ICC Champions Trophy 2025 updates: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత్ తొలి అడుగు బాగానే వేసింది. గురువారం బంగ్లాతో జరిగిన తొలి లీగ్ మ్యాచ్ లో ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే పరిమితం చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా.. 49.4 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్ అయింది. తౌహిద్ హృదయ్ (118 బంతుల్లో 100, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అద్భుతమైన సెంచరీతో సత్తా చాటాడు. భాతర బౌలర్లలో వెటరన్ పేసర్ మహ్మద్ షమీ (5/53) సత్తా చాటాడు. ఐసీసీ టోర్నీల్లో తన ప్రత్యేకతను చాటుకుని, తనెంత విలువైన ఆటగాడో మరోసారి చాటుకున్నాడు. ఇంగ్లాండ్ తో ఆడిన చివరి వన్డేతో పోలిస్తే ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులు చేసింది. అర్షదీప్ స్థానంలో షమీని, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంలో కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకుంది. ఆరంభంలో ప్రత్యర్థిని భారత బౌలర్లు ఓ ఆటాడుకున్నారు. ఒక దశలో 35-5తో పీకల్లోతూ కష్టాల్లో నిలిచిన జట్టును తౌహిద్ ఆదుకున్నాడు. మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బంగ్ఆల భారీ స్కోరు చేయలేక పోయింది. 2017 తర్వాత జరుగుతున్న ఈ ఐసీసీ మెగా టోర్నీలో భారత్ విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఈ టోర్నీలో మొత్తం 3 లీగ్ మ్యాచ్ లు ఆడుతుండగా, ఈనెల 23న చిరకాల ప్రత్యర్థి పాక్ తో, వచ్చేనెల 2న న్యూజిలాండ్ తో తలపడుతుంది హైబ్రీడ్ మోడల్లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ మ్యాచ్ లన్నీ దుబాయ్ వేదికగానే జరుగుతాయి.
హ్యాట్రిక్ మిస్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాకు శుభారంభం దక్కలేదు. షమీ, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్ రెచ్చిపోవడంతో ఒక దశలో 35-5తో దిక్కుతోచని స్థితిలో పడింది. తొమ్మిదో ఓవర్లో వరుస బంతుల్లో తంజిద్ హసన్ (25), ముష్ఫికుర్ రహీమ్ (0)లను ఔటో చేసి హ్యాట్రిక్ ముందు అక్షర్ నిలిచాడు. తర్వాత బంతిని జాకీర్ అలీ (114 బంతుల్లో 68, 4 ఫోర్లు) స్లిప్పులోకి ఆడగా, కెప్టెన్ రోహిత్ శర్మ ఈజీ క్యాచ్ ను మిస్ చేశాడు. దీంతో అక్షర్ కు హ్యాట్రిక్ అవకాశం మిస్సయ్యింది. క్యాచ్ డ్రాప్ అవడంతో రోహిత్ చాలా ఫీలై, తన కుడిచేతితో మైదానాన్ని బాధతో బాదాడు. దొరికిన లైఫ్ ను యూజ్ చేసుకున్న జాకీర్.. తౌహిద్ తో భారీ భాగస్వామ్యాన్ని నిర్మించాడు. తొలుత టైం తీసుకుని నెమ్మదిగా ఆడిన ఈ జంట.. ఆ తర్వాత బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పెంచింది. ఫిఫ్టీ చేసుకున్న తర్వాత భారీ షాట్ కు యత్నించి జాకీర్ ఔటయ్యాడు. దీంతో ఆరో వికెట్ కు నమోదైన 154 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
కెరీర్లో తొలి సెంచరీ..
జాకీర్ వెనుదిరిగినా ఏమాత్రం తడబడని తౌహిద్.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లతో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఎక్కువగా తను స్ట్రైక్ తీసుకుంటూ పరుగులు జోడిస్తూ వెళ్లాడు. దీంతో 114 బంతుల్లో కెరీర్లో తొలి అంతర్జాతీయ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే చివరి వికెట్ గా పెవిలియన్ కు చేరడంతో బంగ్లా ఇన్నింగ్స్ కు తెర పడింది. చివర్లో 18 పరుగులతో రిషాాద్ హుస్సేన్ చిన్న క్యామియో ఆడాడు. భారత బౌలర్లలో హర్షిత్ కు మూడు, అక్షర్ కు రెండు వికెట్లు దక్కాయి. జాకీర్ వికెట్ తీసిన షమీ వన్డేల్లో 200 వికెట్ల మైలురాయిని అధిగమించాడు.
Read Also: WATCH: ఎంత పని చేశావ్ రోహిత్ భాయ్! భారత్ ఫీల్డింగ్‌పై దారుణమైన ట్రోలింగ్