అతడి పనైపోయింది! అంతకు ముందులా పరుగులు చేయడం లేదు! మూడేళ్లుగా ఒక్క సెంచరీ కొట్టలేకపోయాడు! అతడినెందుకు ఇంకా జట్టులోకి తీసుకుంటున్నారు. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వొచ్చు కదా! ఆఫ్ సైడ్ ది ఆఫ్ స్టంప్‌ బంతులకు ఔటైపోతున్నాడు. లెగ్‌ స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్నాడు.


- రెండు నెలల క్రితం వరకు విరాట్‌ కోహ్లీపై విమర్శలివి!


కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌! క్రీజులో ఛేజ్‌ మాస్టర్‌ ఉన్నంత వరకు టీమ్‌ఇండియాకు గెలుపు ఆశలు ఉన్నట్టే! అతడు క్రీజులో నిలిస్తే జట్టుకు తిరుగులేదు! ఏం ఫర్లేదు దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య అండతో అతడు గెలిపించేస్తాడు! ఛేదనలో అతడిని మించిన మాస్టర్‌ ఎవరున్నారో చెప్పండి.


- పాక్‌పై గెలుపు ఇన్నింగ్స్‌ తర్వాత విరాట్‌పై ప్రశంసలివి!


ఎంతలో ఎంత మారింది! అందుకే చెప్పేది! ఫామ్‌ టెంపరరీ క్లాస్‌ పర్మనెంట్‌ అని! 15 ఓవర్ల వరకు అతడి బ్యాటింగ్‌లో ఊపే ఉండదు. పరుగుల కన్నా బంతులే ఎక్కువ ఉంటాయి. స్ట్రైక్‌ రేట్‌ 80-120 మధ్యే ఉంటుంది. ఇన్నింగ్స్‌ సాగే కొద్దీ అతడి వేగం పెరుగుతుంది. డెత్‌ ఓవర్లలో అతడి జోరు మరింత ఊపందుకుంటుంది. అతడి బ్యాటు స్వింగ్‌ మెరుపును తలపిస్తుంది. స్ట్రైక్‌రేట్‌ ఒక్కసారిగా 180-200కు చేరుకుంటుంది. అప్పటి వరకు గెలుపుపై ఆశలు పెట్టుకున్న ప్రత్యర్థి జట్టుకు ఓటమి తప్పదని అర్థమైపోతుంది. మ్యాచులెన్ని ఆడినా అతడి స్టైల్‌ మారదు. మెల్‌బోర్న్‌ మైదానంలో పాక్‌ మ్యాచులోనూ అంతే! అసలు నమ్మకమే లేని చోట నుంచి టీమ్‌ఇండియాను గెలుపు తీరానికి చేర్చాడు విరాట్‌ కోహ్లీ.


నిజానికి 160 పరుగుల లక్ష్యాన్ని ఏమాత్రం ఒత్తిడి లేకుండా ఛేదించాలి. కానీ ప్రత్యర్థి బౌలర్లు తమ వేగంతో టీమ్‌ఇండియా టాప్‌ఆర్డర్‌ను డిసీవ్‌ చేశారు. వెంటవెంటనే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ, సూర్యకుమార్‌, అక్షర్‌ పటేల్‌ను ఔట్‌ చేశారు. 6.1 ఓవర్లకు  టీమ్‌ఇండియా స్కోరు 31-4! పేస్‌ బౌలర్లు పెట్టిన ఒత్తిడినే స్పిన్నర్లూ కొనసాగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్నింగ్స్‌ను నిర్మించగల అతికొద్ది మందిలో విరాట్‌ ముందుంటాడు. ఒక్కో ఇటుక పేర్చినట్టు సింగిల్స్, డబుల్స్‌ తీస్తూ ముందుకెళ్లాడు. అతడికి తగిన పాట్నర్‌ హార్దిక్‌ పాండ్య మరో ఎండ్‌లో ఉండటం లక్కీ! భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఉండటంతో ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు. ఆఖర్లో దంచికొట్టాడు.


ఏదేమైనా విరాట్‌ కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్‌ టీ20 క్రికెట్లో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎందుకంటే అత్యంత ఒత్తిడిలో నరాలు తెగే ఉత్కంఠ నడుమ దాయాది పాకిస్థాన్‌పై నమోదు చేసిన ఇన్నింగ్స్‌ ఇది. మూడేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సులభంగా ఔటయ్యేవాడు. బలహీనతలు వెంటాడాయి. నెల రోజుల విరామం తీసుకొనేంత వరకు అతడి మనసు కుదుటపడలేదు. విశ్రాంతి తీసుకొని తాజాగా ఆసియాకప్‌కు వచ్చాడు. హాఫ్‌ సెంచరీలు చేసిన ఒకట్రెండు మ్యాచుల్లో తడబడ్డాడు. అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌తో పూర్తిగా ఫామ్‌లోకి వచ్చేశాడు. సాధికారంగా పరుగులు చేస్తున్నాడు. బౌలర్లను డామినేట్‌ చేయడం మొదలెట్టాడు. ఓటమి నుంచి గెలుపుబాట పట్టించడం మళ్లీ షురూ చేశాడు. అందుకే ఈ మ్యాచ్‌ ఆఖర్లో అంత భావోద్వేగానికి గురయ్యాడు. పరుగెత్తుకుంటూ సంబరాలు చేసుకున్నాడు. ఎగిరి గంతులేశాడు. తన భావోద్వేగాన్ని కన్నీళ్ల రూపంలో బయటపెట్టాడు.


విరాట్‌ కోహ్లీ ఇలాగే సాగాలి. మైదానంలో కింగులా ఆడాలి. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయించాలి. వరుస మ్యాచులు గెలిపించాలి. ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను ఇంటికి తీసుకురావాలి. అతనాడితే ఇది అసాధ్యమేమీ కాదు! అతడు క్రీజులో ఉంటే ఇది పెద్ద టాస్కేం కాదు! ఇలాంటి ఇన్నింగ్సులే మరిన్ని ఆడి.. ఛేజ్‌ మాస్టర్‌ టేక్‌ ఏ బౌ అనిపించుకోవాలి.