Eng VS Ind Anderson-Tendulkar Trophy Latest News:  ఇండియా, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన అండ‌ర్స‌న్-టెండూల్క‌ర్ ట్రోఫీ ఉత్కంఠ‌భ‌రితంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. 25 రోజుల‌పాటు జ‌రిగిన ఐదు టెస్టులూ ప్ర‌తీ రోజు క్రికెట్ ప్రేమికుల‌కు మాజాను పంచింది. ఇక పీక్ స్టేజిలో ఉన్న‌ప్పుడు ఆట‌గాళ్లు ప‌ర‌స్ప‌రం దూష‌ణ‌లు చేసుకుని, రెచ్చ‌గొట్టేలా ప్ర‌వ‌ర్తించారు. మూడో టెస్టులో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభంలో ఇలానే జ‌రిగింది. అలాగే ఐదో టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్ డ‌కెట్ ఔటైన సంద‌ర్భంలో అత‌నిపై చేతులు వేసి, ఏదో మాట్లాడుతూ.. భార‌త పేస‌ర్ ఆకాశ్ దీప్ సెండాప్ చెప్ప‌డం కూడా వివాదస్ప‌ద‌మైంది. నిజానికి ఆరోజు డ‌కెట్ తో ఆకాశ్ దీప్ ఏదో మాట్లాడ‌గా, భార‌త సీనియ‌ర్ కేఎల్ రాహుల్ .. ఆకాశ్ దీప్ ను నిలువ‌రించ‌డం కూడా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. తాజాగా ఈ ఘ‌ట‌న‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెట‌ర్ స్పందించాడు. 

చ‌ర్య‌లు తీసుకోవాలి..ఐదో టెస్టులో అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన ఆకాశ్ దీప్ పై ఐసీసీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డకెట్ కోచ్ జేమ్స్ నాట్ డిమాండ్ చేశాడు. జెంటిల్మ‌న్ గేమ్ అయిన క్రికెట్ లో ఇలాంటి వాటికి తావుండ‌ద‌ని, ఇప్ప‌టికైనా ఐసీసీ ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు చెక్ పెట్టాల‌ని పేర్కొన్నాడు. నిజానికి ఇంగ్లాండ్ క్రికెట్లో ఇలాంటి ఘ‌ట‌న‌ల‌ను సీరియ‌స్ గా తీసుకుంటామ‌ని చెప్పాడు. గ‌తంలో క్ర‌మ‌శిక్ష‌ణ ఉల్లంఘించినందుకు గాను డ‌కెట్ పై చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని, కొన్నిసార్లు బెంచ్ కే ప‌రిమితం చేసిన‌ట్లు వెల్ల‌డించాడు. అయితే ఇలాంటి సంఘ‌ట‌న‌లు చాలా త‌క్కువ‌గా డ‌కెట్ జీవితంలో ఉన్నాయ‌ని పేర్కొన్నాడు. 

మార్పు వ‌స్తుంది..అనుచితంగా ప్ర‌వ‌ర్తించిన‌ప్పుడు, త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటే ఆట‌గాళ్ల‌లో ప‌రిణ‌తి పెరుగుతుందని జేమ్స్ నాట్ వ్యాఖ్యానించాడు. గ‌తంలో పోలిస్తే, డ‌కెట్ ఇప్పుడు మెచ్యూర్ గా ప్ర‌వ‌ర్తిస్తున్నాడ‌ని ప్ర‌శంసించాడు. మ‌రోవైపు రోజురోజుకు డ‌కెట్ త‌న ఆట‌తీరును మెరుగుప‌ర్చుకుంటున్నాడ‌ని, గ‌తంలో స్వీచ్ హిట్, రివ‌ర్స్ స్వీప్ ఆడేవాడ‌ని, ఇప్పుడు ఆర్తోడాక్స్ స్వీప్ కూడా ఆడుతున్నాడ‌ని ప్ర‌శంసించాడు. ఇక అండ‌ర్స‌న్- టెండూల్క‌ర్ ట్రోఫీలో అత్యంత విజ‌య‌వంత‌మైన ప్లేయ‌ర్లలో డ‌కెట్ ఒక‌డుగా నిలిచాడు. ఐదు టెస్టుల్లో త‌ను 462 ప‌రుగులు సాధించాడు. అత‌ని స‌గ‌టు 52కి ద‌గ్గ‌ర‌గా ఉండ‌గా, స్ట్రైక్ రేట్ 82కి పైగా న‌మోదైంది. ఆటాకింగ్ ప్లేయ‌ర్ గా ఇంగ్లాండ్ కు శుభారంభాలు అందించ‌డంలో డ‌కెట్ కీల‌క‌పాత్ర పోషించాడు.  ఇక హోరాహోరీగా సాగిన ఐదు టెస్టుల అండర్సన్- టెండూల్కర్ ట్రోఫీ 2-2తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి, మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా, రెండు, ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగో టెస్టు డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.