారత్‌(Bharat)తో జరుగుతున్న మొదటి టెస్టులో దక్షిణాఫ్రికా( South Africa) పట్టు బిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగుల భారీ స్కోరు చేసింది. డీన్‌ ఎల్గర్‌ 185 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడగా.. మార్కో జాన్సన్‌ 84 పరుగులతో సత్తా చాటాడు. వీరిద్దరి ఆట తీరుతో తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా.. 163 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
  పేస్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ఈ పరుగులను దాటి ప్రొటీస్‌ ముందు భారత్‌ మంచి లక్ష్యాన్ని నిర్దేశించాలంటే బ్యాటర్లు మెరుగ్గా రాణించాల్సి ఉంది. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు, మహ్మద్‌ సిరాజ్‌ రెండు వికెట్లు తీయగా... మిగిలిన బౌలర్లు ఒక్కో వికెట్‌ తీశారు.

 

ఇన్నింగ్స్‌ నిర్మించిన ఎల్గర్‌

ఓవర్‌నైట్‌ స్కోరు 5 వికెట్ల నష్టానికి 256 పరుగులతో మూడోరోజు ఆట కొనసాగించిన ప్రొటీస్‌ను ఎల్గర్‌ భారీ స్కోరు దిశగా నడిపించాడు. ఆరంభంలో భారత్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసింది. ఆరంభంలో పరుగులు రాబట్టేందుకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు శ్రమించారు. తొలి నాలుగు ఓవర్లలో కేవలం 9 పరుగులే వచ్చాయి. ఐదు ఓవర్లలో రెండో కొత్త బంతి తీసుకున్న భారత్‌ మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా ఎల్గర్‌, జాన్సన్‌ సమర్థంగా ఎదుర్కొన్నారు. అశ్విన్‌ బౌలింగ్‌లో ఎల్గర్‌ ఇచ్చిన క్యాచ్‌ చేజారింది. 79 ఓవర్లకు భారత్‌ స్కోరు 300 పరుగులు దాటింది. ఆరో వికెట్‌కు డీన్ ఎల్గర్, జాన్‌సెన్ 74 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. సిరాజ్‌ వేసిన ఇన్నింగ్స్‌ 88వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన జాన్సన్‌ అర్ధ శతకం సాధించాడు. కెరీర్‌లో అతడికిది రెండో అర్ధ శతకం కావడం గమానార్హం. చాలాసేపటి తర్వాత ఎట్టకేలకు భారత్‌కు ఉపశమనం లభించింది. 94.5వ ఓవర్లో శార్దూల్‌ ఠాకూర్‌ బౌలింగ్‌లో షార్ట్‌ పిచ్‌ బంతిని ఆడబోయిన ఎల్గర్‌ వికెట్‌ కీపర్‌కు దొరికిపోయాడు. భారీ శతకంతో ఇన్నింగ్స్‌ను నిర్మించిన డీన్‌ ఎల్గర్‌ 185 పరుగులు చేసి ఔటయ్యాడు. డీర్‌ఎస్‌కు వెళ్లినా సఫారీ జట్టుకు ఫలితం అనుకూలంగా రాలేదు. ఆరో వికెట్‌కు ఎల్గర్‌-జాన్‌సెన్‌ 111 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు.

 

చివర్లో బుమ్రా మెరుపులు

అనంతరం దక్షిణాఫ్రికా బ్యాటర్లు మార్కో జాన్‌సెన్, గెరాల్డ్ కొయెట్జీ  దూకుడుగా ఆడారు. 18 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 19 పరుగులు చేసిన గెరాల్డ్ కొయెట్జీని అశ్విన్‌ అవుట్‌ చేశాడు. లంచ్‌ బ్రేక్ సమయానికి సౌతాఫ్రికా 392 పరుగులు చేసిన ప్రొటీస్‌.. 147 పరుగుల ఆధిక్యంలో ఉంది. రెండో సెషన్‌ ఆరంభం కాగానే రబాడను బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా ఎనిమిదో వికెట్ కోల్పోయింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా మార్కో జాన్‌సెన్ నిలకడగా ఆడాడు. నండ్రీ బర్గర్‌ని బుమ్రా క్లీన్‌బౌల్డ్ చేయడంతో దక్షిణాఫ్రికా తొమ్మిదో వికెట్ కోల్పోయింది. గాయం కారణంగా బావుమా బ్యాటింగ్‌కు దిగకపోవడంతో సౌతాఫ్రికా ఆలౌటైనట్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 163 పరుగుల ఆధిక్యం సంపాదించింది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.