భారత స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో రెండు పెద్ద మైలురాళ్లను చేరుకున్నారు. దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో ఇది సాధ్యం అయింది. ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ల్లో విరాట్ కోహ్లీ 1,000 పరుగుల మైలురాయిని దాటాడు. ఈ స్కోరు సాధించిన రెండో ఆటగాడు విరాట్ కోహ్లీనే. ఇక మరోవైపు రోహిత్ టీ20ల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ విఫలం అయ్యారు.
ఈ టోర్నమెంట్‌లో శ్రీలంక ఆటగాడు మహేళ జయవర్థనే 1,016 పరుగులతో ముందంజలో ఉన్నాడు. 31 మ్యాచ్‌ల్లో 39.07 సగటుతో ఈ పరుగులను సాధించాడు. ఒక సెంచరీ, ఐదు అర్థ సెంచరీలు కూడా తన ఖాతాలో ఉన్నాయి. తన అత్యధిక స్కోరు 100గా ఉంది. ఈ లిస్ట్‌లో మహేళ జయవర్థనే, విరాట్ కోహ్లీల తర్వాతి స్థానంలో క్రిస్ గేల్ (965), భారత కెప్టెన్ రోహిత్ శర్మ (919), శ్రీలంక ఆటగాడు తిలకరత్నే దిల్షాన్ (897) ఉన్నారు.
ఇక రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచాడు. 2007 నుంచి ఇప్పటివరకు రోహిత్ శర్మ మొత్తం 36 మ్యాచ్‌లు ఆడాడు. ఈ లిస్ట్‌లో రోహిత్ తర్వాతి స్థానంలో తిలకరత్నే దిల్షాన్ ఉన్నాడు. దిల్షాన్ మొత్తంగా 35 మ్యాచ్‌లు ఆడాడు.
36 మ్యాచ్‌ల్లో 31 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 36.76 సగటు, 130.73 స్ట్రైక్ రేట్‌తో 919 పరుగులు సాధించాడు. తొమ్మిది అర్థ సెంచరీలు కొట్టాడు. అత్యధిక స్కోరు 79 నాటౌట్. ఈ ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడు రోహిత్ శర్మనే. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ, తిలకరత్నే దిల్షాన్ తర్వాతి స్థానాల్లో డ్వేన్ బ్రేవో, పాకిస్తాన్ ఆల్ రౌండర్ షాహిద్ అఫ్రిది, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ ఉన్నారు.