Asia Cup 2025 Final: ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ నేటి రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 28న భారత్, పాకిస్తాన్ మధ్య దాదాపు 41 ఏళ్ల తరువాత ఆసియా కప్ ఫైనల్ (IND vs PAK Final) మ్యాచ్ జరుగుతుంది. గ్రూప్ స్టేజ్, ఆ తర్వాత సూపర్-4 రౌండ్ మ్యాచ్‌లో కూడా పాకిస్తాన్‌ను భారత జట్టు ఓడించింది. ఇప్పుడు ఫైనల్‌లో 2025 ఆసియా కప్‌లో మూడోసారి పోటీ జరగనుంది. ఈ మ్యాచ్ విజేత ఆసియా కప్ ఛాంపియన్‌గా నిలుస్తారు, కానీ మ్యాచ్‌లో వర్షం వస్తే, ఛాంపియన్ ఎవరు అవుతారు? రూల్స్ ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
వర్షం వస్తే నియమం ఏమిటి?
భారత్-పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది. వాతావరణం విషయానికి వస్తే సెప్టెంబర్ 28న దుబాయ్‌లో వాతావరణం బాగానే ఉంటుంది. కానీ ఏదైనా కారణాల వల్ల సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ జరగకపోతే, దానిని రద్దు చేయరు. ఆసియా కప్ ఫైనల్ కోసం సెప్టెంబర్ 29ని రిజర్వ్ డేగా ఏసీసీ షెడ్యూల్ చేసింది. రిజర్వ్ డే రోజున కూడా ఫైనల్ మ్యాచ్ ఫలితం రాకపోతే.. భారత్, పాకిస్తాన్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. అయితే వర్షం లేదా తుఫాను వచ్చే అవకాశం లేనందున రిజర్వ్ డేను కూడా ఉపయోగించే అవకాశం తక్కువ.
ఆసియా కప్ ఫైనల్: పిచ్ రిపోర్ట్భారత్-పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేటి రాత్రి 8 గంటలకు మొదలవుతుంది. దుబాయ్ పిచ్ బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంది. ప్రారంభంలోనే ఫాస్ట్ బౌలింగ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టవచ్చు. బంతి కాస్త పాతబడ్డాక స్పిన్ బౌలర్లు ఆధిపత్యం చెలాయిస్తారు. అయితే గణాంకాలు చూస్తే ఛేజింగ్ మంచి ఛాయిస్. టాస్ నెగ్గే కెప్టెన్ బౌలింగ్ ఎంచుకునే అవకాశాలున్నాయి.
దుబాయ్ వెదర్భారత్-పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ రోజు దుబాయ్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 40°C కాగా, కనిష్ట ఉష్ణోగ్రత 31°C ఉండవచ్చని వెదర్ నిపుణులు సూచిస్తున్నారు. చాలా మ్యాచ్‌లలో రెండవ ఇన్నింగ్స్‌లో మంచు కీలకంగా మారుతుంది. ఛేజింగ్ జట్టుకు విజయావకాశాలు అధికంగా ఉన్నాయి.
భారత్-పాకిస్తాన్ టీ20లో హెడ్ టు హెడ్
టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ జట్లు 15 మ్యాచ్‌లతో తలపడ్డాయి. ఇందులో భారత జట్టుదే పైచేయి. భారత్ 12 సార్లు గెలిస్తే, పాకిస్తాన్ కేవలం 3 సార్లు మాత్రమే నెగ్గింది. టీ20లో పాకిస్తాన్ జట్టు 2023 ఆసియా కప్‌లో చివరగా గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో 182 పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించింది. ఇప్పుడు భారత జట్టుకు పాకిస్తాన్‌పై రెండోసారి ఆసియా కప్ ఫైనల్ గెలిచే అవకాశం ఉంది.