Mens And Womens T20 World Cup 2024 Logo : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో విశ్వ సమరానికి రంగం సిద్ధమవుతోంది. భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌ను  విజయంవంతంగా నిర్వహించిన ఐసీసీ... 2024లో టీ 20 ప్రపంచకప్‌ నిర్వహణకు సిద్ధమైంది. వెస్టిండీస్‌-అమెరికా సంయుక్తంగా నిర్వహించే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఈ టోర్నీ కోసం అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా  టీ20 ప్రపంచ‌క‌ప్ 2024కు సంబంధించిన లోగోల‌ను ఐసీసీ విడుద‌ల చేసింది. పురుషుల క్రికెట్‌, మ‌హిళ‌ల క్రికెట్‌కు సంబందించిన టీ 20 ప్రపంచకప్‌ లోగోల‌ను విడుద‌ల చేసింది. లోగోల‌పై క్రికెట్ బ్యాట్, బంతితో పాటు ప్లేయ‌ర్ల ఎన‌ర్జీని సూచించే సంకేతం ఉంది. మొత్తంగా ఈ లోగోలు టీ20 క్రికెట్‌ను ప్రతిబింబించేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ కొత్త లోగోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.



 2022 జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో 16 జ‌ట్లు పోటీ ప‌డ‌గా ఈ సారి మాత్రం 20 జ‌ట్లు త‌ల‌ప‌డనున్నాయి. ఐసీసీ 12 జ‌ట్లకు నేరుగా అర్హత క‌ల్పించింది. 2022 టీ20 ప్రపంచ‌క‌ప్‌లో టాప్‌-8 స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్ జ‌ట్లల‌తో పాటు అతిథ్య హోదాలో అమెరికా, వెస్టిండీస్ ల‌తో క‌లిపి మొత్తం 10 జ‌ట్లు నేరుగా అర్హత పొందాయి. టీ20 ర్యాంకింగ్స్‌లో తొమ్మిది, ప‌ది స్థానాల్లో నిలిచిన అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌లు కూడా నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 8 స్థానాల కోసం రీజియ‌న్ల వారీగా క్వాలిఫ‌యింగ్ పోటీల‌ను నిర్వహించి విజేతలను టీ 10 ప్రపంచకప్‌నకు అర్హత కల్పించారు. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భార‌త్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్‌, శ్రీలంక, ద‌క్షిణాఫ్రికా, నెద‌ర్లాండ్స్, యూఎస్‌, వెస్టిండీస్, అఫ్గానిస్థాన్ , బంగ్లాదేశ్‌, కెన‌డా, నేపాల్‌, ఒమ‌న్‌, ప‌పువా న్యూ గినియా, ఐర్లాండ్‌, స్కాంట్లాండ్‌, ఉగాండ‌, న‌బీబియా పాల్గొననున్నాయి.



 భారత్‌ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆఖరి మెట్టుపై టీమిండియా బోల్తా పడింది. ఇక మరో ఆరు నెలల్లో జరిగే టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు భారత జట్టు ప్రణాళికలు రచిస్తోంది. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఓటమిని.. టీ 20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని మరిపించాలని టీమిండియా కోరుకుంటోంది. అయితే ఈ టీ 20 ప్రపంచకప్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ బరిలోకి దిగుతాడా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2022లో జరిగిన టీ20 ప్రపంచ‌క‌ప్ సెమీ ఫైన‌ల్‌లో భార‌త జ‌ట్టు ఓడిపోయిన త‌రువాత ఈ ఫార్మాట్‌లో టీమ్ఇండియా త‌రుపున కోహ్లీ మ‌రో టీ20 మ్యాచ్ ఆడలేదు. దీంతో టీ 20 క్రికెట్‌కు విరాట్‌ వీడ్కోలు పలికినట్లేనని... అతడి స్థానంలో మరో ఆటగాడి ఎంపికపై అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ కసరత్తులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి. మరో ఆరు నెలల్లో వెస్టిండీస్‌, అమెరికాల్లో టీ20 వరల్డ్‌కప్‌ జరుగబోతోంది. ఈ మెగా టోర్నీలో కోహ్లీ అవసరం ఉండకపోవచ్చని చాలామంది వ్యాఖ్యానిస్తుండడం  కలకలం సృష్టిస్తోంది. విరాట్‌ను వన్‌డౌన్‌లో పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనే బీసీసీఐ భావిస్తోందన్న వార్తలు వస్తున్నాయి.