England win toss bat first : రాంచీ(Ranchi) వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌(England) బ్యాటింగ్‌ ఎంచుకుంది. రెండు మ్యాచుల్లోనూ విఫలమైన రజత్‌ పాటిదార్‌పై భారత మేనేజ్‌మెంట్‌ నమ్మకం ఉంచింది. పాటిదార్‌ను తుది జట్టులోకి తీసుకున్నట్లు రోహిత్‌ శర్మ ప్రకటించాడు. వర్క్‌లోడ్‌తో పాటు భవిష్యత్ మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని స్టార్ బౌలర్ బుమ్రాకు విశ్రాంతినివ్వడంతో...ఈ మ్యాచ్‌లో అతడి స్థానంలో ఆకాశ్‌దీప్‌కు స్థానం దక్కింది. బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్‌ జట్టులోకి వచ్చాడు. వన్‌ డౌన్‌లో గిల్‌, తర్వాత రజత్ పటిదార్ బ్యాటింగ్‌కు రానున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్‌ జడేజా, అరంగేంట్ర టెస్టులోనే అదరగొట్టిన సర్ఫరాజ్ ఖాన్ మళ్లీ రాణించాలని జట్టు భావిస్తోంది. ఎవరు ఆడతారనేది ఆసక్తిగా మారింది. బుమ్రా గైర్హాజరీలో జడేజా, అశ్విన్‌, కుల్దీప్‌, ఆకాశ్‌దీప్‌లతో కూడిన బౌలింగ్ విభాగాన్ని సిరాజ్ ముందుండి నడపనున్నాడు.  ముగ్గురు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో కూడిన కూర్పు మంచి ఫలితాలు ఇవ్వడంతో..భారత్ అదే తరహా జట్టును ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించింది.


జోరు మీద భారత్‌
 మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో గెలిచి జోరు మీదున్న భారత్ నాలుగో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలానైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది. తొలి టెస్టు పరాభవం తర్వాత గాడిలో పడ్డ భారత్.... తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ సిరీస్ గెలిస్తే స్వదేశంలో వరుసగా 17 టెస్టు సిరీస్‌ విజయాలు భారత్‌ ఖాతాలో చేరతాయి.స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లేనప్పటికీ యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తుండటం భారత్‌కు సానుకూల అంశంగా మారింది. మూడో టెస్టులో ద్విశతకంతో అదరగొట్టిన యశస్వీ జైశ్వాల్‌...... ఈ మ్యాచ్‌లోనూ కెప్టెన్ రోహిత్‌తో ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నాడు. 


బజ్‌బాల్‌ వ్యూహం కొనసాగుతుందా..?
మరోవైపు "బజ్‌బాల్" వ్యూహం పనిచేయకపోవడం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది. తొలి టెస్టు తర్వాత..... ఇంగ్లండ్ అభిమానులు ఆశించిన మేర ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి సిరీస్‌లో నిలవాలని భావిస్తున్న ఇంగ్లీష్ జట్టు... కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. రెహాన్ అహ్మద్ స్థానంలో షోయబ్ బషీర్‌ను తీసుకుంది. స్పిన్ విభాగంలో టామ్ హర్ట్‌లీతో పాటు , సీనియర్ ఆటగాడు జోరూట్ బౌలింగ్ వేసే అవకాశముంది. బ్యాటింగ్‌లో జాక్ క్రాలీ, బెన్ డకెట్, కెప్టెన్‌ స్టోక్స్ రాణిస్తున్నప్పటికీ.....జో రూట్, బెయిర్‌స్టో బాగా ఆడాలని ఇంగ్లండ్ భావిస్తోంది. సీమ్ విభాగంలో సీనియర్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్‌తో కలిసి ఓలీ రాబిన్‌సన్ బౌలింగ్ చేయనున్నాడు. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ ముందంజలో ఉంది.


భారత్‌ ఫైనల్‌ 11:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్.


ఇంగ్లాండ్‌ ఫైనల్‌ 11:
జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్‌ స్టో, బెన్‌ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్‌ హార్ట్‌లీ, ఓలీ రాబిన్‌సన్, షోయబ్‌ బషీర్‌, జేమ్స్‌ అండర్సన్