Gary Kirsten Comments: 2011 వన్డే ప్రపంచకప్ ను ఏ భారత అభిమాని మర్చిపోలేడు. 28 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ ను భారత్ సాధించింది. వన్డేల్లో భారత్ సాధించిన ఆఖరి ప్రపంచకప్ కూడా అదే. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కప్పు కలను నిజం చేసింది కూడా ఈ ఎడిషనే. అయితే ఈ ఎడిషన్ లో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలక పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఓవరాలగా 362 పరుగులు, 15 వికెట్లు తీసి, జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే అలాంటి యువరాజ్ సింగ్ ను తొలుత ఈ టోర్నీ కోసం పరిగణించలేదని తాజాగా వెల్లడైంది. అప్పటి టీమిండియా కోచ్ గ్యారీ కిర్ స్టెన్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించాడు. 2010లో పూర్ ఫామ్ కారణంగా తనను ప్రపంచకప్ జట్టులోకి ఎంపిక చేయకూడదని సెలెక్టర్లు భావించారని, అయితే అప్పటి వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనీతోపాటు తాను కూడా యూవీ ఉండాలని పట్టుబట్టి, అతడిని ఎంపిక చేయించినట్లు వెల్లడించాడు.
అపార అనుభవం..సొంతగడ్డపై మెగా టోర్నీ జరుగుతుండటంతో యూవీ లాంటి స్పిన్ ఆల్ రౌండర్ జట్టు కెంతో అవసరమని తాను, ధోనీ భావించినట్లు కిర్ స్టెన్ తెలిపాడు. ఫామ్ ను పక్కన పెట్టి, అనుభవానికే పెద్ద పీట వేసి, యూవీని టీమ్ లోకి తీసుకున్నామని పేర్కొన్నాడు. ఇందుకోసం తాము చాలా గట్టిగా ఫైట్ చేసినట్లు, ఎట్టకేలకు యూవీని టీమిండియాలోకి తీసుకున్నామని తెలిపాడు. ఆ తర్వాత యూవీ ఆ టోర్నీలో మాయాజాలం చేసి, అటు బ్యాట్ తోనూ, ఇటు బంతితోనూ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ముంబైలో జరిగిన ఫైనల్లో ధోనీ సొగసరి సిక్సర్ కొట్టి, భారత కప్పు కలను తీర్చాడు. దీంతో యావత్ భారతం ఆనంద డోలికల్లో మునిగిన సంగతి తెలిసిందే.
ఫిట్ నెస్ పై దృష్టి..ఇక యూవీ తన పూర్వపు లయను అందుకోవడంలో అప్పటి స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ కండిషన్ కోచ్, స్ట్రాటజిక్ లీడర్షిప్ మెంబర్ ప్యాడీ అప్టన్ ఎంతగానో సాయం చేశాడని కిర్ స్టెన్ గుర్తు చేసుకున్నాడు. ముందుగా యూవీ ఫిట్ నెస్ ను మెరుగుపర్చి, ఆ తర్వాత తన మునుపటి ఆటతీరును అందుకోవడంలో ఆప్టన్ హెల్ప్ చేశాడని తెలిపాడు. యూవీ కూడా ఇందుకోసం ఎంతగానో కష్టపడి, అంకిత భావం ప్రదర్శించడాని తెలిపాడు. ఇక తమ మధ్య ఎంతో సన్నిహిత సంబంధం ఉందని, యూవీ బ్యాటింగ్ చేస్తే చూడటానికి రెండు కళ్లు సరిపోవని ప్రశంసించాడు. ఏదేమైనా కిర్ స్టెన్ కోచింగ్ లోనే వన్డే ప్రపంచకప్ సాధించడంతో అతడిని భారత అభిమానులు ఎల్లప్పుడు గుర్తు పెట్టుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. 2011 తర్వాత మూడు వన్డే ప్రపంచకప్ లు ఆడిన భారత్.. 2015లో క్వార్టర్ ఫైనల్, 2019లో సెమీఫైనల్, 2023లో ఫైనల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2013, 2025లో మాత్రం ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో రెండుసార్లు ఐసీసీ వన్డే ట్రోఫీలను భారత్ దక్కించుకో గలిగింది.