Afghanistan seal semifinal qualification with 8-run win: నరాలు తెగే ఉత్కంఠ.. బంతి బంతికి మారిన ఆధిక్యాలు.. ఆటగాళ్ల భావోద్వేగాలు... వర్షం అంతరాయాలు.. ఆటగాళ్ల ఆస్కార్‌ నటనలు... అమ్మో... అన్నా ఇన్నా అఫ్గాన్‌- బంగ్లాదేశ్‌ మధ్య జరిగిన సూపర్‌ ఎయిట్‌(Super8) పోరు... మామూలుగా సాగలేదు. సెమీస్‌ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో.. విజయం కోసం అఫ్గాన్‌(Afg) అద్భుతంగా పోరాడింది. తమకు నామమాత్రపు మ్యాచ్‌ అయినా బంగ్లా(Ban) తేలిగ్గా పరాజాయాన్ని అంగీకరించలేదు. దీంతో ఈ రెండు జట్ల మధ్య ఈ టీ 20 ప్రపంచకప్‌లోనే హైలెట్‌ మ్యాచ్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసి స్వల్ప స్కోరే చేసిన అఫ్గాన్‌.. ఆ తర్వాత అద్భుత బౌలింగ్‌తో బంగ్లాదేశ్‌ను తక్కువ పరుగులకే పరిమితమైంది. అఫ్గాన్‌ విజయానికి అడ్డుగోడగా నిలిచిన లిట్టన్‌ దాస్‌ ఓపెనర్‌గా బరిలోకి చివరి వరకూ అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో చిరస్మరణీయ విజయం సాధించిన అఫ్గాన్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించగా... అద్భుతంగా పోరాడిన బంగ్లాదేశ్‌ సంతృప్తిగా టీ 20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.


𝐖𝐇𝐀𝐓 𝐀 𝐌𝐎𝐌𝐄𝐍𝐓 𝐅𝐎𝐑 🇦🇫



Afghanistan are through to the #T20WorldCup 2024 semi-final 👏 pic.twitter.com/wugQg90R0I


— ICC (@ICC) June 25, 2024


తక్కువ పరుగులే..

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన అఫ్గానిస్థాన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అసలే బౌలింగ్‌ అనుకూలిస్తున్న పిచ్‌పై బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. పలుమార్లు ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. అఫ్గాన్‌ ఓపెనర్లు రహ్మతుల్లా గుర్బాజ్‌-ఇబ్రహీం జద్రాన్‌ అఫ్గాన్‌కు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించారు. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలిస్తుండడంతో రన్‌రేట్‌ను ఆరు పరుగులకు తక్కువ కాకుండా అఫ్గాన్‌ ఓపెనర్లు ఓ ప్రణాళిక ప్రకారం ఆడారు. పది ఓవర్లకు 59 పరుగులు జోడించిన అనంతరం అఫ్గాన్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 29 బంతుల్లో 18 పరుగులు చేసిన జద్రాన్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే గుర్బాజ్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. 55 బంతుల్లో 43 పరుగులు చేసి గుర్బాజ్‌ అవుటయ్యాడు. ఆ తర్వాత బంగ్లా బౌలర్లు పట్టు బిగించారు. తర్వాత వచ్చే అఫ్గాన్‌ బ్యాటర్లను పరుగులు చేయకుండా అడ్డుకున్నారు. దీంతో పరుగుల రాక బాగా తగ్గిపోయింది. ఒమ్రాజాయ్‌ 10, గుల్బదీన్‌ నైబ్‌ 4, నబీ 1 పరుగుకే పెవిలియన్‌ చేరారు . కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కేవలం 10 బంతులు ఆడి 3 సిక్సర్లతో 19 పరుగులు చేయడంతో అఫ్గాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.

 

లిట్టన్‌ దాస్‌ ఒక్కడే

116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌... చివరి ఓవర్‌ వరకూ పోరాడింది. రెండో ఓవర్‌లోనే తొలి వికెట్‌ కోల్పోయిన బంగ్లాదేశ్‌... లక్ష్య ఛేదనలో తడబడుతున్నట్లే కనిపించింది. కానీ లిట్టన్‌ దాస్‌ ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన బ్యాటర్లందరూ అవుట్‌ అవుతున్నా లిట్టన్‌ మాత్రం అఫ్గాన్‌ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. అఫ్గాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసినా లిట్టన్‌ దాస్‌ మాత్రం పోరాడాడు. లిట్టన్‌ పోరాటంతో ఓ దశలో బంగ్లాదేశ్‌ గెలిచేలా కనిపించింది. కానీ అఫ్గాన్ పోరాటాన్ని ఆపలేదు. వరుసగా వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్‌ను ఒత్తిడిలోకి నెట్టాలని చూసింది. కానీ లిట్టన్‌ దాస్‌ మాములుగా ఆడలేదు. 49 బంతుల్లో అయిదు ఫోర్లతో ఒక సిక్స్‌తో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవైపు బంగ్లాదేశ్‌ ఆలౌట్‌ అయినా లిట్టన్‌దాస్‌ మాత్రం నాటౌట్‌గా నిలిచాడు. చివరి ఎనిమిది బంతుల్లో ఆరు పరుగులు కావాల్సిన దశలో నవీనుల్‌ హక్‌ వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి అఫ్గాన్‌కు చరిత్రలో నిలిచిపోయే విజయాన్ని అందించాడు.