పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్న దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పాక్‌ సెమీస్‌ ఆశలను గల్లంతు చేస్తూ సౌతాఫ్రికా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ ప్రపంచకప్‌లో 26వ మ్యాచ్‌లో ప్రొటీస్‌ విజయాన్ని తన పేరిట లిఖించుకోవడంతో పాటు పాయింట్ల పట్టికలోనూ మార్పులకు కారణమైంది. ఈ విజయంతో దక్షిణాఫ్రికా పాయింట్ల పట్టికలో టాప్‌ ప్లేస్‌లో ఉంది. టీమిడియా రెండో స్థానానికి పడిపోయింది. ప్రొటీస్‌, భారత జట్లు  అయిదు మ్యాచుల్లో నెగ్గి 10 పాయింట్లతో సమానంగా ఉన్నా... నెట్‌ రన్‌రేట్‌ పరంగా టీమిండియా కంటే దక్షిణాఫ్రికా మెరుగ్గా ఉంది. పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఆస్ట్రేలియా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. వరుసగా నాలుగో మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్‌ నాకౌట్‌ నుంచి దాదాపు వైదొలిగింది. ఈ పరాజయంతో పాక్‌ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది.  ఈ ప్రపంచకప్‌లో సఫారీ జట్టుకు వరుసగా ఇది మూడో విజయంకాగా... పాకిస్థాన్‌కు వరుసగా ఇది నాలుగో ఓటమి. ఇక ఇంగ్లండ్‌తో రేపు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంటుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక్కమ్యాచ్‌ కూడా ఓడిపోని ఏకైక జ్టటుగా టీమ్ ఇండియా నిలిచింది.

 

ఇదీ మిగతా జట్ల పరిస్థితి

శ్రీలంక 4 పాయింట్లతో అయిదో స్థానంలో ఉంది. లంక నెట్ రన్‌రేట్ మైనస్‌ 0.205గా ఉంది. పాకిస్థాన్ అదే 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. పాక్‌ నెట్‌ రన్‌రేట్‌ మైనస్‌ 0.387గా ఉంది. అఫ్ఘానిస్తాన్ కూడా 4 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. అఫ్గాన్‌ నెట్‌ రన్‌రేట్‌ మైనస్‌ 0.969. , బంగ్లాదేశ్ 2 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఇంగ్లండ్ 2 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో.. నెదర్లాండ్స్ 2 పాయింట్లు మరియు నెట్ రన్‌రేట్‌తో 10వ స్థానంలో ఉన్నాయి. ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగుతున్నా  కొద్దీ భారీగా పరుగులు నమోదు అవుతున్నాయి. బ్యాటర్లు భారీ స్కోర్లు నమోదు చేస్తుండగా.... బౌలర్లు కూడా మెరుగ్గా రాణిస్తున్నారు. నాకౌట్‌ దశకు చేరువవుతున్న సమయంలో మ్యాచ్‌లు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. జట్లన్నీ నాకౌట్‌కు చేరడం మీద కన్నేయడంతో మ్యాచ్‌లు మరింత ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. ఇక ప్రపంచకప్‌లో సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం వాకిట బోర్లా పడింది. పాక్ విజయానికి ఒకే ఒక్క వికెట్ దూరంలో నిలిచింది. 

 

సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌ 46.4 ఓవర్లలో 270 పరుగులకు పాక్‌ ఆలౌట్‌ అయింది. పాక్ బ్యాటర్లలో సారధి బాబర్‌ ఆజమ్‌ 50, సౌద్‌ షకీల్‌ 52, షాదాబ్‌ ఖాన్‌ 43 పరుగులతో రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో తబ్రీజ్‌ షమీ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. 271 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు 47.2 ఓవర్లలో కష్టంగా మ్యాచ్‌ను ముగించింది. అయిడెన్‌ మార్‌క్రమ్‌ (91: 93 బంతుల్లో 7×4,3×6)) తృటిలో సెంచరీ మిస్‌ చేసుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో అంపైర్‌ కాల్‌ నిర్ణయంపై టర్బోనేటర్ హర్భజన్‌ సహా నెటిజన్లు మండిపడుతున్నారు. పాకిస్థాన్ ఓటమికి అంపైరింగ్ తప్పిదాలు, బ్యాడ్ రూల్స్ కారణం అయ్యాయని హర్భజన్ ట్వీట్‌ చేశాడు. బంతి వికెట్‌కు తాకుతున్నట్లు తేలితే అంపైర్ నిర్ణయంతో సంబంధం లేకుండా ఔట్ ఇవ్వాలని ఐసీసీకి సూచించాడు.అంపైర్‌ అవుట్‌ ఇస్తే పాకిస్థాన్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించేదని ట్వీట్‌ చేస్తున్నారు.