IND vs ZIM 5th T20I Match Live Updates:

  హరారే: జింబాబ్వేతో జరిగిన 5వ టీ20లో యువ భారత జట్టు ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 18.3 ఓవర్లలో కేవలం 125 పరుగులకే ఆలౌటైంది. చివరి టీ20లో భారత్ 42 పరుగులతో ఘన విజయం సాధించగా, సిరీస్ 4-1తో కైవసం చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ భారత్ వైస్ కెప్టెన్ శాంసన్ హాఫ్ సెంచరీ (58 పరుగులు, 45 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) తో రాణించగా నిర్ణీత 20 ఓవర్లలో టీమ్ 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.


బ్యాటింగ్ లో రాణించిన శాంసన్.. 
జింబాబ్వేతో ఆదివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది జింబాబ్వే. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన యంగ్ ఇండియా మొదట్లో తడబడినా.. ఆపై జింబాబ్వే బౌలర్లను సమర్థంగానే ఎదుర్కొని మోస్తరు స్కోరు చేశారు. గత మ్యాచ్‌లో ఓపెనర్ యశస్వీ జైశ్వాల్, కెప్టెన్ గిల్ వికెట్ సైతం ఇవ్వకుండా పది వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిపించారు. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే సిక్సర్లు బాది దూకుడుగా ఆడే ప్రయత్నంలో జైశ్వాల్ ఔటయ్యాడు. ఆపై అభిషేక్ శర్మ(14), శుబ్ మన్ గిల్ (13) త్వరగా ఔటయ్యారు. దాంతో 40 పరుగులకే భారత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది. 


 






వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ సంజూ శాంసన్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో శాంసన్ రఫ్పాడించాడు, జట్టును నడిపించాడు. 45 బంతుల్లో 1 ఫోర్, 4 భారీ సిక్సర్లు సాయంతో సంజూ శాంసన్ 58 పరుగులు చేశాడు.  రియాన్ పరాగ్ (22), శివమ్ దూబే (26) నుంచి సంజూకు సహకారం అందింది. శివం దుబే 2 ఫోర్లు, 2 సిక్సర్లతో స్కోరు బోర్డులో వేగం పెంచాడు. ఈ క్రమంలో అనవసర పరుగుకు ప్రయత్నించి వికెట్ కోల్పోయాడు. రింకూ సింగ్ ఇచ్చిన కాల్ తో రన్ కు వెళ్లగా.. ఆపై రింకూ వెనక్కి వెళ్లిపోయాడు. దూబే చాలా దూరంలో ఉండగానే కరెక్ట్ త్రో రావడంతో రనౌట్ గా వెనుదిరిగాడు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 6 వికెట్లు కోల్పోయి 167 రన్స్ చేసి జింబాబ్వేకు మోస్తరు టార్గెట్ ఇచ్చింది.


బౌలింగ్ లో ముకేశ్ అదుర్స్
168 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన జింబాబ్వేను తొలి ఓవర్ నుంచి ఏ దశలోనూ టార్గెట్ ఛేజ్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు భారత బౌలర్లు. 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన జింబాబ్వేను  డియోన్ మైర్స్, మరమణి ఆదుకునే ప్రయత్నం చేశారు. 37పరుగులు చేసిన మైర్స్ జింబాబ్వే నుంచి టాప్ స్కోరర్ గా నిలిచాడు. చివర్లో ఫరాజ్ అక్రమ్ (13 బంతుల్లో 27 పరుగులు) కాసేపు మెరుపులు మెరిపించాడు. టీమిండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ 4 వికెట్లు పడగొట్టాడు. శివం దుబే 2 వికెట్లతో రాణించగా.. అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, తుషార్ దేశ్ పాండేలు తలో వికెట్ తీశారు. దాంతో జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ కాగా, 5 టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుని సత్తా చాటింది యంగ్ ఇండియా.