Hasaranga Test Retirement: 


శ్రీలంక మిస్టరీ స్పిన్నర్‌ వనిందు హసరంగ (Wanindu Hasaranga) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 26 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌, ఫ్రాంచైజీ క్రికెట్‌కు ఎక్కువగా అందుబాటులో ఉండేందుకే ఇలా చేశాడని సమాచారం. కెరీర్‌ను మరింత పొడగించుకోవడమూ ఒక కారణమని అంటున్నారు. అయితే వివిధ టీ20 లీగుల్లో అతడికి డిమాండ్‌ ఉంది.


హసరంగ రెండేళ్లుగా సుదీర్ఘ ఫార్మాట్‌ ఎక్కువగా ఆడటం లేదు. శ్రీలంక టెస్టు టీమ్‌లో అతడు రెగ్యులర్‌ మెంబర్‌ కాదు. ఈ కాలంలో కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. బంతితో ఆకట్టుకోవడంలో విఫలమయ్యాడు. 100.75 సగటుతో కేవలం 4 వికెట్లే పడగొట్టాడు. అయితే దక్షిణాఫ్రికాపై ఒక అర్ధశతకం సాధించాడు.


సుదీర్ఘ ఫార్మాట్ ఆడనప్పటికీ హసరంగ టెస్టు క్రికెట్‌ ట్రైనింగ్‌ క్యాంపులకు నిరంతరం వెళ్లాల్సి వస్తోంది. అక్కడికి వెళ్లినా చివరి జట్టులోకి ఎంపిక చేయడం లేదు. శ్రీలంక ట్రైనింగ్‌ శిబిరాలకు వెళ్లడం వల్ల ఫ్రాంచైజీ క్రికెట్‌ అవకాశాలను కోల్పోతున్నాడు. ఈ మధ్యే మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంటు నుంచి అయిష్టంగానే తప్పుకోవాల్సి వచ్చింది.


పరిమిత ఓవర్ల క్రికెట్‌ స్పెషలిస్టుగా కెరీర్‌ను పొడగించుకొనేందుకే హసరంగ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడని శ్రీలంక క్రికెట్‌ బోర్డు అంటోంది. విచిత్రంగా అతడు గాయాలతో సుదీర్ఘ కాలం ఇబ్బంది పడిన సందర్భాలేమీ లేవు.


గతంలో తిసారా పెరీరా 20ల్లోనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు ప్రయత్నించాడు. అప్పుడు శ్రీలంక క్రికెట్‌ బోర్డు అతడిని అడ్డుకొంది. హసరంగ విషయంలో మాత్రం అలా చేయలేదు. సుహృద్భావంతోనే వ్యవహరించింది. టెస్టు క్రికెట్లో సత్తా చాటే ఆటగాడిగా అతడిని చూడకపోవమే ఇందుకు కారణం. పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడుతూ లీగుల్లో అవకాశాలు వెతుక్కొనేందుకు అనుమతిస్తోంది.


'మేం హసరంగ నిర్ణయాన్ని అంగీకరిస్తున్నాం. భవిష్యత్తులో అతడు మా పరిమిత ఓవర్ల క్రికెట్లో కీలక పాత్ర పోషిస్తాడన్న విశ్వాసం ఉంది' అని శ్రీలంక క్రికెట్‌ బోర్డు సీఈవో యాష్లే డిసిల్వా అన్నాడు.


కెరీర్లో 48 వన్డేలు ఆడిన హసరంగ 28.77 సగటుతో 67 వికెట్లు తీశాడు. 58 టీ20 ఇంటర్నేషనల్‌ మ్యాచుల్లో 91 వికెట్లు పడగొట్టాడు. 44 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో 102, 91 లిస్ట్‌ ఏ మ్యాచుల్లో 131, 155 T20 మ్యాచుల్లో 17.50 సగటు, 6.85 ఎకానమీతో 208 వికెట్లు తీశాడు. త్వరలో జరిగే ఆసియాకప్‌, ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అతడు కీలక పాత్ర పోషించనున్నాడు.


Also Read: హార్దిక్ పాండ్యా ఆటతీరు భారత జట్టుకు సమస్యే - స్పందించిన వసీం జాఫర్!


Also Read: ఆగస్టు 15 స్పెషల్‌! ప్రపంచకప్‌ టికెట్ల రిజిస్ట్రేషన్‌ మొదలు!