టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా చీలమండ గాయంతో ప్రపంచకప్‌నకు దూరమవ్వడంతో అతని స్థానంలో మిగిలిన మ్యాచ్‌లకు పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు. అయితే ప్రసిద్ధ్ కృష్ణ ఎంపిక సరైందే అన్న ప్రశ్న క్రికెట్ అభిమానులు వెంటాడుతోంది. దీనిపై భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. టీమ్‌ఇండియా పేస్ బౌలింగ్ వనరులను పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ది వాల్ స్పష్టం చేశాడు. ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకోవడం మంచి ఆలోచన అని రాహుల్ తెలిపాడు. తాము ఇప్పుడు ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్ల కాంబినేషన్‌లో మ్యాచ్ ఆడామని ద్రవిడ్ గుర్తు చేశాడు. జట్టులో తమకు అశ్విన్ రూపంలో స్పిన్ బ్యాకప్ ఉందని... ఆల్‌రౌండర్ రూపంలో శార్దూల్ ఠాకూర్ బ్యాకప్ కూడా ఉందని కానీ ఫాస్ట్ బౌలింగ్ బ్యాకప్ మాత్రం లేదని టీమిండియా కోచ్ గుర్తు చేశాడు . ఎవరైనా అనారోగ్యం బారిన పడ్డా, గాయపడ్డా.. అందుకోసం బ్యాకప్ అవసరమని గుర్తించి, అన్ని ఆలోచించిన తర్వాతే పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకున్నట్లు రాహుల్ వివరించాడు. ఇతర కాంబినేషన్లతో ఆడేందుకు ఇది ఉపయోగపడుతుందని అన్నాడు.
పాండ్యా స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ గత సిరీసుల్లో అద్భుతంగా రాణించాడు. బంతిని రెండు వైపులా స్పింగ్ చేయగల నేర్పు ప్రసిద్ధ్‌కు ఉంది. స్లో బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించగలడు. గాయం నుంచి కోలుకుని వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్ కృష్ణపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపించారు. వన్డే ప్రపంచకప్‌నకు బుమ్రా, సిరాజ్, షమీలతో పాటు అదనపు పేసర్‌గా ప్రసిద్ధ్ కృష్ణను కూడా ఎంపిక చేయాలని సూచించారు. కానీ అప్పడు జట్టు సమతూకం కోసం అప్పుడు జట్టులో చోటు లభించని ప్రసిద్ధ్ కృష్ణకు ఇప్పుడు అదృష్టం పాండ్యా గాయం రూపంలో తలుపుతట్టింది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే సీమర్లు అద్భుతాలు సృష్టిస్తుండడంతో.. వారి అనుభవం నుంచి ప్రసిద్ధ్ కృష్ణా పాఠాలు నేర్చుకోవచ్చు. కానీ అవకాశం దొరికితే మాత్రం ప్రసిద్ధ్ తన పేస్‌తో అద్భుతాలు చేయగలడు.
2021 మార్చి 23న ఇంగ్లండ్‌పై జరిగిన మ్యాచ్‌తో ప్రసిద్ధ్ కృష్ణ వన్డేలోకి ఆరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్‌లోనే నాలుగు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం కూడా సాధించింది. 2021 మేలో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కి, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌కు భారత స్క్వాడ్‌లో స్టాండ్‌బైగా కూడా ప్రసిద్ధ్ ఎంపికయ్యాడు. అదే సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌తో టెస్టుల్లోనూ ఆరంగేట్రం చేశాడు. 2022 ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో 12 పరుగులకు 4 వికెట్లు పడగొట్టి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇదే సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకుని సత్తా చాటాడు.
స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో తన తొలి ఓవర్ మూడో బంతికే హార్దిక్ గాయపడ్డాడు. బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ నేరుగా కొట్టిన బంతిని ఆపే క్రమంలో హార్దిక్ కాలిని దూరంగా జరిపాడు. దీంతో బంతి అతని కాలికి బలంగా తాకింది. ఈ క్రమంలో హార్దిక్ చీలమండ భాగం మడత పడింది. దీంతో నొప్పితో విలవిలాడిన హార్దిక్ పాండ్యా వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే మొదట హార్దిక్ పాండ్యాకు అయిన గాయం పెద్దదేమి కాదని జట్టు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. కానీ ఇప్పుడు హార్దిక్ జట్టుకు దూరం కావడం జట్టుకు పెద్ద షాక్‌ను మిగిల్చింది.