Kumble Master Piece Bowling: భారత దిగ్గజ స్పిన్నర్, మాజీ హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నాడు. సరిగ్గా 26 ఏళ్ల కిందట 1999, ఫిబ్రవరి 7న పాకిస్థాన్ పై ఒకే ఇన్నింగ్స్ లో పది వికెట్ల ప్రదర్శన చేసిన క్లిప్పింగ్ ను పోస్టు చేశాడు. ఈ సందర్భంగా ఈ క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చాడు.
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన రెండో టెస్టులో కుంబ్లే పది వికెట్లు తీసుకున్నాడు. అప్పటి క్షణాలను చూసి ఆనందిస్తున్నా, ఆ ఘనత సాధించడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ప్రేక్షకుల కేరింతలు, సహచరుల ప్రొత్సహం మధ్య తను ఈ ఘనతను సాధించానని, అది ఎప్పటికీ ప్రత్యేకమని వ్యాఖ్యానించాడు. అప్పటి ఎనర్జీని మరిచిపోలేనని, ఇలాంటి మధురానుభూతికి కారకులైనవారందరికీ తను థాంక్స్ చెప్పాడు. కుంబ్లే పది వికెట్ల ప్రదర్శన ప్రపంచ క్రికెట్లో ప్రకంపనలు రేపింది. ఆ మ్యాచ్ జరిగిన తెల్లారి పత్రికల పతాకా శీర్షికల్లో ఈ విషయమే దర్శనమిచ్చింది.
43 ఏళ్ల తర్వాత.. టెస్టు క్రికెట్ చరిత్రలో పదికి పది ఒకే ఇన్నింగ్స్ లో తీసిన ఆటగాడు అప్పటికి ఒకరే ఉండేవారు. అతనే ఇంగ్లాండ్ గ్రేట్ పేసర్ జిమ్ లేకర్. తను 1956లో ఆస్ట్రేలియాపై 53 పరుగులిచ్చి పదికి పది వికెట్లు తీశాడు. మళ్లీ ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధ్యమవడానికి 43 ఏళ్లు పట్టింది. ఈ మధ్యలో చాలామంది తొమ్మిది వికెట్లతో లేకర్ సమీపానికి వచ్చినా, అతడిని చేరలేకపోయారు. ఇక ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానం (ప్రస్తుతం అరుణ్ జైట్లీ స్టేడియం)లో జరిగిన రెండో టెస్టులో కుంబ్లే ఈ ఘనత సాధించాడు. 74 పరుగులిచ్చి పది వికెట్లు ఒక ఇన్నింగ్స్ లో తీశాడు. దీంతో దిగ్గజాల సరసన నిలిచాడు. మళ్లీ ప్రపంచ క్రికెట్లో ఈ ఘనతను న్యూజిలాండ్ కు చెందిన అజాజ్ పటేల్ రిపీట్ చేశాడు. ముంబైలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో తను పది వికెట్లు తీశాడు. 2021 డిసెంబర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో 119 పరుగులకు పది వికెట్లు తీశాడు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడం కొసమెరుపు.
సిరీస్ సమం చేసిన భారత్..ఇక రెండో టెస్టుకు ముందు భారత్ ఒత్తిడిలో నిలిచింది. రెండు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టు ఓడిపోయి 0-1తో వెనుకంజలో నిలిచింది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత్ 252 పరుగులు చేయగా, కుంబ్లే, హర్భజన్ సింగ్ రాణించి పాక్ ను171 పరుగులకే కట్టడి చేశారు. ఇక రెండో ఇన్నింగ్స్ లో 339 పరుగులు చేసిన భారత్.. 80 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని 420 పరుగుల భారీ టార్గెట్ ను పాక్ ముందుంచుంది. అయితే ఓపెనర్లు సయ్యద్ అన్వర్, షాహిద్ ఆఫ్రిది రెచ్చిపోయి ఆడటంతో తొలి వికెట్ కు వందకు పైగా భాగస్వామ్యం నమోదైంది. దీంతో ఒత్తడిలో నిలిచిన భారత్ ను కుంబ్లే ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత ఆఫ్రిదిన ఔట్ చేసి పాక్ పతనానికి బాటలు వేసిన జంబో.. అదే ఓవర్లో ఎజాజ్ అహ్మద్ ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. అదే జోరులో ఒకటి తర్వాత ఒక్కో వికెట్ తీస్తూ మొత్తం పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. చివరి వికెట్ తీశాక జంబో సంభరాలు చూసి, అటు స్టేడియంలోని ఆటగాళ్లు, ప్రేక్షకులు పులకరించిపోయారు. ఈ మ్యాచ్ విజయంతో సిరీస్ ను 1-1తో భారత్ డ్రాగా ముగించింది.
Also Read: Viral Video: గంభీర్ తో రోహిత్ తో మంతనాలు.. మ్యాచ్ అనంతరం సుదీర్ఘ సంభాషణ