India vs Pakistan, Pakistan Playing XI: శనివారం ఆసియా కప్‌ 2023లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో జరగనుంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌కు పాకిస్తాన్ తన తుది జట్టును ముందు రోజే (శుక్రవారం) ప్రకటించింది.


పూర్తి ఫిట్‌గా షహీన్ అఫ్రిది
మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌కు శుభవార్త లభించింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ షహీన్ అఫ్రిది భారత్‌తో మ్యాచ్‌కు ముందు పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. పాకిస్తాన్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. నేపాల్‌పై ఏ జట్టుతో ఆడిందో, పాకిస్తాన్ అదే జట్టుతో బరిలోకి దిగనుంది.


భారత్‌పై పాకిస్తాన్ తుది జట్టు
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), ఇఫ్తికర్ అహ్మద్, సల్మాన్ అఘా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, హరీస్ రవూఫ్, నసీమ్ షా, షహీన్ షా ఆఫ్రిది. 


వర్షం విలన్‌గా మారుతుందా?
భారత్, పాకిస్తాన్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం ముప్పు కూడా పొంచి ఉంది. బాలగోళ తుపాను శనివారం భారీ వర్షం కురిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌పై వర్షం ప్రభావం పడవచ్చు. వాతావరణ నివేదిక ప్రకారం మ్యాచ్ ప్రారంభానికి ముందు క్యాండీలో వర్షం కురిసే అవకాశం 68 శాతం వరకు ఉంది. మ్యాచ్ జరిగే సమయంలో రోజంతా మేఘావృతమై అడపాదడపా వర్షం కురవనుందని నివేదికల ద్వారా తెలుస్తోంది.


వర్షం కారణంగా రద్దయితే ఏం అవుతుంది?
ఒకవేళ వర్షం కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ చొప్పున ఇస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ జట్టు మూడు పాయింట్లతో సూపర్-4కు అర్హత సాధిస్తుంది. అనంతరం తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో నేపాల్‌పై విజయం సాధించడం భారత జట్టుకు చాలా ముఖ్యం. పాక్‌తో మ్యాచ్‌ రద్దయ్యాక నేపాల్‌పై టీమిండియా ఓడిపోతే ఆసియాకప్‌ నుంచి దాదాపు నిష్క్రమించినట్టే. కాబట్టి సంచలనాలకు ఏమాత్రం తావివ్వకూడదు.