KL Rahul Superb 50 VS Wi In 1st Test : వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తొలిరోజే తన డామినేషన్ చూపించింది. అహ్మదబాద్ వేదికగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ నెగ్గి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ 44.1 ఓవర్లలో 162 పరుగులకు ఆలౌటైంది. జస్టిన్ గ్రీవ్స్ (32) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా.. తొలి రోజు ఆటముగిసేసరికి 38 ఓవర్లలో 2 వికెట్లకు 121 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ స్టన్నింగ్ ఫిఫ్టీ (114 బంతుల్లో 53 బ్యాటింగ్, 6 ఫోర్లు)తో సత్తా చాటాడు. క్రీజులో రాహుల్ తోపాటు భారత టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్ (18 బ్యాటింగ్) ఉన్నాడు. ప్రత్యర్థి కంటే మరో 41 పరుగుల వెనుకంజలో ఇండియా నిలిచింది. రోస్టన్ చేజ్ ఒక వికెట్ తీసి పొదుపుగా బౌలింగ్ చేశాడు.
సిరాజ్ ఫైర్..అంతకుముందు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ ను సిరాజ్ వణికించాడు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్ తో బంతులు విసిరి ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టాడు. ఓపెనర్ తేజ్ నారాయణ్ ను డకౌట్ చేసి, విండీస్ పతనానికి గేట్లు ఓపెన్ చేసిన సిరాజ్, అలిక్ అతనజే (12), బ్రాండన్ కింగ్ (13), కెప్టెన్ రోస్టన్ చేజ్ (24)ను పెవిలియన్ కు పంపాడు. మరో ఎండ్ లో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా కూడా మూడు వికెట్లతో సత్తా చాటాడు. ఒక ఎండ్ లో గ్రీవ్స్ తోపాటు వికెట్ కీపర్ బ్యాటర్ షాయ్ హోప్ (26) కాస్త భారత బౌలర్లను ప్రతిఘటించాడు. చివర్లో సిరాజ్ ఫైవ్ వికెట్ హాల్ కోసం ప్రయత్నించినా లక్కు కలిసి రాలేదు. మిగతా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ కు రెండు, వాషింగ్టన్ సుందర్ కి ఒక వికెట్ దక్కింది.
రాహుల్ క్లాస్..ఓపెనర్ ప్లేస్ లో ఒదిగి పోయిన రాహుల్.. తన క్లాస్ ఆటతీరును మరోసారి ప్రదర్శించాడు. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36) తో కలిసి విండీస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్న రాహుల్.. ఆరు చూడచక్కని ఫోర్లతో అలరించాడు. అంతకుముందు వర్షం కారణంగా ఇన్నింగ్స్ కు కాసేపు విరామం కలిగింది. ఆట ప్రారంభమైన వెంటనే జైస్వాల్ 7 ఫోర్లతో దూకుడు ప్రదర్శించాడు. ఇదే జోరులో తొలి వికెట్ కు ఈ జంట 68 పరుగులు జోడించిన తర్వాత కట్ షాట్ కి ప్రయత్నించి జైస్వాల్ ఔటయ్యాడు. వన్ డౌన్ లో వచ్చిన సాయి సుదర్శన్ (7) విఫలమయ్యాడు. మరో ఎండ్ లో సమయోచితంగా ఆడిన రాహుల్ 101 బంతుల్లో ఫిఫ్టీని పూర్తి చేసుకున్నాడు. కెప్టెన్ గిల్ తో కలిసి అబేధ్యమైన మూడోవికెట్ కు 31 పరుగులను జోడించి, మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. జైడెన్ సీల్స్ కు ఒక వికెట్ దక్కింది.