భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో రోహిత్ సేన వరుస విజయాలతో ఊపు మీదుంది. టాపార్డర్ పరుగుల వరద పారిస్తుండడం.. బౌలర్లు తమ పాత్రను సమర్థంగా పోషిస్తుండడంతో ఆడిన అయిదు మ్యాచుల్లోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన కొనసాగుతోంది. తాజాగా ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాకింగ్స్‌లోనూ భారత బ్యాటర్లు సత్తా చాటారు. ఏకంగా ముగ్గురు టీమిండియా బ్యాటర్లు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో కొనసాగుతున్నారు.
గిల్‌ను ఊరిస్తున్న అగ్రస్థానం
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టాప్ టెన్‌లో ఉన్నారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో 829 రేటింగ్ పాయింట్లతో పాకిస్థాన్ సారధి బాబర్ ఆజమ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్‌గిల్ 823 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. అంటే బాబర్-గిల్‌కు మధ్య వ్యత్యాసం కేవలం ఆరు పాయింట్లే కావడం గమనార్హం. బాబర్ అగ్ర స్థానానికి శుభ్‌మన్ గిల్ అతి చేరువలో ఉన్నాడు. బాబర్ అజామ్ ఈ ప్రపంచకప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో 157 పరుగులే చేయడంతో అతడి రేటింగ్ పాయింట్లు 829కి పడిపోయాయి.
ఈ ప్రపంచకప్‌లో వరుసగా సెంచరీలతో చెలరేగుతున్న సౌతాఫ్రికా బ్యాటర్ క్వింటన్ డికాక్ మూడు స్థానాలు ఎగబాకి 769 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. మరో సౌతాఫ్రికా బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కూడా ఏడు స్థానాలు ఎగబాకి 756 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ ప్రపంచకప్‌లో మంచి టచ్‌లో కనిపిస్తున్న కింగ్ కోహ్లీ 747 పాయింట్లతో వార్నర్‌తో కలిసి సంయుక్తంగా అయిదో స్థానంలో కొనసాగుతున్నాడు. 725 పాయింట్లతో టీమిండియా రోహిత్ శర్మ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు, ముగ్గురు దక్షిణాఫ్రికా బ్యాటర్లు స్థానం దక్కించుకోవడం విశేషం.
సిరాజ్ గురి కూడా అగ్రస్థానంపైనే
బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆసీస్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ 670 పాయింట్లతో అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఆరు వికెట్లు పడగొట్టిన టీమ్ఇండియా ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ సిరాజ్ 668 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. హేజిల్‌వుడ్, సిరాజ్ మధ్య రెండు పాయింట్ల వ్యత్యాసమే ఉంది. మూడో స్థానంలో కేశవ్ మహరాజ్...నాలుగో స్థానంలో రషీద్ ఖాన్ ఉన్నారు. కుల్‌దీప్ యాదవ్ 632 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో నిలిచాడు. టాప్ టెన్‌లో వీరిద్దరూ తప్ప మరే ఇతర భారత బౌలర్‌కు చోటు దక్కలేదు.
ఆల్‌రౌండర్లలలో హార్దిక్ ఒక్కడే
ఆల్‌రౌండర్ల విభాగంలో 324 పాయింట్లతో షకీబ్ అల్ హసన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 301 పాయింట్లో అఫ్గానిస్థాన్ బౌలర్ నబీ రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో సికిందర్ రజా... నాలుగో స్థానంలో రషీద్ ఖాన్ ఉన్నారు. టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 219 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు.
ఆల్‌రౌండర్ల విభాగంలో భారత్ నుంచి హార్దిక్ పాండ్య ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. బౌలర్ల జాబితాలోనూ ఆల్‌రౌండర్ల జాబితాలోనూ టాప్ టెన్‌లో స్థానం దక్కించుకుని రషీద్ ఖాన్, నబీ సత్తా చాటారు. ఆల్‌రౌండర్ల జాబితాలోనూ ఈ ఇద్దరు అఫ్గాన్ ప్లేయర్లకు చోటు దక్కడం విశేషం. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే రెండు విజయాలు సాధించి అఫ్గాన్ సత్తా చాటింది.