NZ vs PNG T20 World Cup Highlights: టీ 20 ప్రపంచకప్‌ (T20 World Cup)లో న్యూజిలాండ్‌(New Zealand ) సీమర్‌ ఫెర్గ్యూసన్‌(Lockie Ferguson) సంచలనం సృష్టించాడు. ఏ బౌలర్‌కు సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకుని క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచాడు. పసికూన పపువా న్యూగినియా( Papua New Guinea)తో జరిగిన మ్యాచ్‌లో బంతితో నిప్పులు చెరిగాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసిన ఫెర్గ్యూసన్‌ ఒక్క పరుగుకు కూడా ఇవ్వకుండా మూడు వికెట్లు తీసుకుని చరిత్ర సృష్టించాడు. పెర్గ్యూసన్‌ పొట్టి క్రికెట్‌లో అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఈ ప్రదర్శనతో కివీస్‌ విజయంతో టీ 20 ప్రపంచకప్‌ నుంచి వీడ్కోలు పలికింది. మరోవైపు న్యూజిలాండ్ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఈ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 



ఫెర్గ్యూసన్ పంజా
 పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన న్యూజిలాండ్ మరో ఆలోచన లేకుండా బౌలింగ్‌ ఎంచుకుంది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌లో మొదలైన వికెట్ల పతనం ఆ తర్వాత క్రమం తప్పకుండా సాగింది. రెండో ఓవర్‌లో పపువా ఓపెనర్‌ టోని ఉరాను అవుట్‌ చేసిన సౌథీ.... వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. కేవలం 2 బంతుల్లో ఒకే పరుగు చేసి ఉరా పెవిలియన్‌ చేరాడు. దీంతో మూడు పరుగులకే పపువా తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కివీస్‌ ఫెర్గూసన్ పదునైన బంతులతో పసికూనను అల్లాడించాడు. అసలు ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో బ్యాట్‌కు బంతి తగలడమే గగనమైపోయింది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో కనీసం ఒక్క పరుగైనా చేయలేకపోయారు. కచ్చితమైన లైన్‌ అండ్‌ లెంత్‌తో విరుచుకుపడ్డ ఫెర్గూసన్‌ 24 బంతులు విసిరి ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా నాలుగు మెయిడిన్లు చేశాడు. టీ 20 ప్రపంచకప్‌లో ఇలా బౌలింగ్‌ చేసిన బౌలర్‌ ఇప్పటివరకూ మరొకరు లేదు. దీంతో ఫెర్గూసన్‌ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ 20 క్రికెట్‌లో అత్యంత పొదుపుగా  బౌలింగ్‌ చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అసద్‌ వాలా, చార్లెస్‌ అమినీ, చాద్‌ సోపర్‌ను అవుట్‌ చేసిన ఫెర్గూసన్‌ పపువాను దెబ్బ కొట్టాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి ఒక్క పరుగు కూడా  ఇ‌వ్వకుండా ఫెర్గూసన్‌ మూడు వికెట్లు తీశాడు. మిగిలిన కివీస్‌ బౌలర్లు కూడా రాణించడంతో పపువా కేవలం 78 పరుగులకే కుప్పకూలింది. పపువా బ్యాటర్లలో ఏ ఒక్కరూ కూడా 20 పరుగుల మైలురాయిని దాటలేదు. చార్లెస్‌ అమినీ 17 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఎనిమిది మంది బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. కివీస్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 3, సౌధీ, ట్రెంట్‌ బౌల్ట్‌, ఇష్‌ సోదీ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. 


 సునాయసంగా
 79 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ మరో 46 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడే వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. పపువా బౌలర్‌ మోరియా ఇన్నింగ్స్‌ రెండో బంతికే ఫిన్‌ అలెన్‌ను అవుట్‌ చేయడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారుతుందా అని అనిపించింది. అయితే డేవిన్ కాన్వే, కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ డేరిల్‌ మిచెల్‌ కివీస్‌కు సునాయస విజయాన్ని అందించారు. దీంతో కివీస్‌ విజయంతో టీ 20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌తో ట్రెంట్‌ బౌల్ట్‌ టీ 20 ప్రపంచకప్‌ ప్రస్థానం కూడా ముగిసింది.