Cricketers at Anant Ambani Pre Wedding Ceremony: వ్యాపార దిగ్గజం, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ రెండవ కుమారుడు అనంత్‌ అంబానీ- రాధిక మర్చంట్‌ల ప్రీ-వెడ్డింగ్‌ వేడుకలు మొదలయ్యాయి. ముంబై ఇండియ్స్(Mumbai Indians) ఫ్రాంచైజీ య‌జ‌మాని ముఖేశ్ అంబానీ చిన్న‌ కుమారుడు అనంత్‌ అంబానీ ప్రీ -వెడ్డింగ్ (Anant Ambani Pre-Wedding) వేడుక‌కు మాజీ ఆట‌గాళ్లంతా త‌ర‌లివెళ్తున్నారు. మాజీ సార‌థి ఎంఎస్ ధోనీ(MS Dhoni), స‌చిన్ టెండూల్క‌ర్‌(Sachin Tendulkar)లు కుటుంబంతో క‌లిసి  పెండ్లి కార్యక్రమాలలో  పాల్గొనేందుకు వెళ్లారు. శుక్ర‌వారం ముంబై విమానాశ్ర‌యంలో మ‌హీ, స‌చిన్‌లు కుటుంబ స‌మేతంగా కనిపించగానే కెమెరాలు క్లిక్ మనిపించారు.  అలాగే మాజీ పేస‌ర్ జ‌హీర్ ఖాన్, ప‌వ‌ర్ హిట్ట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్, ముంబై ఇండియ‌న్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా,  కృనాల్ పాండ్యాలు కుటుంబ స‌మేతంగా హాజ‌రుకానున్నారు. 




ఇక కొత్త జంట విషయానికి వస్తే అనంత్ అంబానీతో రాధిక స్నేహం ఇప్పటిది కాదు. బాల్యం నుంచి కొనసాగుతోంది. అనంత్‌కు అనారోగ్యంతో ఉన్నప్పుడు తోడుగా ఉన్నది రాధికానే అని సన్నిహితులు చెబుతుంటారు. అనంత్‌కు అన్నివిధాలా తోడుగా ఉంటూ.. ధైర్యాన్ని ఇచ్చింది ఆమేనని.. తిరిగి ఆరోగ్యంతో కోలుకోనేందుకు ఎంతో సహకరించిందని అంటారు. అందుకే, అంబానీ కుటుంబానికి ఆమె చాలా స్పెషల్ అంటారు. 



రాధిక మర్చంట్ కూడా సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయే. ఎ‌న్‌కోర్ హెల్త్‌కేర్ వ్యవస్థాపకులు వీరేన్ మర్చంట్, శైలా మర్చంట్‌ల చిన్న కుమార్తె. అయితే, అనంత్, రాధిక కలిసి చదువుకోలేదు. వీరంతా సంపన్నులు కావడం వల్ల ఒకరి ఫంక్షన్స్‌కు మరొకరు హాజరయ్యేవారు. వారి సర్కిల్స్‌లో జరిగే వేడుకల్లో బిలినియర్ల పిల్లలంతా కలిసేవారు. అలా రాధిక, అనంత్ మధ్య స్నేహం కుదిరింది. అప్పటి నుంచి రాధిక.. అంబానీ ఫ్యామిలీకి దగ్గరయ్యింది. వారి ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్‌లో రాధిక మర్చంట్ ఉండాల్సిందే. చివరికి ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ పెళ్లిలో కూడా సందడంతా రాధికాదే. పెళ్లి వేడుకలో ఇషా చేయి పట్టుకుని నడవడంతో అంతా.. ఎవరా అమ్మాయి అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఆమె అనంత్ గర్ల్‌ఫ్రెండ్ అని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. 


వివాహ సమయంలో ముఖేష్ అంబానీ(Mukesh Ambani) చాలా పెద్దమనసు  చాటుకున్నారు. తన కుమారుడి వివాహ వేడుకలకు చుట్టుపక్కల గ్రామాల వారందరినీ ఆహ్వానించారు. పెళ్లికి ముందే వారందరికీ అన్నసేవా కార్యక్రమంలో భాగంగా విందు భోజనాలు వడ్డించారు. రిలయన్స్ టౌన్‌షిప్‌కు సమీపంలోని జోగ్‌వాడ గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖేశ్ అంబానీతోపాటు వధూవరులు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన సామాన్యులకు స్వయంగా ముఖేశ్ అంబానీనే కొసరికొసరి వడ్డించారు. తమ బిడ్డను ఆశీర్వదించాల్సిందిగా అందిరినీ కోరారు. గుజరాతీ సంప్రదాయ వంటకాలను విందుభోజనంలో చేర్చారు. అందరికీ స్వీట్లు వడ్డించిన ముఖేష్అంబానీ వారి కళ్లల్లో ఆనందాన్ని ప్రత్యక్షంగా చూశారు. నూతన వధూవరులను ఆయన గ్రామస్తులకు పరిచయం చేశారు. విందు భోజనం అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో గ్రామస్తులతో కలిసి ముఖేష్అంబానీ కుటుంబం పాల్గొంది. వారితో కలిసి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో వధువు కుటుంబ సభ్యులు సైతం పాల్గొన్నారు.