India vs South Africa 1st ODI | రాంచీ: టీమిండియా రన్ మేషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) అద్భుత శతకం సాధించాడు. మొదట 48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ, 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్ లో ఫోర్ కొట్టడంతో కోహ్లీ శతకం పూర్తయింది. వన్డే ఫార్మాట్లో కోహ్లీకిది 52 సెంచరీ. 99 వద్ద ఫోర్ కొట్టి తనదైన శైలిలో శతకాన్ని చేశాడు. ఇదివరకే వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు కింగ్ కోహ్లీ పేరిటే ఉంది.
కెప్టెన్ గిల్ లేకపోయినా టెన్షన్ పడాల్సిన పని లేదని మ్యాచ్ ముందురోజు తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పిన మాటల్ని అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. మాకు వన్డే మాస్టర్, రన్ మేషిన్ కోహ్లీ ఉన్నాడని భరోసా ఉంచగా కింగ్ దాన్ని నిలబెట్టుకున్నాడు. కోహ్లీ, రోహిత్ జట్టులో ఉంటే కొండంత అండ అని రాహుల్ చెప్పిన మాటల్ని దిగ్గజాలు నిజం చేశారు.
బ్యాటుతోనే సమాధానం చెప్పిన కోహ్లీ
నాంద్రే బర్గర్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్లో 5వ బంతికి కోహ్లీ అద్భుత ఇన్నింగ్సుకు తెరపడింది. రియాన్ రికెల్టన్ కవర్ నుండి పరుగెత్తుతూ వెళ్లి అద్భుతమైన క్యాచ్ పట్టడంతో కోహ్లీ నిరాశగా పెవిలియన్ చేరాడు. కోహ్లీ (135 పరుగులు, 120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు) శతకంతో మరోసారి తన గేమ్ క్లాస్ రుచి చూపించాడు. విమర్శకులకు తన బ్యాటుతోనే సమాధానం చెప్పి.. తన కెరీర్ ఇంకా ముగిసిపోలేదని నిరూపించాడు.
రోహిత్ శర్మతో కలిసి శతక భాగస్వామ్యం..
ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో హాఫ్ సెంచరీతో ఫాంలోకి వచ్చిన కోహ్లీ.. ఆ తరువాత ఆడుతున్న నేటి వన్డేలో ఫాం కొనసాగించాడు. మొదట్నుంచీ దూకుడుగా ఆడిన కోహ్లీ ఫోర్లు, సిక్సర్లతో ఆకట్టుకున్నాడు. కోహ్లీ క్రీజులోకి వచ్చాక రోహిత్ శర్మ జోరు పెంచాడు. గుడ్ లెంగ్త్ బంతులను వదిలేస్తూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 48 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే రోహిత్ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఈక్రమంలో రెండో వికెట్ కు136 పరుగుల శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.
దక్షిణాఫ్రికాపై అత్యధిక వన్డే సెంచరీలు (6) చేసిన రికార్డు కోహ్లీ సొంతం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్, డేవిడ్ వార్నర్ లు చెరో 5 సెంచరీలను కోహ్లీ అధిగమించాడు. ఈ రాంచీ వేదికలో కేవలం 5 ఇన్నింగ్సుల్లో 3 సెంచరీలతో కోహ్లీ తన రికార్డును కొనసాగిస్తున్నాడు.
భారత వేదికలో అత్యధిక వన్డే సెంచరీలు
5 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు - విరాట్ కోహ్లీ, రాంచీ
7 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు - సచిన్ టెండూల్కర్, వడోదర
7 ఇన్నింగ్స్‌లలో 3సెంచరీలు - విరాట్ కోహ్లీ, విశాఖపట్నం
8 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు - విరాట్ కోహ్లీ, పూణే