IND vs PAK: టీమిండియా విజయానికి 5 కారణాలు.. పాక్ ఓటమిని శాసించింది వీరే
కొలంబోలో జరిగిన 2026 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 61 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. ఇషాన్ కిషన్ విధ్వంసక ఇన్నింగ్స్, బౌలర్ల సమష్టి ప్రదర్శన ఏకపక్ష విజయాన్ని అందించింది.

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో భారత జట్టు పాకిస్థాన్‌పై మరో చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. దాంతో సూపర్-8లో తన స్థానాన్ని దాదాపు ఖరారు చేసుకుంది. ఎంతో ఉత్కంఠ రేపుతుందని ఆశించిన ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తూ ఏకపక్షంగా సాగిన మ్యాచులో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన పోరులో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమ్ ఇండియా అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో అద్భుత ప్రదర్శన చేసింది.
ఇషాన్ కిషన్ డాషింగ్ ఇన్నింగ్స్
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు బోర్డుపై ఉంచింది. టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై భారత్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఆరంభంలోనే షాక్ తగిలినప్పటికీ, ఆ తర్వాత మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ తన ధనాధన్ బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇషాన్ వేగంగా పరుగులు రాబడుతూ 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. స్టేడియం నలుమూలలా షాట్లు ఆడుతూ పాకిస్థాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచడంలో సక్సెస్ అయ్యాడు. తన పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు.
A special knock to guide a big victory ✨
— BCCI (@BCCI) February 15, 2026
Ishan Kishan wins the Player of the Match award in Colombo 🫡
Scorecard ▶️ https://t.co/IgYYH0TeR9 #TeamIndia | #T20WorldCup | #MenInBlue pic.twitter.com/z0EONAxFoq
సూర్యకుమార్ యాదవ్ పోరాటం.. దుబే కీలక ఇన్నింగ్స్
ఇషాన్ కిషన్ అవుట్ అయిన తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. మిడిల్ ఓవర్లలో ఆచితూచి బ్యాటింగ్ చేస్తూ తిలక్ వర్మతో కలిసి భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును 170 దాటించడంలో కీలకపాత్ర పోషించాడు. . సూర్య 29 బంతుల్లో 32 పరుగులు చేయగా.. చివర్లో ఆల్ రౌండర్ శివమ్ దూబే 158.82 స్ట్రైక్ రేట్‌తో 27 పరుగులు చేశాడు. దాంతో భారత్ ఈ పిచ్ మీద పాక్‌కు భారీ టార్గెట్ ఇవ్వగలిగారు.
బంతితో సత్తా చాటిన హార్దిక్
175 పరుగుల టార్గెట్ కాపాడుకునే క్రమంలో బరిలోకి దిగిన భారత జట్టుకు బౌలర్లు అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. హార్దిక్ పాండ్యా తన మొదటి ఓవర్లోనే పాకిస్థాన్ ఓపెనర్‌ను అవుట్ చేసి తొలి దెబ్బ కొట్టాడు. 3 ఓవర్లలో కేవలం 16 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. తన బౌలింగ్ లో పాక్ బ్యాటర్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇవ్వలేదు. పాక్ స్పిన్నర్లతో ఇబ్బంది పెడితే భారత్ మాత్రం పేసర్లు, స్పిన్నర్లతో పాక్ ను కట్టడి చేసింది.
బుమ్రా అదిరే స్పెల్
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తన స్పెల్‌లో సయీమ్ అయూబ్, పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆగా వికెట్లు తీసి పాకిస్థాన్ బ్యాటింగ్‌ను బ్యాక్‌ఫుట్‌లోకి నెట్టాడు. బుమ్రా బౌలింగ్ తో పాక్ బ్యాటర్లు పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డారు.
అక్షర్ స్పిన్ మాయాజాలం..
మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ అక్షర్ పటేల్ రాణించాడు. పాకిస్థాన్ కీలక బ్యాటర్లను అవుట్ చేసి మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించేలా చేశాడు. వీరికి తోడు మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు.
176 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో భారత్ తన గ్రూపులో అగ్రస్థానాన్ని నిలుపుకుంది. టీ20 వరల్డ్ కప్‌లో పాక్ పై భారత్ ఆధిక్యం 8-1కి పెరిగింది. భారత్ నెక్ట్స్ మ్యాచ్‌ను ఫిబ్రవరి 18న నరేంద్ర మోదీ స్టేడియంలో నెదర్లాండ్స్‌తో ఆడనుంది.





















