India vs England 1st Test At Rajiv Gandhi International Stadium: హైదరాబాద్‌(Hyderabad) వేదికగా భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లాండ్‌ స్టార్‌ బ్యాటర్‌  జో రూట్(Joe Root) అరుదైన రికార్డును సృష్టించాడు. భారత్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో విదేశీ బ్యాటర్‌గా రూట్‌ నిలిచాడు. ఈ జాబితాలో రికీ పాంటింగి 2, 555 పరుగులు చేసి అగ్ర స్థానంలో ఉండగా... సరిగ్గా 2,555 పరుగులు చేసి జో రూట్‌ కూడా అదే స్థానంలో కొనసాగుతున్నాడు. రూట్‌ ఇంకొక్క పరుగు చేస్తే భారత్‌పై అత్యధిక పరుగులు చేసిన విదేశీ క్రికెటర్‌గా రూట్‌ చరిత్ర సృష్టిస్తాడు. కానీ జడేజా బౌలింగ్‌లో రూట్ (29) ఔటయ్యాడు.

 

మ్యాచ్‌ సాగుతుందిలా...

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ బ్యాటర్లను భారత స్పిన్నర్లు ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఓపెనర్లు దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్‌ ఆరంభంలో పటిష్టంగానే కనిపించింది. 11 ఓవర్లకు 53 పరుగులతో బజ్‌బాల్‌ ఆటను బ్రిటీష్‌ జట్టు గుర్తు చేసింది. కానీ స్పిన్నర్లు రంగ ప్రవేశంతో మ్యాచ్‌  స్వరూపమే మారిపోయింది.  రెండో సెషన్‌ ముగిసే సరికి ఇంగ్లాండ్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. రెండో సెషన్‌లో ఇంగ్లాండ్‌ 31 ఓవర్లు ఆడి 107 పరుగులు రాబట్టింది. క్రీజ్‌లో కెప్టెన్ బెన్‌ స్టోక్స్ (43*), మార్క్‌ వుడ్ (7*) ఉన్నారు.  ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ ఖాతాలోనే తొలి వికెట్ చేరింది. అశ్విన్‌ బౌలింగ్‌లో 35 పరుగలు చేసిన డకెట్‌ అవుటయ్యాడు. డకెట్‌ డీఆర్‌ఎస్‌కు వెళ్లినా ఫలితం ఇంగ్లాండ్‌కు అనుకూలంగా రాలేదు. సమీక్షలో ‘అంపైర్స్‌ కాల్’ రావడంతో డకెట్‌ పెవిలియన్‌ బాట పట్టాడు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లాండ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సారధి రోహిత్‌ సూపర్‌ క్యాచ్‌తో ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. జడేజా బౌలింగ్‌లో ఓలీపోప్‌ స్లిప్‌లో రోహిత్‌కు దొరికాడు. దీంతో 58 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ రెండో వికెట్‌ నష్టపోయింది. అనంతరం సిరాజ్‌ సూపర్బ్‌ క్యాచ్‌కు మూడో వికెట్‌ పడింది. అశ్విన్‌ వేసిన 16వ ఓవర్‌ తొలి బంతికే మిడాఫ్‌లో సిరాజ్‌ మియా అద్భుతమైన క్యాచ్‌కు  ఓపెనర్‌ క్రాలే అవుటయ్యాడు. దీంతో 60 పరుగుల వద్ద ఇంగ్లాండ్‌ మూడో వికెట్‌ నష్టపోయింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి ఇంగ్లాండ్‌ స్కోరు 108/3 పరుగులతో నిలిచింది. అనంతరం అక్షర్‌ పటేల్‌ సూపర్‌ డెలివరీకి బెయిర్‌ స్టో క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. 

 

చరిత్ర సృష్టించిన అశ్విన్‌

హైదరాబాద్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌(Ravichandran Ashwin) చరిత్ర సృష్టించాడు. ప్రపంచ  టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో 150 వికెట్లు తీసిన మొదటి భారత బౌలర్‌గా నిలిచాడు. తొలి టెస్టులో బెన్ డకెట్, జాక్ క్రాలేను ఔట్ చేసిన అశ్విన్‌.. ఈ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ  టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో ఈ అరుదైన మైలు రాయిని అందుకున్న మూడో బౌలర్‌గా అశ్విన్‌ రికార్డు సృష్టించాడు.

 

మరో రికార్డు

ఈ మ్యాచ్‌లో అశ్విన్‌- రవీంద్ర జడేజా జోడి అరుదైన రికార్డును నెలకొల్పారు. అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత జోడీగా వీరిద్దరూ నిలిచారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు 504 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు అనిల్‌ కుంబ్లే - హర్భజన్ సింగ్ 501 వికెట్లు తీయగా.. వీరిద్దరూ ఆ రికార్డును బద్దలు కొట్టారు.