Ind Vs Eng 1st Test Latest Updates: ఇండియా, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న తొలి టెస్టు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో సాధించిన భారీ స్కోరుకు ఇంగ్లాండ్ దీటైన జ‌వాబిస్తోంది. శ‌నివారం రెండో రోజు ఆట‌ముగిసేస‌రికి 49 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల‌కు 209 ప‌రుగులు చేసింది. ప్ర‌స్తుతం క్రీజులో ఒల్లీ పోప్ (131 బంతుల్లో 100 బ్యాటింగ్, 13 ఫోర్లు), హేరీ బ్రూక్ (0 బ్యాటింగ్) తో క్రీజులో ఉన్నారు. ఇండియా కంటే ఇంగ్లాండ్ ఇంకా 262 ప‌రుగుల వెనుకంజ‌లో నిలిచింది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రాకు మూడు వికెట్లు దక్కాయి. ఇక రెండోరోజు ఓవ‌ర్ నైట్ స్కోరు 359/3 తో బ్యాటింగ్ కొనసాగించిన భార‌త్ అనుకున్న‌దానికంటే త్వ‌ర‌గానే ఆలౌట‌య్యింది. మ‌రో 112 ప‌రుగులు మాత్ర‌మే జోడించి, మిగ‌తా ఏడు వికెట్ల‌ను కోల్పోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, జోష్ టంగ్ నాలుగేసి వికెట్లు తీశారు. 

రిష‌భ్ సెంచ‌రీ..రెండోరోజు బ్యాటింగ్ కొన‌సాగించిన భార‌త్.. కు కెప్టెన్ శుభ‌మాన్ గిల్ (227 బంతుల్లో 147, 19 ఫోర్లు, 1 సిక్స‌ర్), వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ రిష‌భ్ పంత్ (178 బంతుల్లో 134, 12 ఫోర్లు, 6 సిక్స‌ర్లు)తో భారీ స్కోరును అందించేందుకు ప్ర‌య‌త్నించారు. రెండోరోజు ఇంగ్లీష్ బౌల‌ర్ల‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొన్న ఈ జంట మంచి వేగంతోనే ప‌రుగులు సాధించింది. ముఖ్యంగా పంత్ సిక్స‌ర్లతో చెల‌రేగాడు. ఇదే జోరులో 146 బంతుల్లో సెంచరీని పంత్ పూర్తి చేసుకున్నాడు. ఇక నాలుగో వికెట్ కు 209 ప‌రుగులు జోడించాక ఈ భాగ‌స్వామ్యానికి తెర‌ప‌డింది. షోయ‌బ్ బ‌షీర్ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి, గిల్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత కాసేప‌టికే భార‌త ఇన్నింగ్స్ ముగిసింది. క‌రుణ్ నాయ‌ర్ డ‌కౌట్ కాగా, కాసేప‌టికే రిష‌భ్ పంత్ వెనుదిరిగాడు. ఆ త‌ర్వాత మిగ‌తా బ్యాట‌ర్లు విఫ‌లం అవ‌డంతో భార‌త్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆ త‌ర్వాత వ‌ర్షం ప‌డ‌టంతో కాసేపు ఆట‌కు కాసేపు అంత‌రాయం క‌లిగింది. 

రాణించిన బుమ్రా..ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్ జాక్ క్రాలీ (4)ని బుమ్రా ఔట్ చేశాడు. అయితే బెన్ డ‌కెట్ (62), ఒల్లీ పోప్ రెండో వికెట్ కు మంచి భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పోప్.. వ‌న్డే త‌ర‌హాలో ఆడాడు. మ‌రో ఎండ్ లో డ‌కెట్ కూడా వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా బౌండ‌రీలు బాది, భార‌త బౌల‌ర్ల‌పై ప్రెష‌ర్ పెట్టారు. ఈ క్ర‌మంలో 68 బంతుల్లో ఫిఫ్టీ చేసుకున్న డ‌కెట్ ని కాసేప‌టికి బుమ్రా బౌల్డ్ చేశాడు. ఇక జ‌డేజా త‌న క్యాచ్ ను డ్రాప్ చేయ‌డంతో ఆ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకున్న పోప్.. 64 బంతుల్లోనే ఫిఫ్టీ చేశాడు. ఇక జో రూట్ వ‌చ్చిన త‌ర్వాత అత‌నితో క‌లిసి చక్క‌గా బ్యాటింగ్ చేసి, స్కోరు బోర్డును ప‌రుగెత్తిస్తూ వ‌చ్చాడు. అయితే ఆట చివర్లో చాలా డ్రామా నడిచింది. క్రీజులో పాతుకు పోయిన జో రూట్ (28)ని బుమ్రా ఔట్ చేశాడు. ఆ తర్వాత ప్రమాదకరమైన బ్రూక్ ను కౌడా బౌన్సర్ తో బుమ్రా ఔట్ చేయగా.. అది నో బాల్ కావడంతో అతను బతికి పోయాడు. దీంతో మరో వికెట్ పడకుండా పోప్-బ్రూక్ జంట రోజును ముగించింది.