Heath Streak Death: జింబాబ్వే మాజీ క్రికెటర్ హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. గత కొంతకాలంగా   క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. మటబెలెలాండ్‌లో ఉన్న తన వ్యవసాయ క్షేత్రంలో ఆఖరి శ్వాస విడిచారు. ఈ విషయాన్ని జింబాబ్వే  అంతర్జాతీయ ప్రతినిధి  జాన్ రెనీ స్పష్టం చేశారు. క్యాన్సర్‌తో ఇబ్బందిపడుతున్న హీత్ స్ట్రీక్.. తన కుటుంబసభ్యుల సమక్షంలో  ప్రశాంతంగా కన్నుమూశారని  రెనీ ఓ ప్రకటనలో వెల్లడించారు. 49 ఏండ్ల హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరఫున 65 టెస్టులు, 189 వన్డేలు, ఆడాడు.  ఆల్ రౌండర్‌గా సేవలందించిన ఆయన..  ఆ జట్టును విజయపథంలో నడిపించాడు. 


 






కొన్ని  రోజుల క్రితమే హీత్ స్ట్రీక్ మరణించాడన్న వార్త  సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో తాను బాగానే ఉన్నాడని కుటుంబీకులు వెల్లడించిన విషయం తెలిసిందే.  జింబాబ్వే మాజీ బౌలర్ హెన్రీ ఒలాంగా తనకు నివాళి అర్పించిన  నేపథ్యంలో ఆయన స్పందించాడు. దానికి ఆయన తర్వాత హీత్ స్ట్రీక్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు.  


జింబాబ్వే క్రికెట్‌లో లెజెండ్‌గా  ఉన్న స్ట్రీక్.. 1993లో ఆ జట్టులోకి ఎంట్రీ ఇచ్చారు. ఆల్ రౌండర్‌గా జట్టులోకి వచ్చిన స్ట్రీక్.. క్రమక్రమంగా ఎదిగారు. 90, ఈ శతాబ్దపు తొలి దశకంలో ఆయన  తన ఆటతో క్రికెట్ అభిమానులను అలరించారు.   అంతర్జాతీయ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏడేండ్లకు ఆయన జింబాబ్వే సారథిగా నియమితులయ్యారు. ఆయన అంతర్జాతీయ క్రికెట్ ఆడిన సమయంలో స్ట్రీక్ కూడా ప్రపంచ బెస్ట్ ఆల్ రౌండర్లలో ఒకడిగా ఎదిగారు.  


హీత్ స్ట్రీక్ తన కెరీర్‌లో 65 టెస్టులు ఆడి 1,990 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 11 అర్థ సెంచరీలు కూడా ఉన్నాయి.  ఇక బౌలర్‌గా ఆయన  216 వికెట్లు పడగొట్టారు.  ఇందులో ఐదు వికెట్ల ఘనత ఏడు సార్లు నమోదుచేశారు.  వన్డేలలో ఆయన మరింత ప్రభావం చూపారు.  జింబాబ్వే తరఫున  189 వన్డేలు ఆడిన  ఆయన 2,942  పరుగులు సాధించారు. ఇందులో 13 అర్థ  సెంచరీలున్నాయి.  ఎక్కువగా ఐదు లేదా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన స్ట్రీక్.. ఫినిషర్‌గా సేవలందించాడు. వన్డేలలో స్ట్రీక్ 239 వికెట్లు పడగొట్టాడు. 


 






జింబాబ్వే క్రికెట్‌లో టెస్టులతో పాటు వన్డేలలోనూ వంద వికెట్లు తీసిన  అందుకున్న తొలి బౌలర్  హిత్ స్ట్రీక్.  అంతేగాక టెస్టు క్రికెట్‌లో వంద వికెట్లు తీసి వెయ్యి పరుగులు చేసిన తొలి, ఏకైక జింబాబ్వే క్రికెటర్ కూడా ఆయనే కావడం గమనార్హం.  వన్డేలలో కూడా 200 వికెట్లు, 2 వేల పరుగులు  చేసిన  తొలి, ఏకైక వ్యక్తిగా ఉన్నాడు. ఈ రికార్డులు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 


జింబాబ్వే క్రికెట్‌లో స్వర్ణయుగంగా పిలుచుకునే 1997-2002  పీరియడ్‌లో హీత్ స్ట్రీక్ సభ్యుడిగా ఉన్నారు. అప్పుడు జింబాబ్వే టీమ్‌లో ఆండీ ఫ్లవర్ (మొన్నటిదాకా ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ కోచ్), అతడి సోదరుడు గ్రాండీ ఫ్లవర్, హెన్రీ ఒలాంగా, హీత్ స్ట్రీక్ వంటి  దిగ్గజ ప్లేయర్లు జింబాబ్వేకు సంచలన విజయాలు అందించారు. హీత్ స్ట్రీక్‌‌తో పాటు దిగ్గజాలంతా రిటైర్ అయ్యాక జింబాబ్వే క్రికెట్  ప్రభ క్రమంగా తగ్గుతూ వచ్చింది. 
























ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial