BCB refuses to play T20 World Cup 2026 in India:   2026 టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు తమ జట్టును పంపేది లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు  మరోసారి స్పష్టం చేసింది. డాకాలో గురువారం క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్, సీనియర్ ఆటగాళ్లు ,  బోర్డు సభ్యుల మధ్య జరిగిన కీలక సమావేశం తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. భారత్‌లో భద్రతా పరమైన ఆందోళనలు ఇంకా తొలగిపోలేదని, అందుకే తమ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. ఈ నిర్ణయం పూర్తిగా తమ ప్రభుత్వానిదేనని ఆసిఫ్ నజ్రుల్ స్పష్టం చేశారు.

ఐసీసీ 24 గంటల అల్టిమేటం 

బంగ్లాదేశ్ అభ్యర్థనను అంతర్జాతీయ క్రికెట్ మండలి  తిరస్కరించింది. భారత్‌లో ఆటగాళ్లకు ఎలాంటి ముప్పు లేదని స్వతంత్ర భద్రతా సంస్థల నివేదికలు చెబుతున్నాయని ఐసీసీ పేర్కొంది. టోర్నీ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు షెడ్యూల్ మార్చడం అసాధ్యమని, బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి 24 గంటల సమయం ఇస్తున్నామని హెచ్చరించింది. ఒకవేళ బంగ్లా రాకపోతే, వారి స్థానంలో గ్రూప్-సి లో  స్కాట్లాండ్‌ ను చేరుస్తామని ఐసీసీ బోర్డు ఇప్పటికే ఓటింగ్ ద్వారా నిర్ణయించింది.

బీసీబీ ఘాటు స్పందన 

ఐసీసీ అల్టిమేటంపై బీసీబీ ప్రెసిడెంట్ అమీనుల్ ఇస్లాం ఘాటుగా స్పందించారు. ఒక అంతర్జాతీయ సంస్థ ఇలాంటి అల్టిమేటం ఇవ్వడం సరికాదు. మా దేశంలో 20 కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఉన్నారు, మేము లేకపోతే ఐసీసీకే భారీ నష్టం  అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే శ్రీలంకను  కో-హోస్ట్ అని పిలవడాన్ని ఆయన తప్పుబట్టారు, ఇది కేవలం  హైబ్రిడ్ మోడల్ మాత్రమేనని అన్నారు. ఐసీసీ సమావేశంలో జరిగిన కొన్ని చర్చలు దిగ్భ్రాంతికి గురిచేశాయని, తమ పోరాటం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.                       

 బంగ్లా క్రికెట్ భవిష్యత్తుపై ఆందోళన                                            

రాజకీయ ద్వేషంతో తీసుకుంటున్న ఈ నిర్ణయాలు బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగితే, భవిష్యత్తులో ఐసీసీ నుంచి వచ్చే నిధులు,  ఇతర దేశాలతో ద్వైపాక్షిక సిరీస్‌లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా భారత్ వంటి బలమైన క్రికెట్ బోర్డుతో సంబంధాలు దెబ్బతినడం వల్ల బంగ్లాదేశ్ ఆర్థికంగా కూడా కుప్పకూలే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఐసీసీ తన డెడ్‌లైన్ తర్వాత ఏ రకమైన కఠిన చర్యలు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది.