ODI World Cup 2023: స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్‌(World Cup)లో భారత్‌(Bharath) మహా సంగ్రామానికి సిద్ధమైంది. పుష్కర కాలం తర్వాత టీమిండియా ఫైనల్‌ చేరి... కప్పు కలను సాకారం చేసేందుకు కేవలం ఒక్క అడుగుదూరంలో నిలిచింది. ఈ ప్రపంచకప్‌లో అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత జట్టు.. అప్రతిహాత విజయాలతో ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ ప్రపంచకప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్‌(New Zeland)ను చిత్తుచేసి 2019 సెమీస్‌లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా(Australia) వంతు వచ్చింది. 2003 ప్రపంచకప్‌ ఫైనల్లో ఎదురైన ఓటమికి.. తమకు కప్పు కలను దూరం చేసిన ఆవేదనకు ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్‌ సేన సిద్ధమైంది. అన్ని విభాగాల్లో దుర్బేధ్యంగా రోహిత్‌ సేన... ఇక ఆస్ట్రేలియాపై విజయం సాధించడం ఒక్కటే మిగిలింది. అయితే ఇప్పటివరకూ జరిగిన ప్రపంచకప్‌లలో భారత ప్రయాణాన్ని ఓసారి పరిశీలిస్తే... భారత్‌కు వన్డే ప్రపంచకప్‌లో ఇది నాలుగో ఫైనల్‌. ఇందులో 1983, 2011లో ఫైనల్‌ గెలిచి కప్పును ఒడిసిపట్టింది. 2003లో ఫైనల్లో పరాజయం పాలైంది. ఇప్పటికే రెండుసార్లు కప్పు గెలిచింది. 


1983 ఓ అద్భుతం

1983 వరల్డ్‌కప్‌లో కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని జట్టు తొలిసారి ప్రపంచకప్‌ను గెలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమిండియా... బలమైన వెస్టిండీస్‌ను మట్టి కరిపించి కప్పును కైవసం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 54.4 ఓవర్లలో 183 పరుగులకే కుప్పకూలింది. కృష్ణమ్మాచారి శ్రీకాంత్ 38 పరుగులు, అమర్‌నాథ్ 26 పరుగులు చేశారు. అనంతరం బౌలింగ్‌కు దిగిన భారత జట్టు వెస్టిండీస్‌ను 52 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ చేసింది. మొహిందర్ అమర్‌నాథ్, మదన్ లాల్ చెరో మూడు వికెట్లు తీసి విండీస్‌ పతనాన్ని శాసించారు. లార్డ్స్‌లో కపిల్‌ దేవ్‌ కప్పు అందుకున్న క్షణాలు భారత క్రికెట్‌ ప్రస్థానాన్నే మార్చేశాయి..

 

2003 ఓ విషాదం

2003 ప్రపంచకప్‌లో సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా... ఫైనల్లో రికీ పాంటింగ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో పాంటింగ్ 121 బంతుల్లో నాలుగు ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 140 పరుగులతో అజేయంగా నిలిచాడు. మార్టిన్ 88 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 50 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 359 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ భారీ స్కోరును ఛేదించడంలో భారత జట్టు విఫలమైంది. నాలుగు పరుగులకే సచిన్.. 24 పరుగులకే గంగూలీ ఔటయ్యారు. సెహ్వాగ్ పోరాడినా టీమిండియా 234 పరుగులకు ఆలౌటైంది. 

 

2011 నవ శకం

ముంబైలోని వాంఖడే స్టేడియంలో 2011 ప్రపంచకప్ ఫైనల్ భారత్-శ్రీలంక మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో గెలిచి రెండోసారి ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తొలుత బ్యాటింగ్‌ చేసి మహేల జయవర్ధనే సెంచరీతో 274 పరుగుల స్కోరు చేసింది. ఈ లక్ష్యాన్ని గౌతం గంభీర్‌ 97.. ఎంఎస్ ధోని 97 పరుగులతో రాణించడంతో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి రెండోసారి కప్పును ముద్దాడింది.

 

2023 కొత్త చరిత్ర కోసం!

అహ్మదాబాద్‌ వేదికగా 2023 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌-ఆస్ట్రేలియా తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి కప్పు తేవాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌కు ఈ మ్యాచ్‌ గెలుపు పెద్ద కష్టం కాదని మాజీలు అంచనా వేస్తున్నారు.