Grand Prairie Stadium Dallas Pitch Report: టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup)మహా సమరానికి రంగం సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యుత్తమమైన 20 దేశాలు పొట్టి ప్రపంచకప్‌ యుద్ధానికి సిద్ధమయ్యాయి. టీ 20 ప్రపంచ కప్‌ ఒడిసి పట్టాలని అగ్ర శ్రేణి జట్లు... అద్భుతాలు సృష్టించాలని పసికూన జట్లు వ్యూహాలు  రచిస్తున్నాయి. ఈ సమరంలో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను వీక్షించేందుకు అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. టీ 20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో అమెరికాతో కెనడా(USA vs CAN ) తలపడనుంది. టీ 20 ప్రపంచ కప్ 2024 ప్రారంభ మ్యాచ్‌లో కెనడాపై గెలిచి తమ అంతర్జాతీయ క్రికెట్‌ ఆరంగేట్రాన్ని ఘనంగా చాటాలని అమెరికా వ్యూహ రచన చేస్తోంది. ఎక్కువ ప్రవాస భారతీయులే జట్టు సభ్యులుగా ఉన్న అమెరికా జట్టు.. ఈ పొట్టి ప్రపంచకప్‌లో అద్భుతాలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఇరవై టాప్ T20 ఆడే దేశాలు తలపడుతున్న ఈ మ్యాచ్‌లో ప్రతీ క్షణం ఆసక్తికరంగా మారనుంది. వరల్డ్ కప్‌లో అమెరికా-కెనడా తలపడడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక టీ 20 సిరీస్‌లో ఇటీవల బంగ్లాదేశ్‌ను ఓడించిన అమెరికా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. కానీ ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీల్లో ఎలా ఆడాలో కెనడాకు తెలుసు. కెనడాను తక్కువగా అంచనా వేస్తే అమెరికా మూల్యం చెల్లించుకోక తప్పదు. అయితే అమెరికా-కెనడా మధ్య మ్యాచ్‌ గ్రాండ్ ప్రైరీ స్టేడియం(Grand Prairie Stadium)లోని పిచ్‌లో జరగనుంది. ఈ పిచ్‌ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


పిచ్‌పైనే అందరి దృష్టి
టీ 20 ప్రపంచకప్‌ను వెస్టిండీస్‌తో కలిసి అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తోంది. ఈసారి అమెరికాలో మ్యాచ్‌లు జరుగుతుండడం ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెటర్లు చాలామంది అమెరికాలోని పిచ్‌లపై మ్యాచ్‌లు ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అక్కడ పిచ్‌లు ఎలా ఉంటాయన్నది క్రికెట్‌ నిపుణులతో పాటు అభిమానుల్లోనూ ఆసక్తి రేపుతోంది. డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలోని పిచ్‌ సీమర్లకు ఉపయుక్తంగా ఉండనుంది. పిచ్‌పైన ఉన్న తేమను ఉపయోగించుకుని పేస్‌ బౌలర్లు ఆరంభంలో చెలరేగిపోయే అవకాశం ఉంది. కొత్త బంతితో పిచ్‌పై సీమ్‌తో బంతి ఇరు వైపులను సీమర్లు స్వింగ్‌ చేసే అవకాశం ఉంది. మెగా టోర్నమెంట్ ఆరంభ మ్యాచ్‌ కాబట్టి పిచ్‌ను చాలా జాగ్రత్తగా రూపొందించినట్లు గ్రాండ్‌ పైరీ పిచ్‌ కూరేటర్‌ తెలిపారు. బంతి బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా సహకరిస్తుందని వెల్లడించారు. మ్యాచ్‌  సాయంకాలం జరగనుండడంతో పేసర్లు కీలక పాత్ర పోషించనున్నారు. స్పిన్నర్ల కంటే పేసర్లే ఎక్కువ ప్రభావం చూపుతారు. కేవలం సీమర్లకే కాకుండా మ్యాచ్‌ జరుగుతున్న కొద్దీ పిచ్‌ బ్యాటర్లకు సహకారం అందించే అవకాశం ఉంది. కాస్త ఓపిగ్గా బ్యాటింగ్‌ చేస్తే ఈ పిచ్‌పై పోరాడే స్కోరును ఉంచవచ్చు.  ఈ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు. కానీ ఇరు జట్లు పోరాడితే మంచి మ్యాచ్‌ను చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.