India vs England 1st Test At Rajiv Gandhi International Stadium In Hyderabad:  భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కెరీర్‌లో ఓ మైలురాయిని అందుకొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లో 550 వికెట్లు తీసిన బౌలర్‌గా మారాడు. తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ ఆటగాడు జో రూట్‌ వికెట్‌తో ఈ ఘనత సాధించాడు. టెస్టుల్లో అతడికిది 277వ వికెట్‌.  జడేజా వన్డేల్లో 220, టీ20ల్లో 53 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌- రవీంద్ర జడేజా జోడి అరుదైన రికార్డును నెలకొల్పారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత జోడీగా వీరిద్దరూ నిలిచారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 504 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు అనిల్‌ కుంబ్లే - హర్భజన్ సింగ్ 501 వికెట్లు తీయగా.. వీరిద్దరూ ఆ రికార్డును బద్దలు కొట్టారు.  కుంబ్లే 281 వికెట్లు, భజ్జీ 220 వికెట్లు తీశారు. కాగా, ఈ రికార్డును అశ్విన్, జడేజా 50 టెస్టుల్లోనే అధిగమించారు. ప్రస్తుతం జరుగుగుతన్న ఇంగ్లాండ్ టెస్టులో ఓపెనర్లు క్రాలే, డకెట్‌లను అశ్విన్, పోప్‌ను జడ్డూ ఔట్ చేయడంతో ఉమ్మడిగా 503 వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. వీటిల్లో అశ్విన్ 276 వికెట్లు తీయగా, జడేజా 227 వికెట్లు పడగొట్టాడు.


చరిత్ర సృష్టించిన అశ్విన్‌


తొలి టెస్టులో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ చరిత్ర సృష్టించాడు. ప్రపంచ  టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. తొలి టెస్టులో బెన్ డకెట్, జాక్ క్రాలేను ఔట్ చేసిన అశ్విన్‌.. ఈ అరుదైన ఘనత సాధించాడు.  ప్రపంచ  టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న మూడో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు. అశ్విన్ కంటే ముందు స్థానాల్లో కమిన్స్ (169), నాథన్ లయాన్ (169) ఉన్నారు. అయితే వారిద్దరు వరుసగా 40, 41 టెస్టులు ఆడితే అశ్విన్ కేవలం 31 టెస్టులు మాత్రమే ఆడాడు.


పెవిలియన్‌కు క్యూ కట్టిన ఇంగ్లాండ్‌ బ్యాటర్లు
 ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్లను భారత స్పిన్నర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఓపెనర్లు దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్‌ ఆరంభంలో పటిష్టంగానే కనిపించింది. 11 ఓవర్లకు 53 పరుగులతో బజ్‌బాల్‌ ఆటను బ్రిటీష్‌ జట్టు గుర్తు చేసింది. కానీ స్పిన్నర్లు రంగ ప్రవేశంతో మ్యాచ్‌  స్వరూపమే మారిపోయింది. అశ్విన్‌ ఖాతాలో వికెట్ చేరింది. అశ్విన్‌ బౌలింగ్‌లో 35 పరుగలు చేసిన డకెట్‌ అవుటయ్యాడు. డకెట్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం ఇంగ్లాండ్‌కు అనుకూలంగా రాలేదు. సమీక్షలో ‘అంపైర్స్‌ కాల్’ రావడంతో డకెట్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. దీంతో 55 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సారధి రోహిత్‌ సూపర్‌ క్యాచ్‌తో ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఓలీపోప్‌ స్లిప్‌లో రోహిత్‌కు దొరికాడు. దీంతో 58 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌ నష్టపోయింది. అనంతరం సిరాజ్‌ సూపర్బ్‌ క్యాచ్‌కు మూడో వికెట్‌ పడింది. అశ్విన్‌ వేసిన 16వ ఓవర్‌ తొలి బంతికే మిడాఫ్‌లో సిరాజ్‌ మియా అద్భుతమైన క్యాచ్‌కు  ఓపెనర్‌ క్రాలే అవుటయ్యాడు. దీంతో 60 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ మూడో వికెట్‌ నష్టపోయింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లాండ్‌ స్కోరు 108/3 పరుగులతో నిలిచింది. అనంతరం అక్షర్‌ పటేల్‌ సూపర్‌ డెలివరీకి బెయిర్‌ స్టో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. బెయిర్‌ స్టో (37) పరుగులకు వెనుదిరిగాడు. దీంతో 33 ఓవర్లకు 121 పరుగుల వద్ద బ్రిటీష్‌ జట్టు నాలుగో వికెట్‌ కోల్పోయింది. జో రూట్‌ (29)ను రవీంద్ర జడేజా బోల్తా కొట్టించాడు. జడ్డూ వేసిన బంతినిరూట్ స్వీప్‌ షాట్‌ ఆడబోయి షార్ట్‌ ఫైన్‌ లెగ్‌లో బుమ్రా చేతికి చిక్కాడు.125 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ ఐదో వికెట్‌ను నష్టపోయింది. భారత స్పిన్నర్‌ అక్షర్ పటేల్‌కు మరో వికెట్‌ దక్కింది. ఇంగ్లాండ్‌ వికెట్‌ కీపర్ ఫోక్స్‌  ఇచ్చిన క్యాచ్‌ను భారత వికెట్ కీపర్‌ పట్టాడు.దీంతో 137 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ ఆరో వికెట్‌ను నష్టపోయింది. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు.