India Vs Australia Odi Series | పెర్త్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో తనకున్న రిలేషన్ గురించి వన్డే కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్ స్పందించాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో తన రిలేషన్ గతంలోలాగే ఉందని, తనకు ఏ అవసరం వచ్చినా ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లను సంప్రదించడానికి వెనుకాడనని గిల్ తెలిపాడు. సోషల్ మీడియాలో ఇటీవల వస్తున్న కథనాలపై ఈ విధంగా స్పందించాడు.
భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఎంతో విజయవంతమైన రోహిత్ శర్మ స్థానాన్ని గిల్ భర్తీ చేశాడు. అప్పటి నుంచి ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రోహిత్, కోహ్లీల భవిష్యత్తుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదివారం పెర్త్ వేదికగా ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల సిరీస్ భారత వన్డే కెప్టెన్‌గా గిల్ తొలి సిరీస్.
రోహిత్‌తో నా రిలేషన్ మారలేదు.. గిల్
స్వాన్ నది ఒడ్డున మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశానికి హాజరుకావడం చాలా అసాధారణం. "బయట ఒక విషయం నడుస్తోంది, కానీ రోహిత్‌తో నాకున్న రిలేషన్‌లో ఏమీ మారలేదు. నేను ఏదైనా అడగాలనుకుంటే, సలహా కోరాలని భావిస్తే కచ్చితంగా రోహిత్ ను సంప్రదిస్తాను. పిచ్ స్వభావం గురించి సలహా కావాలన్నా, మ్యాచ్ గురించి అయినా రోహిత్ సహాయం చేస్తాడు" అని సిరీస్ ప్రారంభానికి ముందు గిల్ అన్నాడు.
"నాకు విరాట్ భాయ్, రోహిత్ భాయ్‌లతో మంచి అనుబంధం ఉంది. నేను వెళ్లి ఈ పరిస్థితుల్లో కెప్టెన్ అయితే మీరేం చేస్తారు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని నిర్మొహమాటంగా అడుగుతాను. సలహాలు ఇవ్వడానికి వారిద్దరూ ఎప్పుడూ వెనుకాడరు. 25 ఏళ్ల కెప్టెన్‌ను. నామీద పెద్ద బాధ్యత ఉంది. ఇద్దరు మాజీ కెప్టెన్ల నుండి చాలా మద్దతు అవసరం. టీమ్‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఏ రకంగా నిర్ణయాలు తీసుకుని జట్టును ముందుకు తీసుకెళ్లాలనే దానిపై విరాట్ భాయ్, రోహిత్ భాయ్‌లతో నేను చాలాసార్లు మాట్లాడాను. వారి అనుభవాలు మాకు సహాయపడతాయి’ అని గిల్ పేర్కొన్నాడు.
దిగ్గజాల నుంచి చాలా నేర్చకున్నాను
"మహీ భాయ్ (ఎంఎస్ ధోని), విరాట్, రోహిత్ అందించిన వారసత్వం, ఎన్నో అనుభవాల నుంచి నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. వారి అనుభవం, నైపుణ్యం చాలా గొప్పది. వారి ఆట చూస్తూ పెరిగాను. వారిని నేను ఆరాధించేవాడిని, అది నన్ను ప్రేరేపిస్తుంది. అలాంటి దిగ్గజాలు నా సారథ్యంలో ఆడటం గొప్ప గౌరవంగా భావిస్తాను. జట్టుకు ఏ విధంగా మెస్సేజ్ ఇవ్వాలి. ఆటగాళ్లలో ఎలా కమ్యూనికేషన్ జరపాలి అనే విషయంపై రోహిత్, కోహ్లీలను అడిగి తెలుసుకున్నాను. వారితో కలిసి ఆడినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకున్నాను.
ఆస్ట్రేలియాతో సిరీస్ లో వారు ప్రత్యేకంగా నిలుస్తారు. రోహిత్, కోహ్లీలు దాదాపు 20 సంవత్సరాలుగా భారత క్రికెట్‌కు సేవలందించారు. వారి అనుభవాన్ని రిపీట్ చేయలేం. కానీ వ్యక్తిగతంగా, తనపై ఎంత ఎక్కువ బాధ్యత ఉంటే, అంత బాగా ఆడతానని నమ్ముతాను. కెప్టెన్సీ అనే అదనపు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాను.
ఒత్తిడిలోనే బెస్ట్ ఇస్తాను: గిల్
నేను ఒత్తిడిలో రాణిస్తాను, నా అత్యుత్తమ ఆట బయటకు వస్తుంది. బ్యాటింగ్ చేసినప్పుడు బ్యాటర్‌గా ఆలోచిస్తాను, ఆపై బెస్ట్ నిర్ణయం నిర్ణయాలు తీసుకుంటాను. ఒక బ్యాటర్‌గా, నేను కెప్టెన్‌లా ఆలోచించడానికి మాత్రం ప్రయత్నించను. అలా చేస్తే ఒత్తిడి పెరుగుతుంది. దాంతో స్వేచ్ఛగా ఆడలేం. మన అత్యుత్తమ ఆట ప్రదర్శించలేమని" ఆసీస్ తో వన్డే సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడుతూ భారత వన్డే కెప్టెన్ గిల్ కీలక విషయాలు వెల్లడించాడు.