India vs Bangladesh Highlights, 1st Test Day 3: 

చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా(India) పట్టు బిగించింది. భారత బ్యాటర్లు చెలరేగడంతో మూడో రోజే టెస్ట్‌ భారత చేతుల్లోకి వచ్చేసింది. ఇక అద్భుతం జరిగితే తప్ప బంగ్లాదేశ్(Bangladesh) ఓటమి ఖాయమైనట్లే. 515 పరుగుల భారీ లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన బంగ్లాదేశ్... మూడో రోజు ఆట ముగిసే 158 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. బంగ్లా విజయం సాధించాలంటే ఇంకా 357 పరుగులు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికే అశ్వి(Aswin) రంగ ప్రవేశం చేసి.. మూడు వికెట్లను నేలకూల్చాడు. బంగ్లా కోల్పోయిన నాలుగు వికెట్లలో మూడు వికెట్లు అశ్విన్‌కే పడ్డాయి. ఇక నాలుగో రోజు కూడా అశ్విన్ మాయాజాలం కొనసాగితే ఫలితం రేపే వచ్చే అవకాశం ఉంది.









పంత్, గిల్‌ శతక్కొట్టారు


మూడో రోజు ఆటలో గిల్‌, రిషభ్ పంత్ ఆటే హైలెట్. బంగ్లా బౌలర్లను ఈ ఇద్దరు బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. పంత్‌ దూకుడుగా బ్యాటింగ్ చేస్తే.. శుభ్‌మన్‌ గిల్ కాస్త ఓపిగ్గా బ్యాటింగ్ చేశాడు. రోహిత్, విరాట్‌ను త్వరగా అవుట్ చేశామనే ఆనందం బంగ్లాకు కాసింతైనా లేకుండా వీరిద్దరూ చెలరేగిపోయారు. ఓవర్‌నైట్ స్కోరు 81 పరుగులకు మూడు వికెట్ల నష్టంతో మూడో రోజు భారత జట్టు ఆట ఆరంభించింది. ఇక క్రీజులో కుదురుకునేంత వరకూ కాస్త నెమ్మదిగా ఆడిన ఈ జోడి తర్వాత చెలరేగిపోయింది. బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి భారత్‌కు భారీ స్కోరు అందించింది. పంత్‌ వన్డే తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 128 బంతుల్లో 13 పోర్లు, నాలుగు సిక్సర్లతో పంత్ 109 పరుగులు చేసి అవుటయ్యాడు. గిల్‌ 176 బంతుల్లో 10 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 119 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గిల్‌-పంత్‌ కలిసి నాలుగో వికెట్‌కు 167 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. పంత్ అవుటైనా గిల్‌ మాత్రం వికెట్ ఇవ్వలేదు. స్కోరు వేగాన్ని పెంచే లక్ష్యంతో బరిలోకి దిగిన రాహుల్‌...19 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేసి అజేయంగా ఉన్నాడు. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 287/4 స్కోరు వద్ద డిక్లేర్‌ చేసింది. వీరిద్దరి దూకుడుతో తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కలుపుకుని భారత్‌ ఆధిక్యం 500 పరుగులు చేరింది. దీంతో బంగ్లాదేశ్‌కు 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తూ భారత్‌ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.


బంగ్లాకు మంచి ఆరంభం


515 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు మంచి ఆరంభం దక్కింది. బంగ్లా ఓపెనర్లు జకీర్ హసన్..షాద్‌మన్ ఇస్లాం తొలి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. 33 పరుగులు చేసి జకీర్ హసన్ అవుటైనా... వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్ నజ్ముల్ హుసైన్ శాంటో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ అశ్విన్ రంగ ప్రవేశం చేయడంతో బంగ్లా త్వరగా వికెట్లు కోల్పోయింది. 86 పరుగుల వరకూ ఒకే వికెట్ కోల్పోయిన బంగ్లా ఆ తర్వాత వరుస విరామాల్లో మూడు వికెట్లు కోల్పోయింది. ఈ మూడు వికెట్లను అశ్వినే తీశాడు. ఇక అశ్విన్‌తో పాటు మిగిలిన బౌలర్లు రాణిస్తే భారత్‌కు రేపే విజయం దక్కే అవకాశం ఉంది.