ind vs sa 2nd test Live Score Updates | గౌహతి టెస్ట్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 6 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడో సెషన్‌లో భారత జట్టు 81వ ఓవర్లో కొత్త బంతిని తీసుకోవడంతో భారత్ కం బ్యాక్ చేయగలిగింది. కొత్త వ్యూహం పనిచేసింది. ఎందుకంటే ఆ తరువాతి ఓవర్లో మహ్మద్ సిరాజ్ ఓ వికెట్ తీశాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా సెనురన్ ముత్తుసామి, కైల్ వెరెయిన్ నాటౌట్‌గా నిలిచారు.
దక్షిణాఫ్రికాకు చెందిన బ్యాట్స్‌మెన్‌లు బ్యాటింగ్‌లో మంచి ప్రారంభం ఇచ్చారు. కానీ ఎవరూ పెద్ద ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. ఓపెనర్లు ఎయిడెన్ మార్క్రమ్, రయాన్ రికల్టన్ 82 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం నెలకొల్పారు. తరువాత కేవలం 3 బంతుల వ్యవధిలో మార్క్రమ్, రికల్టన్ ఇద్దరూ అవుట్ అయ్యారు. ఆ తర్వాత టెంబా బావుమా, ట్రిస్టన్ స్టబ్స్ 84 పరుగుల మరో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. దాంతో రెండు సెషన్లు సఫారీలే ఆధిపత్యం చెలాయించారు.
మూడో సెషన్‌లో ఇండియా పునరాగమనం
రెండో సెషన్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అయితే మూడో సెషన్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి వికెట్లు తీశారు. మూడో సెషన్‌లో 26.5 ఓవర్లు బౌలింగ్ చేసి 92 పరుగులు ఇచ్చి 3 విలువైన వికెట్లు తీశారు. మొదటి 2 సెషన్లలో భారత బౌలర్లు కేవలం 2 వికెట్లు తీయగా, చివరి సెషన్‌లో కొత్త బంతి తీసుకున్నాక భారత బౌలర్లు 3 వికెట్లు పడగొట్టారు. రెండో రోజు ఉదయం భారత జట్టు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను 300 పరుగుల లోపే ముగించాలని భావిస్తుంది. ఆదివారం ఉదయం పిచ్ అనుకూలిస్తే సఫారీలు తొలి సెషన్లో ఆలౌట్ అవుతారు.
రాణించిన చైనామన్ బౌలర్
రెండో టెస్టులో తొలిరోజు కుల్దీప్ యాదవ్ ఆకట్టుకున్నాడు. 3 వికెట్లు కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెంచాడు. కానీ మరో ఎండ్ లో అంతగా సహకారం లభించలేదు. గౌహతి టెస్ట్‌లో మొదటి రోజున భారత్ తరపున విజయవంతమైన బౌలర్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ తీశారు. గౌహతిలోని బర్సపరా స్టేడియం తొలిసారిగా టెస్ట్ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇస్తోందని తెలిసిందే. మొదటి రోజు దక్షిణాఫ్రికా తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ట్రిస్టన్ స్టబ్స్ నిలిచాడు. 49 పరుగులు చేసిన స్టబ్స్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో రాహుల్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు.
దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా 41 పరుగులు చేయగా, మార్‌క్రమ్ 38, మరో ఓపెనర్ రియాన్ రికెల్టన్ 35 పరుగులు చేశారు. టోనీ డె జోర్జి 28 పరుగులకు సిరాజ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. సమష్టిగా ఆడి పరుగులు చేయడంతో ఒక్క హాఫ్ సెంచరీ నమోదు కాకున్నా తొలిరోజు ఆటలో దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 247 రన్స్ చేసింది.