India vs australia T20 Series | భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య కీలకంగా మారిన చివరిదైన ఐదవ T20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ఈ టీ20 మ్యాచ్‌లో కేవలం 4.5 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా ఓపెనర్లు 4.5 ఓవర్లలో 52 పరుగులు చేసి దూకుడు కొనసాగించారు. కానీ గబ్బాలో వర్షం కురవడంతో మ్యాచ్ మొదట తాత్కాలికంగా నిలిపివేశారు. ఎంతకీ వర్షం తగ్గకపోవడం, కొన్ని ఓవర్లపాటు సైతం నిర్వహించే అవకాశం లేకపోవడం.. చాలా సమయం వృథా కావడంతో 5వ టీ20 మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా..
బ్రిస్బేన్‌లోని చారిత్రాత్మక గబ్బా స్టేడియంలో సిరీస్‌లో కీలకమైన 5వ T20I మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ భారత ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. కచ్చితంగా సిరీస్ నెగ్గాలన్న కసితో విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆసీస్ బౌలర్లను ఎదుర్కొని బ్యాట్‌లు ఝుళిపించడం ప్రారంభించారు. తొలి రెండు ఓవర్లలో 19 పరుగులు చేసిన ఓపెనర్లు, నాలుగు ఓవర్లలోనే స్కోరు 47కి తీసుకెళ్లారు.
చివరి టీ20కి వర్షం అంతరాయం..
ఐదవ ఓవర్ కొనసాగుతుండగా వర్షం మొదలైంది. ఆ ఓవర్లో చివరి బంతి వేయడానికి ముందు భారీ వర్షం కారణంగా ఆట తాత్కాలికంగా నిలిపివేశారు. దాదాపు రెండు గంటల 15 నిమిషాల పాటు మ్యాచ్ తిరిగి ప్రారంభం కాకపోవడంతో, నిర్వహించే అవకాశం లేదని సిరీస్ లో కీలకమైన చివరి టీ20 మ్యాచ్ రద్దు చేసినట్లు ప్రకటించారు. ఈ టీ20 సిరీస్‌లోని మొదటి మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దు కావడం తెలిసిందే. 161.38 స్ట్రైక్ రేటుతో 163 పరుగులు చేసిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ప్లే ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. సిరీస్ లో అతడి అత్యధిక స్కోరు 68.
2-1తో టీ20 సిరీస్ నెగ్గిన భారత్
శుభ్‌మన్ గిల్ సారథ్యంలో భారత్ ఇటీవల వన్డే సిరీస్ కోల్పోయింది. అయితే టీ20 సిరీస్ నెగ్గాలని ఆశించిన సూర్యకుమార్ యాదవ్ సేనకు ఊరట లభించింది. వన్డే సిరీస్ ఓటమికి టీ20 సిరీస్ గెలపుతో టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. ఆస్ట్రేలియాతో గబ్బాలో ఐదవ T20 మ్యాచ్ జరగాల్సి ఉండగా.. కేవలం 4.5 ఓవర్లు మాత్రమే ఆట సాధ్యం కావడంతో మ్యాచ్ రద్దు చేశారు. భారీ వర్షం కారణంగా ఆస్ట్రేలియాకు కీలకమైన చివరి టీ20 రద్దు అయింది. దాంతో చివరి మ్యాచ్ రద్దయిన భారత్ 2-1 తేడాతో ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ సాధించింది. తొలి టీ20 వర్షార్పణం కాగా, రెండవ T20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 3వ T20 మ్యాచ్ లో ఇండియా 5 వికెట్లతో విజయం సాధించింది. నాల్గవ T20 మ్యాచ్ లోనూ భారత్ గెలుపొందింది. బ్రిస్బేన్ లోని గబ్బాలో 5వ టీ20 మ్యాచ్ సైతం వర్షార్పణం కావడంతో సిరీస్ భారత్ సొంతం చేసుకుంది.