Asia Cup Team India Squad | ముంబై: ఆసియా కప్ కోసం బీసీసీఐ 15 మంది ఆటగాళ్లు, 5 మంది స్టాండ్ బై ప్లేయర్ల పేర్లను మంగళవారం ప్రకటించింది. అయితే ఈ లిస్ట్ చూసిన తరువాత అందరికీ వచ్చిన అనుమానం శ్రేయర్ అయ్యర్‌ను జట్టు నుంచి తొలగించడం. అదేనండీ ఆసియా కప్ కోసం శ్రేయస్ బ్యాటర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని బీసీసీఐ సెలక్షన్ కమిటీతో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌పై విమర్శలు వస్తున్నాయి. 

స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను ఆసియా కప్ జట్టు నుండి ఎందుకు తొలగించారో అర్థం కాలేదని భారత క్రికెట్ జట్టు మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ అన్నారు. మంగళవారం నాడు బీసీసీఐ ఈ టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించడం తెలిసిందే. దీనిపై అభిషేక్ నాయర్ 'జియోహోట్‌స్టార్'లో మాట్లాడుతూ, "శ్రేయాస్ అయ్యర్‌ను 20 మంది సభ్యుల జట్టులో ఎందుకు చేర్చలేదో నాకైతే అర్థం కావడం లేదు. నేను 15 మంది ఆటగాళ్లు గురించి కాదు గానీ, స్టాండ్ బై 20 మంది ఆటగాళ్లు గురించి మాట్లాడుతున్నాను. శ్రేయాస్ అయ్యర్ సెలెక్టర్ల దృష్టిలో లేడని స్పష్టమైంది. కనీసం టీ20 ఫార్మాట్ పరంగానైనా అతడ్ని ఎంపిక చేయాల్సింది" అని అన్నారు.

శ్రేయస్ అయ్యర్ చేసిన తప్పు ఏంటి?" - అశ్విన్ ప్రశ్న 

ఆసియా కప్ జట్టులో శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై రవిచంద్రన్ అశ్విన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ 'ఐష్ కి బాత్' లో మాట్లాడుతూ, ఎంపిక అనేది సరైన ఆటగాళ్లను బయటక కూర్చోబెట్టడం కాదు. శ్రేయస్ అయ్యర్, యశస్వీ జైస్వాల్ లాంటి ఆటగాళ్లకు న్యాయం జరగలేదు. కనీసం ఇప్పటివరకు వారిద్దరితో ఎవరైనా మాట్లాడి ఉండవచ్చు. ఇంతకీ శ్రేయస్ అయ్యర్ చేసిన తప్పు ఏంటి? కెప్టెన్‌గా అతను కోల్‌కతా నైట్ రైడర్స్‌కు IPL 2024 టైటిల్ అందించాడు. 2014 తర్వాత కెప్టెన్‌గా పంజాబ్ కింగ్స్ జట్టును మొదటిసారి ఫైనల్‌కు చేర్చాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ చేర్చడంలో బ్యాటర్‌గానే కాదు కెప్టెన్‌గా మరోసారి నిరూపించుకున్నాడు. షార్ట్ బాల్ బలహీనతను అధిగమిస్తూ  రబాడా వంటి బౌలర్లపై పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సెలక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏకంగా ఆసియా కప్ జట్టులోనూ అయ్యర్‌కు అవకాశం ఇవ్వకపోవడం సరికాదని’ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఏడాది తరువాత టీ20 జట్టులోకి గిల్

బీసీసీఐ కమిటీ టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఆసియా కప్ జట్టులో చేర్చింది. వాస్తవానికి జూలై 2024 తర్వాత శుభ్‌మన్ గిల్ టీ20 మ్యాచ్‌లు ఆడలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కీలక టోర్నీకి గిల్ ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయ్యర్ IPL 2025లో అద్భుత ప్రదర్శన చేశాడు. అతను సీజన్‌లో 17 మ్యాచ్‌లలో 50.33 సగటుతో 604 పరుగులు చేయడం సెలెక్టర్లకు కనిపించలేదా అని ప్రశ్నించాడు. తాజా ఐపీఎల్ సీజన్లో అయ్యర్ ఆరు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకుంది.

కాగా, IPL 2025లో శుభ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను 15 మ్యాచ్‌లలో 155.88 సగటుతో 650 పరుగులు సాధించాడు. ఇందులో 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. కానీ శుభ్‌మన్ గిల్ భారత్ తరపున 21 టీ20 మ్యాచ్‌లు ఆడగా, ఇందులో 30.42 సగటుతో 578 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలోనూ సెంచరీలు సాధించిన కొద్దిమంది భారత బ్యాటర్లలో గిల్ ఒకడు. గిల్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-2తో సమం చేసింది. దాంతో గిల్ కు వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇవ్వడంతో పాటు ఏడాది తరువాత భారత జట్టులోకి వచ్చాడు.