అండర్ 19 ప్రపంచకప్(U19 World Cup 2024 ) వేట ప్రారంభమైంది. ఇప్పటికీ అయిదుసార్లు జూనియర్ పొట్టి ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న యువ భారత్... ఆరోసారి ఆ కప్పును ఒడిపి పట్టే దిశగా తొలి అడుగును బలంగా వేసింది. బంగ్లాదేశ్(IND U19 vs BAN U19)తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఘన విజయం సాధించి టీమిండియా శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా(Team India) 251 పరుగులు చేసింది. అనంతరం 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్( Bangladesh) కేవలం 167 పరుగులకే కుప్పకూలింది.
మ్యాచ్ సాగిందిలా...
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన యువ భారత్.. మొదటి పోరులో బంగ్లాదేశ్‌ను 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది. బ్లూమ్‌ఫోంటెన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ ఆదర్ష్ సింగ్(76) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ ఉదయ్ సహ్రన్(64) హాఫ్ సెంచరీతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో మరూప్ మిరందా 5 వికెట్లతో చెలరేగాడు. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్.. 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్.. ఆరంభం నుంచే క్రమం తప్పకుండా వికెట్లను కోల్పోయి 167 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో సౌమీ పాండే 4 వికెట్లతో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించగా.. ముషీర్ ఖాన్ 2 వికెట్లతో సత్తాచాటాడు. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మహ్మద్ షిహాబ్ జేమ్స్54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ తదుపరి మ్యాచ్‌లో జనవరి 25న బ్లోమ్‌ఫోంటెయిన్ వేదికగా ఐర్లాండ్‌తో తలపడనుంది.
భారత్ మ్యాచ్‌ల తేదీలు..
జూనియర్ల ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో ఈనెల 25న బంగ్లాదేశ్‌తో ఆడనుంది. గ్రూప్ దశలో భారత్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది.
జనవరి 25 : ఐర్లాండ్‌తో
జనవరి 28 : అమెరికాతో మ్యాచ్.
భారత జట్టు: ఉదయ్ సహారన్ (కెప్టెన్), సౌమీ కుమార్ పాండే, అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంశు మోలియా, ముషీర్‌ఖాన్, మురుగన్ అభిషేక్, అవనీశ్ రావు, ఇనీశ్ మహాజన్, ధనుశ్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారి; స్టాండ్‌బై: ప్రేమ్ దేవ్‌కర్, అన్ష్ గొసాయ్, మహ్మద్ అమన్
మ్యాచ్‌లు జరుగుతాయి ఇలా..
2024 జనవరిలో ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీలో 41 మ్యాచ్‌లు జరగనుండగా, ఫిబ్రవరిలో ఫైనల్ జరగనుంది. జనవరి 19 నుంచి తొలి దశ పోటీలు జరుగుతాయి. ఈనెల 28 వరకు తొలి రౌండ్ పోటీలుంటాయి. ప్రతి గ్రూపులో టాప్ -3లో ఉన్న జట్లు సూపర్ సిక్స్ దశకు చేరుతాయి. సూపర్ సిక్స్‌లో కూడా మళ్లీ నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ఈ దశలో ప్రతి గ్రూపులో టాప్ లో ఉన్న జట్టు సెమీస్‌కు అర్హత సాధిస్తుంది. ఫిబ్రవరి 3 దాకా ఈ పోటీలు సాగుతాయి. ఇక ఫిబ్రవరి 6, 8న రెండు సెమీఫైనల్స్ జరుగుతాయి. ఫిబ్రవరి 11న బెనొనిలోని విల్లోమూర్ పార్క్ వేదికగా తుది పోరు జరుగునుంది. ఈసారి గ్రూప్ స్టేజీ తరువాత సూపర్ సిక్స్ విధానాన్ని తీసుకొస్తుంది ఐసీసీ. సూపర్ సిక్స్ మ్యాచ్ ఫలితాలతో సెమీ ఫైనల్ టీమ్స్ ను నిర్ణయిస్తారు.