India pull off a thrilling chase to reach U19 World Cup final: అండర్‌-19 ప్రపంచకప్‌( U19 World Cup 2024)లో యువ భారత్ ఫైనల్ లోకి దూసుకు వెళ్ళింది. తొలుత దక్షిణాఫ్రికాను తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీం ఇండియా మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా (South Africa U19 Team) నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేయగా టీం ఇండియా 8 వికెట్లు కోల్పోయి 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ కెప్టెన్ (Team India Captain) ఉదయ్ సహారన్ , సచిన్ దాస్ కీలక ఇన్నింగ్స్ ఆడి భారత్ కు చీర స్మరణీయ విజయాన్ని అందించారు. అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం ద్వారా టీమిండియా కొత్త చరిత్ర సృష్టించింది.

 

తొమ్మిదోసారి ఫైనల్‌కు....

అండర్ 19 ప్రపంచకప్ లో వరుసగా ఐదోసారి ఫైనల్ చేరిన భారత జట్టు రికార్డు సృష్టించింది. మొత్తం మీద తొమ్మిదో సారి అండర్ 19 ప్రపంచకప్ తుదిపోరుకు అర్హత సాధించి కొత్త చరిత్ర లిఖించింది. 2016, 2018, 2020, 2022, 2024, అండర్-19 ప్రపంచ కప్ టోర్నీల్లో వరుసగా టీమిండియా ఫైనల్‌ చేరింది. 2016, 2020, టోర్నీలో రన్నర్ అప్ గా నిలిచిన భారత్.... 2018 2022 టోర్నీల్లో విజేతగా నిలిచి సత్తా చాటింది. ఇప్పటివరకు మొత్తం ఐదుసార్లు అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకున్న టీమిండియా... ఆరో కప్పుపై కన్నేసింది.

 

 

సెమీస్‌లో గెలిచిందిలా..?

బెనోని లోని విల్లోమోర్‌ పార్క్‌ వేదికగా జరగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్‌ ఓడి  మొదట బ్యాటింగ్ చేసింది. సౌతాఫ్రికా జట్టులో ప్రిటోరియస్‌ 76, రిచర్డ్‌ సెలెట్స్వేన్‌ 64 పరుగులతో  రాణించారు. భారత బౌలర్లలో లింబాని  మూడు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్‌ ముషీర్‌ ఖాన్‌ 2, స్పిన్నర్‌ సౌమి పాండే ఒక వికెట్‌ తీశారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ బ్యాటర్లకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. 14 పరుగులు చేసిన ఓపెనర్‌ స్టీవ్‌ స్టాక్‌.. ఐదో ఓవర్లోనే అవుటయ్యాడు. డేవిడ్‌ టీగర్‌ పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌ చేరాడు. 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికాను ప్రిటోరియస్‌... రిచర్డ్‌ సెలెట్స్వేన్‌ ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన వీరిద్దరూ మంచి భాగస్వామ్యంతో ప్రోటీస్‌ను మళ్లీ పోరులోకి తెచ్చారు. ఈ జోడీ మూడో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. ఈ జోడీని ముషీర్‌ ఖాన్‌ విడదీశాడు. అర్థ సెంచరీ చేసుకున్నాక రిచర్డ్‌.. నమన్‌ తివారి బౌలింగ్‌లో ప్రియాన్షుకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. ఆఖర్లో కెప్టెన్‌ జువాన్‌ జేమ్స్‌ 24, ట్రిస్టన్‌ లుస్‌ 23 నాటౌట్‌ దూకుడుగా ఆడటంతో సఫారీ స్కోరుబోర్డు 244లకు చేరింది.

 

లక్ష్య ఛేదన సాగిందిలా .. 

 

245 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన భారత్ కు ఇన్నింగ్స్ మొదటిలోనే దిమ్మ దిరిగే షాక్ తగిలింది. ఆదర్శ్ సింగ్ ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు. మంచి ఫాం లో ఉన్న ముషీర్ ఖాన్ కూడా 4 పరుగులకే వెనుతిరగడంతో  టీం ఇండియా 8 పరుగులకే 2 వికెట్లు  కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరువాత కూడా వికెట్ల పతనం కొనసాగింది. 12 పరుగులు చేసి కులకర్ణి, 5 పరుగులు చేసి మొలియా కూడా పెవిలియన్ చేరడంతో భారత జట్టు 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సచిన్ దాస్, ఉదయ్ సహారల్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. సచిన్ దాస్ 95 బంతుల్లో 96 పరుగులు, ఉదయ్ సహారల్ 124 బంతుల్లో 81 పరుగులు చేసి భారత్ ను విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరూ విజయం ముంగిట అవుట్ అయినా రాజ్ లింబాని 4 బంతుల్లో 13 పరుగులు చేసి టీం ఇండియా ను ఫైనల్ కు చేర్చాడు. చివరి వరకు క్రీజ్ లో నిలచిన సారధి ఉదయ్ సహరాన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.