చెన్నై చెపాక్ వేదికగా జరుగుతున్న టెస్టులో టీమిండియా పట్టు బిగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అశ్విన్- రవీద్ర జడేజాలు రాణించడంతో తొలి ఇన్నింగ్స్ లో 376 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ను భారత బౌలర్లు క్రీజులో నిలదొక్కుకోనియ్యలేదు. వరుసగా వికెట్లు తీస్తూ బంగ్లాను బెంబేలెత్తించారు. భారత బౌలర్ల ధాటికి బంగ్లా కేవలం 149 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ కు తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యం లభించింది. 227  పరుగుల ఆధిక్యం లభించడంతో తొలి టెస్టు ఫూర్తిగా భారత చేతుల్లోకి వచ్చినట్లయింది. పిచ్ ఇంకా బౌలర్లకు సహకరిస్తున్న వేళ రెండో ఇన్నింగ్సులో భారత్ విధించే లక్ష్యాన్ని ఛేదించడం బంగ్లాదేశ్ కు అంత తేలికేమీ కాదు. భారత బౌలర్లలో బుమ్రా మరోసారి మెరిశాడు. నాలుగు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఆకాశ్ దీప్ 2, రవీంద్ర జడేజా రెండు, సిరాజ్ రెండు  వికెట్లు తీశారు. ఇక అశ్విన్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. 13 ఓవర్లు బౌలింగ్ చేసిన అశ్విన్ కేవలం 29 పరుగులే ఇచ్చాడు. బంగ్లా బ్యాటర్లలో షకీబుల్ హసన్ 32, లిట్టన్ దాస్ 22, కెప్టెన్ శాంటో 20 పరుగులు చేశారు. మెహిందీ హసన్ మిరాజ్ 27 పరుగులతో పర్వాలేదనిపించాడు. బంగ్లా బ్యాటర్లలో ఒక్కరు కూడా 35 పరుగుల మార్కును దాటలేకపోయారు.