ICC Unveils Electrifying Anthem For Women’s T20 World Cup 2024:  మహిళల టీ 20 ప్రపంచకప్(Women’s T20 World Cup 2024) ఆరంభానికి సర్వం సన్నద్ధం అవుతున్న వేళ... క్రికెట్ ప్రపంచంలో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ సారి కప్పును అందిపుచ్చుకునే జట్టుపై విశ్లేషణలు, అంచనాలు, అభిప్రాయాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రికెట్ ఫీవర్ ను మరింత పెంచే దిశగా  ఐసీసీ(ICC) టీ 20 ప్రపంచ కప్ అధికారిక పాటను విడుదల చేసింది. ఈ మెగా టోర్నీ ఆరంభానికి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉన్న వేళ... వాటెవర్ ఇట్ టేక్స్ అంటూ పాటను విడుదల చేసింది. ఒక నిమిషం 40 సెకన్ల నిడివి ఉన్న ఈ టీ 20 ప్రపంచకప్ థీమ్ సాంగ్... విడుదలైన కాసేపటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. 


అదిరిపోయిన పాట...
ఐసీసీ టీ 20 ప్రపంచకప్ ధీమ్ సాంగ్ అదిరిపోయింది. ICC మహిళల T20 ప్రపంచ కప్ తొమ్మిదో ఎడిషన్ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ఈపాట విడుదలైంది. మహిళా క్రికెటర్ల ఉత్సాహం , శక్తిని మిళితం చేసి ఏదైనా చేసేద్దాం అని నినదిస్తున్నట్లు ఈ పాటను రూపొందించారు. ఈ పాటతో ఐసీసీ ఈ పొట్టి ప్రపంచకప్ క్రేజ్ను మరింతగా పెంచింది. 'వాటెవర్ ఇట్ టేక్స్' పేరుతో విడుదల చేసిన ఈ థీమ్ సాంగ్...ఆటగాళ్ల భావోద్వేగాలను ఆవిష్కరించింది. మహిళల క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేసిన క్రీడాకారిణుల ప్రయాణాన్ని ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు.





 



ఈ మెగా టోర్నీలో పాల్గొంటున్న జట్లు, గతంలో ట్రోఫీని గెలుచుకున్న జట్ల గెలుపు సంబరాలను కూడా ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో చూసిన క్రికెట్ ఫ్యాన్స్  అందరూ క్రికెట్ ఫీవర్ లో మునిగిపోతున్నారు. ఈ ఒక్క థీమ్ సాంగ్ తో ఐసీసీ మళ్లీ అభిమానులను క్రికెట్ మానియాలోకి తీసుకెళ్లింది. మహిళల టీ20 ప్రపంచకప్ ను  అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు ఐసీసీ కట్టుబడి ఉందని ఐసీసీ జనరల్ మేనేజర్ క్లేర్ ఫర్లాంగ్  ఈ థీమ్ సాంగ్ ను విడుదల చేస్తూ పోస్ట్ చేశారు. ఇప్పటికే క్రికెట్లో మహిళలు, పురుషులకు మధ్య ఉన్న అంతరాలను చెరిపేస్తున్నామని... ఈ థీమ్ సాంగ్ ద్వారా మహిళల క్రికెట్‌కు మరింత గుర్తింపు తీసుకురావడమే తమ లక్ష్యమని కేర్ తెలిపారు. కొత్త తరానికి స్ఫూర్తిని అందించేలా తమ ప్రయాణం ముందుకు సాగుతుందని క్లేర్ వెల్లడించారు. 


ఎవరు కంపోజ్ చేశారంటే


మహిళల టీ 20 ప్రపంచకప్ థీమ్ సాంగ్ వాటెవర్ ఇట్ టేక్స్ ను  ప్రముఖ సంగీత దర్శకుడు మికే మెక్‌క్లియరీ, కంపోజర్ పార్థ్ పరేఖ్  రూపొందించారు. దీనిని బే మ్యూజిక్ హౌస్ నిర్మించింది. ఈ పాటను రూపొందించేందుకు చాలా శోధన చేయాల్సి వచ్చిందని వారు వెల్లడించారు. క్రికెటర్లు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు అభిమానులను కట్టి పడేశాయి. వరల్డ్ కప్ థీమ్ సాంగ్‌ను అన్ని రకాల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి యూఏఈ వేదికగా మహిళల టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. 17 రోజులపాటు అభిమానులను అలరించనున్న ఈ టోర్నీలో విజేతగా ఎవరు నిలుస్తారన్నది క్రీడా ప్రపంచంలో ఉత్కంఠ రేపుతోంది. ఫైనల్ అక్టోబర్ 20న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతుంది.