Ind Vs Eng 2nd Test Day 2 Latest Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. గురువారం రెండో రోజు భారీస్కోరు చేసిన భారత్.. బౌలింగ్ లో ఇంగ్లాండ్ ను కట్టి పడేసింది. దీంతో రెండో రోజు ఆటముగిసేసరికి 20 ఓవర్లలో 3 వికెట్లకు 77 పరుగులు చేసింది. ఇంకా 510 పరుగుల వెనుకుంజలో నిలిచింది. భారత బౌలర్లలో ఆకాశ్ దీప్ రెండు వికెట్లతో రాణించాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగులకు ఇండియా ఆలౌటైన సంగతి తెలిసిందే. శుభమాన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ (387 బంతుల్లో 269, 30 ఫోర్లు, 3 సిక్సర్లు)తో టాప్ స్కోరరర్ గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్ షోయబ్ బషీర్ మూడు వికెట్లతో సత్తా చాటాడు.
రాణించిన ఆకాశ్ దీప్..ఫ్లాట్ వికెట్ పై ఇండియన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. తక్కువ వ్యవధిలోనే మూడు వికెట్లు తీసి, సత్తా చాటారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ లో తొలి టెస్టు ఆడిన ఆకాశ్ దీప్ సత్తా చాటాడు. తన రెండో ఓవర్లోనే వరుస బంతుల్లో తొలి టెస్టు హీరో బెన్ డకెట్, ఒల్లీ పోప్ లని డకౌట్ చేశాడు. ముందుగా ఆఫ్ సైడ్ వేసిన బంతిని డకెట్ పుష్ చేయగా, స్లిప్ లో గిల్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆఫ్ స్టంప్ పై పడిన బంతిని డ్రైవ్ ఆడబోయి పోప్ స్లిప్ లో కేఎల్ రాహుల్ కు చిక్కాడు. ఆ తర్వాత కుదురుకున్న మరో ఓపెనర్ జాక్ క్రాలీ (19)ని హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ ఔట్ చేశాడు. దీంతో 25/3 తో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో జో రూట్ (18 బ్యాటింగ్), హేరీ బ్రూక్ (30 బ్యాటింగ్) మంచి భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసి, జట్టు కోలుకునేలా చూశారు. వీరిద్దరూ అబేధ్యమైన నాలుగో వికెట్ కు 52 పరుగులు జోడించారు.
గిల్ రికార్డు డబుల్ సెంచరీ..ఇక రెండో రోజు ఓవర్ నైట్ స్కోరు 310/5 తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్.. 587 పరుగుల భారీ స్కోరు చేసింది. శుభమాన్ గిల్ పలు రికార్డులను బద్దలు కొడుతూ, డబుల్ సెంచరీ చేశాడు. అతనికి స్పిన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (137 బంతుల్లో 89, 10 ఫోర్లు, 1 సిక్సర్) చక్కని సహకారం అందించాడు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్ కు 2203 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత జడేజా ఔటైనా వాషింగ్టన్ సుందర్ (41) తో కలిసి గిల్ మరో చూడ చక్కని భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో భారత్ భారీ స్కోరు దిశగా సాగింది. వీరిద్దరూ ఏడో వికెట్ కు 144 పరుగుల మరో భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. సుందర్ ఔటయ్యాక, కాసేపు ఆడిన గిల్ కూడా వెనుదిరగడంతో ఇండియా ఇన్నింగ్స్ త్వరగానే ముగిసింది. మిగతా బౌలర్లలో క్రిస్ వోక్స్, జోష్ టంగ్‌లకు రెండు వికెట్లు దక్కాయి.