Noor Ali Zadran bids farewell to international cricket: అఫ్గానిస్థాన్ (Afghanistan )స్టార్ ప్లేయ‌ర్ నూర్ అలీ జద్రాన్(Noor Ali Zadran) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 15 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల ఈ ఓపెనర్ ఒక సెంచరీ, ఏడు అర్ధసెంచరీలు సాధించాడు. అఫ్గాన్‌ తరపున జద్రాన్‌ రెండు టెస్టులు, 51 వ‌న్డేలు, 23 టీ20 మ్యాచ్ లు ఆడాడు . 2009లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారి జద్రాన్‌ అ ఫ్గాన్‌ తరపున బరిలోకి దిగాడు. ఫస్ట్‌ మ్యాచ్‌లో 28 బంతుల్లో 45 పరుగులు చేసిన జద్రాన్..  గత వారం ఐర్లాండ్‌తో తన చివరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. ఐర్లాండ్‌తో ఏకైక టెస్టులో అత‌డు చివ‌రిసారి అఫ్గనిస్థాన్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికిన జ‌ద్రాన్‌కు అఫ్గాన్ క్రికెట్ బోర్డు శుభాకాంక్షలు తెలిపింది. 



సుదీర్ఘ కెరీర్‌...
టీ20ల్లో అరంగేట్రం చేసిన జ‌ద్రాన్.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్‌పై హాఫ్ సెంచ‌రీ బాదాడు. అనంత‌రం 2023లో మ‌ళ్లీ జ‌ట్టులోకి వ‌చ్చిన జ‌ద్రాన్.. ఆసియా గేమ్స్‌లోనూ ఆడాడు. అతడి అద్బుత ప్రద‌ర్శన‌తో అఫ్గ‌న్ జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. 35 ఏళ్ల ఓపెనర్ త‌న కెరీర్ లో ఒక సెంచరీ, ఏడు అర్ధ సెంచరీలతో సహా 1216 వ‌న్డే పరుగులు చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి 2010లో తన టీ20 అరంగేట్రం చేశాడు. చివరిసారిగా 2023లో టీ20 మ్యాచ్ ఆడాడు. ఆసియా క్రీడలలో టీ20 మ్యాచ్ ల కోసం ఆఫ్ఘనిస్తాన్ జట్టులోకి వ‌చ్చాడు. ఆసియా క్రీడలలో శ్రీలంక, పాకిస్తాన్‌పై వరుసగా 51, 39 పరుగులు చేశాడు. భార‌త్ తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్దు కావ‌డంతో ఇక్కడ టాప్ లో నిలిచిన భార‌త్ టోర్నీ టైటిల్ ను గెలుచుకుంది. 


ఆ ఇద్దరూ ఐపీఎల్‌ ఆడతారా..
ఆఫ్గాన్‌ క్రికెటర్లు ముజీబుర్‌ రెహ్మాన్‌, నవీనుల్‌ హక్‌, ఫజల్‌ హక్‌ ఫరూఖీలకు అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. వచ్చే రెండేళ్ల పాటు లీగుల్లో ఆడడం కోసం ఈ ఆటగాళ్లకు నిరభ్యంతర పత్రాలు ఇవ్వకూడదని అఫ్గానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తోంది. దీంతో ఈ ముగ్గురు ఆటగాళ్లు  ఐపీఎల్‌లో ఆడడం సందిగ్ధంలో పడింది. అఫ్గాన్‌ జట్టు ప్రయోజనాల కంటే కూడా సొంత ప్రయోజనాలకే వీరు ప్రాధాన్యం ఇస్తున్నారని అఫ్గాన్‌ క్రికెట్‌ బోర్డు భావిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 1 నుంచి మొదలయ్యే వార్షిక సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తమను తప్పించాలని ఈ ముగ్గురు ఆటగాళ్లు ఏసీబీని కోరడంతో ఈ వివాదం మొదలైంది. ఈ ముగ్గురి కాంట్రాక్టులపై నిర్ణయాన్ని వాయిదా వేసిన ఏసీబీ.. వీళ్లపై విచారణకు ఓ కమిటీని కూడా నియమించింది. ఈ నెలలో జరిగిన ఐపీఎల్‌ వేలంలో ముజీబ్‌ను రూ.2 కోట్లకు కోల్‌కతా తీసుకుంది. నవీనుల్‌ను లఖ్‌నవూ, ఫరూఖీని సన్‌రైజర్స్‌ అట్టిపెట్టుకున్నాయి. ఇప్పుడు వీరికి ఎన్‌ఓసీ వస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.  ఐపీఎల్‌ ఎంతోమంది ఆటగాళ్ల జీవితాలను మలుపుతిప్పింది. ఈ లీగ్‌లో ఆడితే డబ్బుకు డబ్బు, మంచి క్రేజ్‌ కూడా సంపాదించుకుకోవచ్చని ఆటగాళ్లు భావిస్తుంటారు. ప్రపంచంలోనే ధనిక లీగ్‌లో ఆడాలని ఆటగాళ్లు కలలు కంటుంటారు. తనకు ప్రపంచ అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాలని ఉందని పాక్‌ పేసర్‌ హసన్ అలీ అన్నాడంటే ఈ లీగ్‌ ప్రాముఖ్యత తెలుసుకోవచ్చు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన లీగ్‌లో ఆడాలని భావిస్తున్న అఫ్గానిస్థాన్‌ క్రికెటర్లకు షాక్‌ తగిలింది.