Ind Vs Eng Lord's Test Updates: టీమిండియా చేతిలో రెండో టెస్టులో ఓటమితో ఇంగ్లాండ్ తన పంథా మార్చింది. ఇప్పటివరకు తమ బ్యాటింగ్ కు తగినట్లుగా ఫ్లాట్ వికెట్లు రెడీ చేసి, ఫాయిదా పొందాలని భావించినా, గత టెస్టులో బొక్కా బోర్లా పడటంతో వ్యూహం మార్చింది. ఈనెల 10 నుంచి క్రికెట్ మక్కాగా పేరొందిన లార్డ్స్ మైదానంలో జరిగే మూడో టెస్టుకు లైవ్ లీ పిచ్ ను రూపొందించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎక్కువ బౌన్స్, పేస్, సైడ్ మూవ్మెంట్ ఉండేలా పిచ్ ను రూపొందించనున్నట్లు లార్డ్స్ క్యూరెటర్లు పేర్కొంటున్నారు. దీంతో తొలి రెండు టెస్టుల్లో నమోదైనట్లు పరుగుల పండుగ ఉండకుండా, అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు అనుకూలించే విధంగా సమతూకంతో పిచ్ ను తయార చేసినట్లు సమాచారం. ఇక మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టులో మార్పులు తప్పనిసరిగా ఉండే అవకాశముంది. ముఖ్యంగా పేస్ బౌలింగ్ రెండు మార్పులు ఖాయమని తెలుస్తోంది.
ఇద్దరు పేసర్లు రెడీ..అంతగా అనుభవం లేని పేసర్లతో బరిలోకి దిగి, రెండు టెస్టుల్లో భారీగా పరుగులు సమర్పించుకున్న ఇంగ్లాండ్.. మూడో టెస్టులో తమ తుదిజట్టులో మార్పులు చేయనుంది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తుది జట్టులోకి రావడం ఖాయంగా మారింది. గత నాలుగున్నర ఏళ్ల నుంచి తను టెస్టు ఆడలేదు. చివరగా 2021 ఫిబ్రవరిలో బరిలోకి దిగాడు. మోచేతి, వెన్నునొప్పితో తను ఎక్కువగా బెంచ్ కే పరిమితమయ్యాడు. అయితే గాయం నుంచి కోలుకుని ఫ్రెష్ గా కనిపిస్తున్న ఆర్చర్.. మూడో టెస్టులో ఆడేది ఖాయమని తెలుస్తోంది. ఇటీవలే తను సస్సెక్స్ తరపున కౌంటీ క్రికెట్ ఆడి, సత్తా చాటాడు. ఈ క్రమంలో తనను తుదిజట్టులో ఆడించనున్నారు. మరో మార్పు కూడా ఖాయంగా కనిపిస్తోంది.
అట్కిన్సన్ అందుబాటులో..మరో పేసర్ గస్ అట్కిన్సన్ కూడా అందుబాటులోకి వచ్చాడు. తొలి రెండు టెస్టులకు పక్కటెముకల గాయంతో తను దూరమయ్యాడు. ప్రస్తుతం తను కోలుకోవడంతో మూడో టెస్టు స్క్వాడ్ లో తనను ప్లేస్ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే తను ఆడటం ఖాయమే. లార్డ్స్ మైదానంలో తనకు అద్భుత రికార్డు ఉందని గణాంకాలు పేర్కొంటుండటంతో ఈ మ్యాచ్ లో అతడు బరిలోకి దిగడం గ్యారెంటీ అని తెలుస్తోంది. దీంతో ఇంగ్లాండ్ బౌలింగ్ కూడా పటిష్టంగా మారనుంది. వీరిద్దరూ జట్టులోకి వస్తే, బ్రైడెన్ కార్స్, జోష్ టంగ్ పెవిలియన్ కు పరిమితమవడం ఖాయం. మరోవైపు మ్యాచ్ కు రెండు రోజుల ముందు తుది జట్టును ప్రకటించే ఇంగ్లాండ్ ఇంకా ప్లేయింగ్ లెవన్ ప్రకటించలేక పోవడానికి కారణం.. తుదిజట్టుపై ఇంకా కసరత్తు కొనసాగుతుండటమేనని పలువురు భావిస్తున్నారు. ఇక ఐదు టెస్టుల టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో తొలి మ్యాచ్ ను ఐదు వికెట్లతో ఇంగ్లాండ్, రెండో టెస్టును 336 పరుగులతో ఇండియా గెలుచుకున్న సంగతి తెలిసిందే.