IND VS SL, Rishabh Pant Surpasses Dhoni Historic Test Milestone: భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన చారిత్రాత్మక రికార్డును సాధించాడు. విదేశాల్లో లేదా న్యూట్రల్ వేదికల్లో జరిగిన టెస్టుల్లో భారత వికెట్ కీపర్‌గా అత్యధిక పరుగులు సాధించిన లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ పేరిట ఉన్న ఆల్ టైమ్ రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో రోజు ఆటలో పంత్ ఈ ఘనతను నమోదు చేశాడు. ఈ విభాగంలో 2500 పరుగుల మార్కును దాటిన పంత్, ధోనీ సాధించిన 2496 పరుగుల రికార్డును అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. ధోనీ 32.84 సగటుతో ఆ పరుగులు చేయగా, పంత్ దాదాపు 42 సగటుతో ఈ మైలురాయిని అందుకోవడం గమనార్హం. ఈ లిస్టులో ఫరూక్ ఇంజనీర్ (1209 రన్స్), సయ్యద్ కిర్మాణి (1109 రన్స్), కిరణ్ మోరే (901 రన్స్) తర్వాతి స్థానాల్లో నిలిచారు..
గాయంతో సత్తా చాటిన పంత్..ఈ రికార్డు నమోదు కావడానికి ఒక రోజు ముందు పంత్ మైదానంలో తీవ్ర గాయానికి లోనయ్యాడు. మొదటి రోజు ఆట మూడో సెషన్‌లో శ్రీలంక పేసర్ లహిరు కుమార వేసిన షార్ట్ పిచ్ బంతిని పుల్ చేసే క్రమంలో పంత్ ఎడమ చేతి మణికట్టుకు గాయం అయింది. నొప్పితో విలవిల్లాడిన పంత్ కు భారత జట్టు ఫిజియో ఐస్ ప్యాక్ పెట్టి కట్టు కట్టినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తీవ్ర అసౌకర్యంగా అనిపించడంతో 15 బంతుల్లో 3 పరుగులు చేసిన తర్వాత 58వ ఓవర్లో పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు.
సూపర్బ్ పార్ట్నర్ షిప్గాయం తీవ్రత భయపెట్టినప్పటికీ, రెండో రోజు ఉదయం భారత్ ఆరో వికెట్ కోల్పోయిన తర్వాత పంత్ తిరిగి బ్యాటింగ్ కు వచ్చాడు. అసిథ ఫెర్నాండో, ఇతర లంక పేసర్లు వరుసగా బౌన్సర్లతో దాడి చేస్తూ అతడి భుజానికి కూడా బంతులు తాకించినా పంత్ ఏమాత్రం లెక్క చేయలేదు. నొప్పిని భరిస్తూనే మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ తో కలిసి జట్టు ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఇద్దరూ కలిసి సమయోచిత భాగస్వామ్యంతో లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొని స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు.
ఇరువురు అర్థ సెంచరీల నమోదు..శ్రీలంక బౌలర్లు తీవ్రంగా ఒత్తిడి తెస్తున్న సమయంలో పంత్ చూపిన అంకితభావం జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చిందనడంలో సందేహం లేదు. ఇక వీళ్లిద్దరూ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తూ, అబేధ్యమైన ఏడో వికెట్ కు 112 పరుగులు జోడించారు. లంచ్ విరామ సమయానికి టీమిండియా 112 ఓవర్లలో 6 వికెట్లకు 419 పరుగులు చేసింది. పంత్ (63 బ్యాటింగ్)తో పాటు జురేల్ (59 బ్యాటింగ్) అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఫెర్నాండోకు నాలుగు వికెట్లు దక్కాయి. ఇప్పటికే గాలే టెస్ట్ లో భారత్ 165 రన్స్ తో గెలిచి సిరీస్ లో 1-0 లీడ్ లో ఉండగా, కొలంబోలోనూ పంత్ పోరాటంతో జట్టు పటిష్ట స్థితికి చేరింది.
