పాకిస్తాన్ క్రికెట్‌లో పెద్ద గొడవే జరుగుతోంది. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో ఆ జట్టు దారుణ ప్రదర్శనతో చెలరేగిన విమర్శలు చినికి చినికి గాలివానలా మారాయి. పాక్ పరాజయాల పరంపరకు కెప్టెన్ బాబర్ ఆజమ్‌దే బాధ్యతంటూ విమర్శల జడివాన కురుస్తోంది. ఆప్ఘానిస్తాన్ వంటి జట్లపై కూడా పాక్ ఓడిపోవడంతో అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో బాబర్ అజామ్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అవ్వడం కలకలం రేపుతోంది. ఇంతకీ ఆ లీకేజీ కథేంటంటే..
ఇంటర్వ్యూలో పర్సనల్ చాట్ లీక్...
కొన్ని రోజులుగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ జాకా అష్రాఫ్‌ను కాంటాక్ట్ అవ్వడానికి కెప్టెన్ బాబర్ ఆజమ్ ప్రయత్నిస్తున్నాడని, కానీ అష్రాఫ్ మాత్రం స్పందించడం లేదని మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ ఆరోపించాడు. అయితే రషీద్ లతీఫ్ వ్యాఖ్యలపై స్పందించిన జాకా అష్రాఫ్.. బాబర్ తనను కాంటాక్ట్ చేసే ప్రయత్నమేమీ చేయలేదన్నాడు. ఇందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తూ.. బాబర్ ఆజమ్‌కు సంబంధించిన పర్సనల్ చాట్స్‌ను ఓ టీవీ ఇంటర్వ్యూలో లీక్ చేశాడు. బాబర్, పీసీబీ చీఫ్ మధ్య జరిగిన చాట్‌ను అందరికీ చూపించాడు. ఇలా చాట్‌ను బయటపెట్టడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే లీకైన చాటింగ్‌కు సంబంధించి అది ఎంత మేరకు నిజమో తెలియాల్సి ఉంది.
బాబర్‌కు వెల్లువెత్తుతున్న మద్దతు
బాబర్ ఆజమ్ పర్సనల్ చాట్ లీక్ చేయడంపై పాక్ మాజీ క్రికెటర్లు భగ్గుమంటున్నారు. ఆటగాడి పర్సనల్ చాట్స్‌ను బయటపెట్టడాన్ని పాకిస్థాన్ మాజీ విధ్వంసకర ఓపెనర్ షాహిద్ అఫ్రిది తప్పుబట్టాడు. ఒక ఆటగాడి పర్సనల్ చాట్స్ అసలు ఎలా బయటపెడతారని నిలదీశాడు. ఇంతకన్నా చెత్త పని మరొకటి ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలా ఒక వ్యక్తి ప్రైవేట్ చాట్స్ లీక్ చేయడం దిగజారుడుతనంతో సమానం అని పేర్కొన్నాడు. ఎవరివైనా వ్యక్తిగత మెసేజ్‌లను టీవీలో ఎలా చూపిస్తారని ప్రశ్నించిన అఫ్రిదీ.. అది కూడా మన కెప్టెన్ మెసేజ్‌లు ఎలా చూపిస్తారని నిలదీశాడు. మన ఆటగాళ్లనే మనం ఇంతగా అవమానిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ పని పీసీబీ ఛైర్మన్ చేసినా అది తప్పే అని కుండబద్దలు కొట్టాడు. పాకిస్థాన్ జట్టుకు పీసీబీ నుంచి సరైన సహకారం లేదని, గత 5 నెలలుగా జీతాలు ఇవ్వలేదని.. అందుకే పీసీబీ చీఫ్‌తో బాబర్ మాట్లాడేందుకు ప్రయత్నించినట్లు ప్రచారం జరుగుతోంది. రషీద్ లతీఫ్ మాత్రం బాబర్‌కు అండగా నిలిచాడు. టీం చెత్త ప్రదర్శనకు కేవలం బాబర్‌ను బాధ్యుడిని చేయకూడదన్నాడు.
బాబర్ అజామ్, పీసీబీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సల్మాన్ నసీర్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ లీక్ అయింది. పీసీబీ చీఫ్ జకా అష్రఫ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. అతడే ఈ చాట్‌ని లీక్ చేశాడని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే లీకైన చాటింగ్‌కు సంబంధించి అది ఎంత మేరకు నిజమో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఈ ప్రైవేటు లీకేజీ సంభాషణలపై మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా బాబర్‌కు అండగా నిలిచాడు. బాబర్‌ను దయచేసి వదిలేయండని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు వకార్ ట్వీట్ చేశాడు.