IND VS SL 2nd Test, Sonal Dinusha Magnificent Hundred Helps Sri Lanka Draw Second Test Against India: కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా విజయం ముంగిట లంక జట్టు ఊహించని ప్రతిఘటనతో మ్యాచ్‌ను డ్రాగా ముగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగుల భారీ వెనుకంజతో ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక చివరి రోజు అద్భుత బ్యాటింగ్‌తో టీమిండియా బౌలర్లను కట్టడి చేసింది. గురువారం ఐదోరోజు ఓవర్ నైట్ స్కోరు 229/6తో ఆట కొనసాగించిచిన లంక జట్టు ఆట ముగిసే సమయానికి 429/9 స్కోరు నమోదు చేసింది. యువ బ్యాటర్ సొనాల్ దినూష (133 నాటౌట్) వరుగసా రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీ చేశాడు. బౌలర్లలో మానవ్ సుతార్, రవీంద్ర జడేజాకు మూడు వికెట్లు దక్కాయి. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను ఇండియా 1-0తో కైవసం చేసుకుంది. గతంలో ఫాలో ఆన్ ఆడిన 27 టెస్టుల్లో 24 మ్యాచ్‌లను లంక కోల్పోయింది. ఇండియాపై ఫాలో ఆన్ ఎదుర్కొన్న ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన శ్రీలంక, కొలంబోలో ఆ చెత్త రికార్డును చెరిపేసి కొత్త అధ్యాయాన్ని లిఖించింది.
డ్రాతో ముగింపు.. మ్యాచ్ ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు మ్యాచ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించారు. యువ బ్యాటర్ సొనాల్ దినూష అద్భుత సెంచరీతో నాటౌట్‌గా నిలిచి లంకను పటిష్ట స్థితికి చేర్చాడు. కేశర నువంత 46 రన్స్ చేసి అతనికి చక్కటి సహకారం అందించాడు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు ఏకంగా 112 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టి, ఫ్రస్ట్రేట్ చేశారు. ఫాలో ఆన్ ఆడుతూ టెస్ట్ మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం శ్రీలంక క్రికెట్ చరిత్రలో ఇది నాలుగోసారి మాత్రమే కావడం విశేషం.
అరుదైన ఘనత..కొలంబో టెస్టులో దినూష అరుదైన మైలురాళ్లను సాధించాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 103 రన్స్ చేసిన అతడు, రెండో ఇన్నింగ్స్‌లోనూ 133 రన్స్‌తో అజేయంగా నిలిచి, డబుల్ ధమాక సాధించాడు. గాలేలో జరిగిన తొలి టెస్టులోనూ సెంచరీ బాదిన దినూష, ఈ సిరీస్‌లో మొత్తం మూడు శతకాలు నమోదు చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఫాలో ఆన్ ఆడుతూ ఒకే మ్యాచ్ లోని రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్‌గా చరిత్రలో నిలిచాడు. గతంలో 1948లో ఆస్ట్రేలియాపై విజయ్ హజారే, 2001లో సౌతాఫ్రికాపై జింబాబ్వే లెజెండ్ ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఫీట్ నమోదు చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత దినూష ఈ రికార్డు సాధించి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. ఓవరాల్ గా ఈ మ్యాచ్ లో గెలిచి డబ్ల్యూటీసీ లో దూసుకుపోవాలని భావించిన భారత్ కు చుక్కెదురైంది. ఇక శతకాలతో సత్తా చాటిన దేవదత్ పడిక్కల్ ను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, దినుషకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు దక్కాయి.
