Ind vs eng The Oval Test  Latest Updates: ఐదో టెస్టు వేదికైన ద ఓవ‌ల్ మైదానంలో భార‌త హెడ్ కోచ్ గౌతం గంభీర్, పిచ్ క్యూరెట‌ర్ ఫోర్టిస్ మ‌ధ్య కాస్త వాగ్వాదం తాజాగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. దీనిపై తాజాగా టీమిండియా బ్యాటింగ్ కోచ్ సీతాన్షు కోట‌క్ వివ‌ర‌ణ ఇచ్చాడు. ప్రాక్టీస్ చేస్తున్న త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన ఫోర్టిస్ కాస్త దురుసుగా ప్ర‌వ‌ర్తించిన‌ట్లు పేర్కొన్నాడు. నిజానికి ఐదో టెస్టు వికెట్ ను గంభీర్ అండ్ కో చూస్తుండ‌గా, అక్క‌డికి వ‌చ్చిన ఫోర్టిస్.. పిచ్ నుంచి రెండున్న‌ర మీట‌ర్ల దూరం ఉండాల‌ని కాస్త ఘాటుగా చెప్పాడు. అలాగే టీమిండియా స‌పోర్టింగ్ స్టాఫ్ తో కాస్త వాద‌న‌కు దిగాడు. దీంతో గంభీర్ మ‌ధ్య‌లో క‌లుగ జేసుకున్నాడు. ఫోర్టిస్, గంభీర్ మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదం సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. అసలేం జ‌రిగిందో తెలియ‌క క్రికెట్ అభిమానులు చ‌ర్చకు దిగారు. స‌ద‌రు వీడియోపై త‌మ‌కు తోచిన కామెంట్లు చేస్తూ, లైకులు, షేర్లు చేస్తున్నారు. 

నువ్వేం చెప్ప‌క్క‌ర్లేదు..ఇక క్యూరెట‌ర్ ఫోర్టిస్ తో గంభీర్ కాస్త దీటుగా జ‌వాబిచ్చాడు. త‌మ‌కేం చేయాలో చెప్ప జాల‌వ‌ని గంభీర్ పేర్కొన్నాడు. నిజానికి పిచ్ ను ప‌రిశీలించ‌డానికి వ‌చ్చిన టీమిండియా స‌భ్యులు స్పైక్ షూలు ధ‌రించ‌లేదు. మాములు షూలు మాత్ర‌మే వేసుకుని వ‌చ్చారు. దీంతో పిచ్ కు వ‌చ్చిన ఇబ్బందేమీ లేదు. అయిన‌ప్ప‌టికీ, ఫోర్టిస్ ఇందులో క‌లుగ‌జేసుకుని భార‌త స‌భ్య‌లతో వాగ్వాదానికి దిగాడు. దీంతో గంభీర్ క‌లుగ జేసుకుని, వేలు చూపుతూ కాస్త వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఈ వివాదం మొద‌లైంది. మరోవైపు ఫోర్టిస్ వ్య‌వ‌హార శైలిపై తాము కంప్లైంట్ చేయ‌బోమ‌ని టీమ్ మేనెజ్మెంట్ ప్ర‌క‌టించింది. 

చెమ‌టోడ్చిన ప్లేయ‌ర్లు..ఈ వేదికపై ఇంగ్లాండ్, ఇండియా ల మ‌ధ్య మ్యాచ్ గురువారం నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ఇప్ప‌టివ‌కే సిరీస్ లో 2-1తో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో భార‌త్ గెలిస్తే, సిరీస్ స‌మం అవుతుంది. లేక‌పోతే, 3-1తో ఇంగ్లాండ్ సొంతం అవుతుంది. దీంతో ఈ మ్యాచ్ లో గెలుపు టార్గెట్ గా టీమిండియా బ‌రిలోకి దిగుతోంది. మంగ‌ళవారం ప్రాక్టీస్ కు అంద‌రి కంటే ముందుగా సాయి సుద‌ర్శ‌న వ‌చ్చాడు. తొలి టెస్టు త‌ర్వాత నాలుగో టెస్టులో చోటు ద‌క్కించుకున్న సాయి.. చాలా సేపు సాధ‌న చేశాడు. నాలుగో టెస్టులో ఒక అర్ధ సెంచ‌రీతోపాటు డ‌కౌట్ అయ్యాడు. దీంతో ఈ మ్యాచ్ లో రాణించాల‌ని భావిస్తున్నాడు. అలాగే పేసర్ అర్ష‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ కూడా చాలాసేపు ప్రాక్టీస్ చేశారు. ఏదేమైనా ఫోర్టిస్ తో గంభీర్ సంవాదం ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ గా మారింది.