భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఊహించని ముగింపు. బెంగళూరులో జరుగుతున్న ఐదో టీ20 వర్షం కారణంగా రద్దయింది. టాస్ వరకు ఎటువంటి అంతరాయం కలిగించని వరుణుడు టాస్ పడగానే ఎవరో పిలిచినట్లు వచ్చేశాడు. దీంతో ఆట 50 నిమిషాలు ఆలస్యంగా 7:50 గంటలకు ప్రారంభం అయింది. ఓవర్లను 19కి కుదించారు. అయితే మూడు ఓవర్లు పడగానే మళ్లీ వర్షం పడింది. దీంతో 9:35 గంటల వరకు చూసి మ్యాచ్ జరిగే పరిస్థితి లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
వర్షం కారణంగా గేమ్ ఆగే సమయానికి టీమిండియా 3.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (15: 7 బంతుల్లో, రెండు సిక్సర్లు), రుతురాజ్ గైక్వాడ్ (10: 12 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యారు.
కేశవ్ మహరాజ్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఇషాన్ కిషన్ రెండు సిక్సర్లు కొట్టాడు. అయితే లుంగి ఎంగిడి తన రెండో ఓవర్లో ఇషాన్ కిషన్‌ను, నాలుగో ఓవర్లో ఆట ఆగడానికి ముందు రుతురాజ్ గైక్వాడ్‌ను అవుట్ చేశాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది.
ఈ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా విజయం సాధించగా... ఆ తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ముఖ్యంగా నాలుగో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 87 పరుగులకే ఆలౌట్ చేసిన విధానం మన బౌలింగ్ డెప్త్‌ను చూపించింది. అయితే ఐదో మ్యాచ్ కూడా జరిగి ఫలితం అటో, ఇటో వచ్చి ఉంటే బాగుండేది. అప్పుడు సిరీస్ కూడా సంపూర్ణం అయ్యేది.