Asia Cup 2023, IND Vs PAK: ఆసియా కప్ - 2023లో భాగంగా  రోహిత్ శర్మ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు  శనివారం (సెప్టెంబర్ 2) చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో  తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ ద్వారానే వచ్చే నెలలో జరుగనున్న వన్డే వరల్డ్ కప్‌ సన్నాహకాలతో పాటు ఆసియా కప్ వేటనూ ఘనంగా ఆరంభించాలని భారత్ కోరుకుంటున్నది. మరి పటిష్టమైన  పాకిస్తాన్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే   భారత్ తుది జట్టు ఎలా ఉండనుంది..? కెఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన వేళ.. వికెట్ కీపర్‌తో పాటు మిడిలార్డర్‌లో నెంబర్ 4 స్థానం ఎవరిది..? ఓపెనర్లుగా  ఎవరు బరిలోకి దిగుతారు..?  వంటి విషయాలు ఇక్కడ చూద్దాం. 


ఇషాన్ ఎంట్రీ.. కానీ ఎక్కడ..?


పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ సాధించకపోవడంతో కెఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దీంతో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత్  తప్పకుండా  జట్టులో ఉన్న మరో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇషాన్ వస్తే అతడిని  ఓపెనర్‌గా పంపాలా..? లేక మిడిలార్డర్‌లో ఆడించాలా..? అన్నది కూడా ద్రావిడ్, రోహిత్‌కు ఫజిల్‌లా మారింది. పాక్ పేసర్ షహీన్ షా అఫ్రిది తొలి ఓవర్లలో చాలా ప్రమాదకారి.  గతంలో  రోహిత్ శర్మను అఫ్రిది ఇబ్బందులకు గురిచేశాడు. వికెట్ లోపలికి చొచ్చుకుని వచ్చే ఇన్‌స్వింగర్స్‌తో  టీమిండియా టాపార్డర్‌ను ముప్పుతిప్పలు పెట్టేందుకు అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లు ప్రణాళికలు సిద్ధం చేసిన నేపథ్యంలో వాటిని ధీటుగా ఎదుర్కునేందుకు టీమిండియా ఇషాన్‌ను ఓపెనర్‌గా పంపితేనే బెటర్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇషాన్.. తొలి ఓవర్లలో ఎటాకింగ్ గేమ్ ఆడి  మానసికంగా ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తాడు.


ఇషాన్ ఓపెనింగ్ చేస్తే రోహిత్ మూడో స్థానానికి  వెళ్తాడు. అప్పుడు టీమిండియాను చాలాకాలంగా ఇబ్బందిపెడుతున్న నెంబర్ 4 ప్లేస్ కూడా పూర్తవుతుంది. ఆ స్థానాన్ని కోహ్లీ భర్తీ చేస్తాడు. శ్రేయాస్ అయ్యర్ ఫిట్ అయిన నేపథ్యంలో అతడు  ఐదో స్థానంలో వస్తాడు.  ఆ తర్వాత  హార్ధిక్ పాండ్యా,  రవీంద్ర జడేజాలతో భారత  బ్యాటింగ్ లైనప్ దుర్బేధ్యంగానే ఉంది.  కానీ రోహిత్ - శుభ్‌మన్ గిల్ ఓపెనర్లుగా వస్తే మాత్రం.. ఈ ఆర్డర్‌లో మార్పులు ఉండొచ్చు.  కోహ్లీ వన్ డౌన్‌లో వస్తే ఇషాన్ లేదా అయ్యర్ నాలుగో స్థానంలో రావాల్సి ఉంటుంది. 


సూర్యకు నో ప్లేస్.. 


ఐసీసీ టీ20 ర్యాంకులలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్.. వన్డేలలో మాత్రం తేలిపోతుండటంతో అతడికి పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందా..? అన్నది అనుమానంగానే ఉంది. ఇటీవల వెస్టిండీస్ వేదికగా ముగిసిన  వన్డే సిరీస్‌లో కూడా సూర్య.. తొలి రెండు వన్డేలలో విఫలమయ్యాడు.  అయ్యర్ రాకతో మిడిలార్డర్‌లో సూర్యకు  చోటు లేకుండా పోయింది. 


శార్దూల్ ఎంట్రీ.. అక్షర్‌కు డౌటే.. 


భారత్ - పాక్  మ్యాచ్ జరిగే పల్లెకెల పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుంది. నిన్న బంగ్లాదేశ్ - శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో పేసర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. లంక పేసర్ పతిరాన నాలుగు వికెట్లు తీయగా  మరో పేసర్ కసున్ రజిత వికెట్లు తీయకున్నా మెరుగైన ప్రదర్శన చేశాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం కూడా  రాణించారు. లంక బ్యాటర్లు వీరి బౌలింగ్‌లో పరుగులు రాబట్టడానికి ఇబ్బందులు పడ్డారు. దీనిని పరిగణనలోకి తీసుకుంటే భారత జట్టు కూడా రెండో స్పిన్నర్ జోలికి పోకుండా నలుగురు పేసర్లతో బరిలోకి దిగే అవకాశాలున్నాయి. బుమ్రా రీఎంట్రీతో బౌలింగ్ దళానికి అతడు నాయకత్వం వహించనున్నాడు.   సిరాజ్, షమీలకు తోడుగా శార్దూల్ ఠాకూర్‌ను కూడా ఆడించే యోచనలో టీమ్ మేనేజ్‌మెంట్ ఉంది. శార్దూల్ బ్యాటింగ్ చేయగల సమర్థుడు.  నలుగురు పేసర్లతో వెళ్లాలనుకుంటే అక్షర్ పటేల్ బెంచ్‌కే పరిమితం కాకతప్పదు. ఒకవేళ రోహిత్.. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో వెళ్తే మాత్రం కుల్దీప్‌ యాదవ్‌తో పాటు అక్షర్‌కూ ప్లేస్ దక్కనుంది. ఆల్ రౌండర్లుగా   హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు సేవలందించనున్నారు.  ఏదైనా  పిచ్ పరిస్థితులు చూశాకే  టీమిండియా  తుది నిర్ణయం తీసుకోనుంది.  


పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు భారత తుది జట్టు (అంచనా) : రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా,  రవీంద్ర జడేజా,  కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా 















ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial