ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెటర్ల జీవితాల్లో పెను మార్పులను తీసుకువస్తుంది. ఐపీఎల్ కొత్త ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందడమే కాకుండా, పాత ఆటగాళ్లకు పునరాగమనం చేసే అవకాశాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ సీజన్‌లో కూడా ఇలాంటి అద్భుతాలను చూడవచ్చు. ఐపీఎల్ 16వ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అజింక్య రహానే మళ్లీ వన్డే జట్టులోకి వచ్చేలా కనిపిస్తున్నాడు.


వాస్తవానికి ఈ ఏడాది చివర్లో భారత్‌లో వన్డే ప్రపంచకప్‌ జరగనుంది. 2019 వరల్డ్ కప్ లాగే ఈసారి కూడా టీమ్ ఇండియా ముందు నాలుగో నంబర్ సమస్య తలెత్తింది. గత మూడేళ్లలో శ్రేయాస్ అయ్యర్ నాలుగో స్థానంలో అద్భుత ప్రదర్శన చేయడం ద్వారా ఆ లోటు తెలియకుండా చేశాడు. అయితే అయ్యర్‌కు ఇటీవల వెన్నులో శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అతను ప్రపంచకప్ సమయానికి ఫిట్‌గా ఉంటాడా లేదా అనే విషయంపై ఏమీ చెప్పలేం.


మార్చిలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ను ప్రయత్నించింది. అయితే కెప్టెన్ రోహిత్ శర్మ వేసిన ఈ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. మూడు మ్యాచ్‌ల్లోనూ సూర్యకుమార్ యాదవ్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఇది మాత్రమే కాదు సూర్యకుమార్ యాదవ్‌కు ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చింది. అతను కేవలం 24 సగటుతో 433 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అటువంటి పరిస్థితిలో సూర్యకుమార్ యాదవ్‌ను నాలుగో నంబర్‌కు ప్రత్యామ్నాయంగా చూడలేం.


అజింక్య రహానేకు మంచి అనుభవం
మరోవైపు అజింక్య రహానే ఐపీఎల్ 16వ సీజన్‌లో ఎక్కువగా పరుగులు చేయడమే కాకుండా అతని స్ట్రైక్ రేట్ కూడా అద్భుతంగా ఉంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో రహానే 52 సగటు, 199 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తున్నాడు. అజింక్య రహానే ఫామ్ అతన్ని నాలుగో నంబర్‌కు బలమైన పోటీదారుగా మారుస్తోంది. వన్డేల్లో ఆడిన అనుభవం కూడా రహానేకి ఉంది.


అయితే 2018లో చివరిసారిగా వన్డే జట్టులో ఆడే అవకాశం రహానేకి దక్కింది. అజింక్య రహానే వన్డే కెరీర్ గురించి చెప్పాలంటే అతను 90 వన్డేల్లో 87 ఇన్నింగ్స్‌ల్లో 2962 పరుగులు చేశాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 35 కాగా, స్ట్రైక్‌ రేట్ 79గా ఉంది. వన్డేల్లో మూడు సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు అజింక్య రహానే పేరు మీద ఉన్నాయి.


ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు (WTC Final 2023) టీమ్‌ఇండియాను ప్రకటించారు. పదిహేను మందితో కూడిన జట్టును సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. చాలా రోజుల తర్వాత 'మిస్టర్‌ డిపెండబుల్‌' అజింక్య రహానెకు చోటు దక్కింది. జూన్‌ 7 నుంచి 11 వరకు మ్యాచ్‌ జరుగుతుంది. జూన్‌ 12ను రిజర్వు డేగా ప్రకటించారు. లండన్‌లోని ఓవల్‌ మైదానం ఇందుకు వేదిక. డబ్ల్యూటీసీ పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియాలతో హిట్‌మ్యాన్‌ సేన తలపడుతుంది.


టీమ్‌ఇండియాకు దొరికిన అద్భుతమైన ఆటగాళ్లలో అజింక్య రహానె (Ajinkya Rahane) ఒకడు. దేహానికి దూరంగా వెళ్తున్న బంతుల్ని చక్కగా ఆడతాడు. స్వింగ్‌, సీమ్‌, క్రాస్‌ సీమ్‌, స్పిన్‌ను బాగా ఎదుర్కొంటాడు. విదేశాల్లో పేసర్లు వేసే బంతుల్ని అడ్డంగా ఆడగలడు. ఏడాది కాలంగా అతడు ఫామ్‌లో లేడు. దాంతో వైస్‌ కెప్టెన్సీ నుంచి తొలగించారు. దక్షిణాఫ్రికాలో కౌప్‌టౌన్‌ టెస్టు నుంచి పక్కన పెట్టేశారు. ఆ పర్యటనలో 6 ఇన్సింగ్సుల్లో అతడు 136 పరుగులే చేశాడు.